జాతీయ వార్తలు

మరింత రక్షణ బలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెనౌలిమ్ (గోవా), అక్టోబర్ 15: భారత్, రష్యాలు శనివారం రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలను కుదుర్చున్నాయి. గోవాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శనివారం ఉదయం చర్చలు జరిపిన అనంతరం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానంగా రక్షణ, ఇంధన రంగాలకు సంబంధించిన ఒప్పందాలకు ఇరు దేశాలు పెద్ద పీట వేశాయి. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుతామని రెండు దేశాలు ప్రతిన బూనాయి. దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో మోదీ, పుతిన్‌లు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపైనా చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతల సమక్షంలో ఇరు దేశాలకు చెందిన అధికారులు మొత్తం 16 అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. అలాగే వ్యాపారం, పెట్టుబడులు, హైడ్రో కార్బన్స్, రోదసీ, స్మార్ట్ సిటీల రంగాల్లో సంబంధాల పెంపునకు సంబంధించి మూడు ప్రకటనలు కూడా చేశాయి. ఇరువురు నేతలు తమిళనాడులోని కుదంకుళంలో రష్యా సహకారంతో నిర్మిస్తున్న అణు విద్యుత్కేంద్రంలో రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేయడంతో పాటుగా మూడు, నాలుగు యూనిట్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించారు. ఇరు దేశాలు కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాల్లో అన్నిటికన్నా ప్రధానమైనది దాదాపు 500 కోట్ల డాలర్ల వ్యయంతో రష్యానుంచి అధునాతన ఎస్-400 ట్రంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుకొలుకు సంబంధించిన ఒప్పందం. దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశానికి చెందిన విమానాలను, డ్రోన్‌లను సైతం ధ్వంసం చేయగల శక్తి కలిగి ఉన్న ఈ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతవంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందింది. అయిదు అత్యధునాతన అడ్మిరల్ గ్రిగరోవిచ్ క్లాస్ ఫ్రిగేట్ల (యుద్ధ నౌకల) నిర్మాణానికి సంబంధించి ఇరు దేశాలు సహకరించుకోవడంపైన, అలాగే భారత్‌లో కామోవ్ హెలికాప్టర్ల తయారీకోసం ఉమ్మడిగా ఒక సంస్థ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ హెలీకాప్టర్లను ప్రారంభంలో మన దేశం రష్యానుంచి దిగుమతి చేసుకున్న తర్వాత మన దేశంలోనే రష్యా సహకారంతో ఉత్పత్తి చేస్తుంది. మీడియా సమావేశంలో పుతిన్ సమక్షంలో ఉమ్మడి ప్రకటనను చదివి వినిపించిన మోదీ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ తీసుకున్న చర్యలను అర్థం చేసుకుని వాటిని సమర్థించినందుకు రష్యాను అభినందించారు. ‘ఉగ్రవాదాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉందన్న రష్యా వైఖరి మన వైఖరికి అద్దం పడుతోంది. మొత్తం దక్షిణాసియా ప్రాంతానికే ముప్పుగా పరిణమించిన సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి మనం తీసుకున్న చర్యలను రష్యా అర్థం చేసుకుని సమర్థించడాన్ని అభినందిస్తున్నాం. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను ఎదుర్కొనే విషయంలో ఏమాత్రం అలసత్వం చూపకూడదని రెండు దేశాలు గట్టిగా భావిస్తున్నాయి’ అని మోదీ అన్నారు. తమ మధ్య చర్చలు ఎంతో నిర్మాణాత్మకంగా జరిగాయని, రాబోయే రోజుల్లో రక్షణ, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అవి బాటలు వేశాయని మోదీ చెప్పారు. అలాగే ప్రతి ఏటా మిలిటరీ పారిశ్రామిక సదస్సును నిర్వహించడానికి విధివిధానాలను రూపొందించడానికి కూడా తాము అంగీకరించినట్లు మోదీ చెప్పారు. ఈ సదస్సును నిర్వహించడం వల్ల ఈ రంగానికి చెందిన ఇరు దేశాలకు చెందిన సంస్థలు మరింతగా పరస్పరం సహకరించుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. రష్యాతో దీర్ఘకాలంగా భారత్‌కున్న సన్నిహిత సంబంధాలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావిస్తూ ఇద్దరు కొత్త మిత్రులకన్నా ఒక పాతమిత్రుడు మేలని అన్నారు.
రష్యా హైడ్రోకార్బన్ రంగంలో భారత్ ఉనికి గురించి ప్రధాని మాట్లాడుతూ, గత నాలుగు నెలల కాలంలోనే భారతీయ కంపెనీలు ఆ దేశ చమురు, గ్యాస్ రంగంలో దాదాపు 550 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఇప్పుడు పుతిన్ మద్దతుతో ఈ రంగంలో అవకాశాలను మరింత విస్తరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రెండు దేశాల మధ్య గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణానికి సంబంధించి ఉమ్మడి అధ్యయనం నిర్వహించడానికి కూడా తాము అంగీకరించినట్లు ప్రధాని చెప్పారు. అలాగే సైన్స్ టెక్నాలజీ కమిషన్ ఏర్పాటుకు కూడా రెండు దేశాలు అంగీకరించినట్లు మోదీ చెప్పారు. ఇరుదేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావడమే కాకుండా విస్తృతం అవుతున్నాయని ప్రధాని చెప్పారు.

ఇవీ ఒప్పందాలు

రష్యానుంచి 500 కోట్ల డాలర్ల వ్యయంతో
ఎస్-400 ట్రంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు
4 గ్రిగరోవిచ్ క్లాస్ ఫ్రిగేట్ల (యుద్ధ నౌకల) కొనుగోలు
భారత్‌లో ఉమ్మడిగా కామోవ్ -226టి హెలీకాప్టర్ల తయారీ
ఇరు దేశాల మధ్య గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుపై అధ్యయనం
కుడంకుళం అణు విద్యుత్కేంద్రంలో మరో రెండు రియాక్టర్ల నిర్మాణం
చమురు, సహజవాయువుల రంగానికి సంబంధించిన ఒప్పందాలు
ఇస్రోకు సంబంధించి కీలక ఒప్పందం
ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం
స్పీడ్ రైళ్లకు సంబంధించి మరో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్, హర్యానాలలో స్మార్ట్ సిటీలకు సంబంధించిన ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్‌లో రవాణా, నౌకానిర్మాణానికి సంబంధించి మరో ఒప్పందం