జాతీయ వార్తలు

8మంది సిమి ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, అక్టోబర్ 31: సెక్యూరిటీ గార్డును అత్యంత హేయంగా హతమార్చి సోమవారం తెల్లవారు జామున భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది మంది నిషిద్ధ సిమి ఉగ్రవాదులు పరారయ్యారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే వీరందరినీ పోలీసులు హతమార్చారు. పరారైన సిమి ఉగ్రవాదులు నగర శివారులోనే ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అత్యంత చాకచర్యంగా వారిని ముట్టడించి మట్టుబెట్టారు. తమపై ఎదురుకాల్పులకు దిగడం వల్లే తాము ప్రతికాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ జరిగిన తీరు అనేక రకాలుగా అనుమానాలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఓ వ్యక్తిని అత్యంత సమీపం నుంచే ఓ పోలీసు కాల్చిచంపినట్టుగా టెలివిజన్ చానళ్లలో ప్రసారమైన దృశ్యాలపై కల్లోలం చెలరేగింది. సోమవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో నిషిద్ధ సిమీ ఉగ్రవాదులు ఎనిమిది మంది భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నారని, వీరిలో ఇద్దరు మూడేళ్ల క్రితం ఖండ్వా జైలు నుంచి ఇదే రీతిలో తప్పించుకుని తిరిగి పట్టుబడ్డవారేనని డిఐజి భోపాల్ రామన్ సింగ్ తెలిపారు. బెడ్ షీట్లను ఒకదాని తర్వాత ఒకటిగా ముడివేసి దాని సాయంతోనే జైలు గోడ ఎక్కి వీరందరూ పరారయినట్టు తెలుస్తోందని తెలిపారు. ఈ ఎనిమిది మంది జైలు నుంచి తప్పించుకున్న కొద్ది వ్యవధిలోనే రంగంలోకి దిగిన పోలీసులకు స్థానికులు అందించిన సమాచారం ఎంతగానో ఉపకరించిందని చెప్పారు. దాని ప్రకారం మలిఖేద ప్రాంతంలో వీరిని చుట్టుముట్టడం జరిగిందని డిఐజి వివరించారు. పోలీసులను గమనించిన సిమి ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడటంతో వారిని ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టడం జరిగిందని స్పష్టం చేశారు. పారిపోయిన ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని హతమార్చామని మధ్య ప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ నిర్థారించారు. వీరిని అంజాద్, జకీర్ హుస్సేన్ సాదిక్, మొహమ్మద్ సాలిక్,ముజీబ్ షేక్, మెహ్‌బూద్ గుడ్డూ,మొహమ్మద్ ఖాలిద్ అహ్మద్, అఖీల్, మజీద్‌లుగా గుర్తు పట్టామన్నారు.
ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఎనిమిది మంది ఖైదీలు ఎలా తప్పించుకోగలిగారన్న దానిపై జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఎ)తో దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. అయితే ఎన్‌కౌంటర్‌పై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పలేదు. ఎన్‌ఐఎతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణ జరుపుతుందని తెలిపారు. జైలు సూపరింటెండెంట్ అఖిలేష్ తోమర్‌తో పాటు మొత్తం నలుగురు సీనియర్ అధికారులు సస్పెండ్ చేశామని తెలిపారు.
పరారైన సిమి ఉగ్రవాదుల వద్ద ఆయుధాలున్నాయని, పోలీసులను చూసిన వెంటనే వారు కాల్పులు జరపడం వల్ల ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని ఐజి యోగేష్ చౌదరి తెలిపారు. హోం మంత్రి చేసిన ప్రకటనకు ఐజి చేసిన ప్రకటన పూర్తి విరుద్ధంగా ఉండటంతో ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నల పరంపర తలెత్తింది. ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయ దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అత్యంత భద్రత కలిగిన జైలు నుంచి సిమి ఉగ్రవాదులు పరారు కావడం, కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు వారిని వెంబడించి మట్టుబెట్టారన్న కధనాలపై కాంగ్రెస్ ప్రతినిధి కమల్‌నాధ్ తీవ్రంగా స్పందించారు. దీనిపై అనేక అనుమానాలున్నాయని, జరిగిన ఘటనకు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి న్యాయ దర్యాప్తు ద్వారానే వాస్తవాలను వెలుగులోకి తేవాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో సిమి ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్నారో ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌కు చెందిన మరో నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ డిమాండ్లను అధికార బిజెపి తిరస్కరించింది. తప్పించుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే సిమి ఉగ్రవాదుల్ని మట్టుకుని మట్టుబెట్టినందుకు పోలీసులను దిగ్విజయ్ సింగ్ అభినందించాలని బిజెపి నేత సిద్ధార్ధనాధ్ సింగ్ పేర్కొన్నారు.ఉగ్రవాదులు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలని మజ్లీస్ నాయకుడు ఓవైసీ డిమాండ్ చేశారు. ఎన్‌ఐఎ దర్యాప్తు సరిపోదని, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగుచూస్తాయని ఆయన అన్నారు.

చిత్రం... ఎన్‌కౌంటర్‌కు ముందు ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన జైలు గార్డు రామ్‌శంకర్