అంతర్జాతీయం

ఉద్రిక్తతలను తగ్గించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 28: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని, ఇరు దేశాలు వౌఖికంగా, రాతపూర్వకంగా వ్యక్తం చేసే అభిప్రాయాలు సామరస్యపూర్వకంగా ఉండాలని అమెరికా పిలుపునిచ్చింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ పూరితంగా, గొప్పగా సమాచార మార్పిడి జరగాలని, మరింత సమన్వయం సాధించాలని పేర్కొంది. ‘మేము చాలాసార్లు ఉన్నత స్థాయి వేదికపైనుంచి చెప్పిన అంశం ఏంటంటే, ఇరు దేశాల మధ్య సన్నిహితమైన, సాధారణ సంబంధాలను చూడాలని కోరుకుంటున్నాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. దీనివల్ల ఆ రీజియన్‌కే ప్రయోజనం కలుగుతుందని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడం, అనంతరం పాకిస్తాన్‌లో ఈ సంవత్సరం నవంబర్‌లో జరిగే సార్క్ దేశాల శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనబోనని భారత్ తెగేసి చెప్పిన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆశ్రయం పొందడానికి యత్నిస్తున్న ఉగ్రవాదులను అణచివేయడానికి ఆ దేశం మీద అమెరికా ఒత్తిడి కొనసాగుతుందని టోనర్ పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్‌లో జరిగే సార్క్ దేశాల సమావేశంలో పాల్గొనకూడదని భారత్ తీసుకున్న నిర్ణయంపై స్పందించడానికి టోనర్ నిరాకరించారు. భారత్ తీసుకున్న నిర్ణయంపై స్పందించాల్సిందిగా ఒక విలేఖరి కోరగా, ఆ నిర్ణయంపై భారత్‌నే అడగాలని, తనను కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడం అమెరికా పని కాదని, పరస్పర ప్రయోజనాలకోసం ఆ దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకొని, సమాచార మార్పిడికి సాధారణ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు. పాకిస్తాన్ తన గడ్డపైనుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొన్ని ఉగ్రవాద సంస్థలను అణచివేయడంలో కొంత పురోగతి సాధించిందని, అయితే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆశ్రయం పొందటానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాద సంస్థలను అణచివేయాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి కొనసాగిస్తుందని టోనర్ అన్నారు. భారత్, పాకిస్తాన్ తమ విభేదాలను హింసాత్మకంగా కాకుండా దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలను అమెరికా ప్రోత్సహిస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరి జోష్ ఎర్నెస్ట్ అన్నారు.