జాతీయ వార్తలు

కొత్త పార్లమెంటును కట్టుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఇప్పుడున్న పార్లమెంటు భవనం 88ఏళ్ల నాటిది కావడంతో దానిపై ఒత్తిడి పెరిగిపోతోందని, మరోవైపు స్థలం కూడా చాలడం లేదని, అందువల్ల కొత్త పార్లమెంటు భవనం నిర్మిస్తే బాగుంటుందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒక ప్రతిపాదన చేసారు. అంతేకాక ప్రత్యామ్నాయ స్థలంకోసం ఆమె రెండు మార్గాలను సైతం సూచించారు. అందులో ఒకటి ఇప్పుడు పార్లమెంటు భవనం ఉన్న ప్రాంతంలోనే కొత్త భవనం నిర్మించడం, మరోటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఎదురుగా రక్షణ, ఢిల్లీ పోలీసుకు చెందిన కొన్ని బ్యారక్‌లున్న రాజ్‌పథ్‌లో కొత్త భవనాన్ని నిర్మించవచ్చని ఆమె సూచించారు. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలని సుమిత్రా మహాజన్ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి ఒక లేఖ రాసారు.
1927లో ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని ప్రారంభించినప్పుడు పార్లమెంటు సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా సందర్శకుల సంఖ్య, పార్లమెంటుకు సంబందించిన కార్యకలాపాలు పరిమితంగా ఉండేవని, అయితే కాలగతిలో పార్లమెంటరీ కార్యకలాపాలు, అక్కడ పని చేస్తున్న సిబ్బంది, సందర్శకుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందని స్పీకర్ అన్నారు. పార్లమెంటు భవనం పాతబడిపోతున్నందున, కార్యకలాపాలు, సిబ్బంది లాంటివి పెరిగిపోయిన కారణంగా భవనంపై ఒత్తిడి పెరిగిపోయిందని ఆమె అన్నారు. మొదట్లో ఈ భవనాన్ని పార్లమెంటు సభ్యులు, సెక్రటేరియట్ సిబ్బందికోసం మాత్రమే ఉపయోగించాలని అనుకున్నారని, అయితే పార్లమెంటు పర్యవేక్షక కార్యకలాపాలు, కమిటీల సంఖ్య, సెక్యూరిటీ అవసరాలు పెరిగిపోవడంతో చోటుకు డిమాండ్ గణనీయంగా పెరిగిపోయిందని కూడా ఆమె అన్నారు.
మరోవైపు ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని ‘హెరిటేజ్ గ్రేడ్-1’ నిర్మాణంగా ప్రకటించినందున కట్టడం రిపేర్లు, మార్పులు, చేర్పులులాంటివి చేయడానికి చాలా పరిమితులున్నాయని కూడా ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా 2026 నాటికి పార్లమెంటు సభ్యుల సంఖ్య 550కి పెరిగే అవకాశముందని, అయితే భవనాన్ని విస్తరించడానికి ఎలాంటి అవకాశాలు లేవని కూడా ఆమె అన్నారు. 398 మంది కూర్చునేందుకు వీలున్న పార్లమెంటు సెంట్రల్ హాలును లోక్‌సభ చాంబర్‌గా మార్చినా అదికూడా 550 మందికి పైగా ఉండే సభ్యులకు వసతి కల్పించే స్థితిలో ఉండబోదని ఆమె అన్నారు. అంతేకాకుండా రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న కారణంగా పార్లమెంటు సభ్యులకు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పరికరాలు అందజేసి పార్లమెంటును పేపర్‌లెస్‌గా చేయాలనే ఆలోచన ఉందని, అలా చేయాలంటే ఇప్పుడున్న సీటింగ్ ఏర్పాట్లను మార్చాల్సి ఉంటుందని ఆమె అన్నారు. అందువల్ల కొత్త భవనాన్ని నిర్మిస్తే ఆధునిక సాంకేతిక అవసరాలన్నిటినీ తీర్చగలుగుతుందని సుమిత్రా మహాజన్ ఆ లేఖలో అన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా అత్యాధునికమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పార్లమెంటు కాంప్లెక్స్‌లోని కొత్త భవనాన్ని నిర్మించడం ఒక మార్గమని, దీనివల్ల కొన్ని సదుపాయాలను, సేవలను ఆ భవనంలోకి మార్చవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. రాజ్‌పథ్‌కు ఆవలి వైపున మరో కొత్త భవనం నిర్మించడం మరో మార్గమని ఆమె అన్నారు. అంతేకాదు ఇప్పుడున్న భవనాన్ని, కొత్తగా నిర్మించే కాంప్లెక్స్‌ను కలుపుతూ రాజ్‌పథ్ కింద ఒక అండర్‌గ్రౌండ్ మార్గాన్ని నిర్మించవచ్చని కూడా స్పీకర్ సూచించారు.