జాతీయ వార్తలు

కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: బిహార్ అంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా పని చేయని మంత్రులను తొలగించడంతో పాటుగా తన ప్రభుత్వం ఇమేజిని పెంచడం కోసం తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారు. అయితే సమర్థులైన వారు లభించకపోవడమే ఆయనకు సమస్యగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు కీలక మంత్రిత్వ శాఖల్లో మార్పులు జరుగుతాయన్న ఊహాగానాలు దేశ రాజధాని ఢిల్లీలో షికారు చేస్తున్నప్పటికీ కొత్త ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేయనున్నారని, భారీ ఎత్తున మార్పులు చేపట్టడానికి సమర్థులైన వ్యక్తుల కొరత పెద్ద అడ్డంకిగా ఉందని అధికార బిజెపిలోని కొంతమంది సీనియర్ నాయకులు, మోదీకి సన్నిహితంగా ఉన్న వారు అంటున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు, అభివృద్ధి సాధిస్తామన్న హామీతో మోదీ దాదాపు రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పలుకుబడి మసకబారుతుండడం తెలిసిందే. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన ఆర్థిక సంస్కరణలు ఆగిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కిందా మీద పడుతోంది. వరసగా రెండు సంవత్సరాల కరవుతో గ్రామీణ ప్రాంతం ప్రజల్లో నిరాశా నిస్పృహలు సైతం పెరిగి పోతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో పలు కీలక రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ విజయావకాశాలను మెరుగుపర్చాల్సిన బాధ్యత మోదీపై పెరిగిపోతోంది.
అయితే శరవేగంగా అమలవుతున్న సంస్కరణలు, ప్రభుత్వ విధానాలను తమ పనితనంలో ప్రతిఫలించేలా పని చేసే సరయిన సమర్థులను గుర్తించడం పెద్దసవాలని ప్రధానమంత్రి సన్నిహితుడొకరు చెప్పారు. చక్కటి వాగ్ధాటి, సమర్థుడిగా గుర్తింపు పొందిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని రక్షణ శాఖకు మార్చాలని ప్రధాని మోదీ అనుకుంటరన్నారని, అయితే ఆయన స్థానంలో ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టగల సమర్థుడు ఎవరూ లేరని పార్టీ సన్నిహిత వర్గాలు అంటున్నారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి మోడీ ప్రతినిధి, జైట్లీ కార్యాలయంలో అధికారులు ఇష్టపడ్డం లేదు. అయితే ఇలాంటి కీలక నిర్ణయాలను రహస్యంగా ఉంచడం మోదీకి అలవాటని పార్టీ వర్గాలు అంటూ, దీనిపై తుది నిర్ణయం తీసుకోవలసింది ఆయనేనని అంటున్నాయి. మంత్రివర్గంలో మార్పులపై వస్తున్న కథనాలను ప్రధానికి సన్నిహితుడైన మరో అధికారి ఊహాగానాలను కొట్టి పారేయడం గమనార్హం. ఇనే్నళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కారణంగా కాంగ్రెస్‌లో మాదిరిగా బిజెపిలో మితవాద, వామపక్ష భావజాలాలు కలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ఏడాది బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి తర్వాత అసమర్థులైన మంత్రులు, అధికారులను తప్పించాలన్న డిమాండ్ అటు పార్టీలోను, ఇటు ఆ పార్టీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌లోను పెరుగుతోంది. వచ్చే నెల రెండో వారంలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలకు చెంది అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఈ అంశాలన్నీ చర్చించవచ్చని తెలుస్తోంది. దేశంలోని హిందూయేతరుల పట్ల అసహనాన్ని రెచ్చగొట్టే విధంగా మంత్రులు చేసే వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించబోననే సందేశం ఇవ్వడం కోసం కూడా మంత్రివర్గంలో మార్పులు చేయాలని మోదీ అనుకుంటున్నారు. జూనియర్ మంత్రులు గిరిరాజ్ సింగ్, నిరంజన్ జ్యోతిలాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి, పార్టీకి చిక్కులు తెచ్చిన విషయం తెలిసిందే.
అలాగే విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌లాంటి కొంతమంది సీనియర్ మంత్రులు కూడా తమ శాఖల్లో మార్పులను కోరుకుంటున్నారు. అయితే మంత్రివర్గంలోని సమర్థులైన కొత్త వ్యక్తులను తీసుకునే విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ తనకు తోడ్పాటునందిస్తుందన్న ఆశతో మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమయినా కొత్త సంవత్సరంలో మోదీ మంత్రివర్గంలో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎయిరిండియా విమానంలో ఎలుక!

ప్రయాణికులు గమనించడంతో ఆగిపోయిన విమానం దర్యాప్తు జరుపుతున్నామన్న సంస్థ

ముంబయి, డిసెంబర్ 30: లండన్‌కు వెళ్లే ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు ఒక ఎలుక కనిపించడంతో విమానం పైలట్ నగర విమానాశ్రయంనుంచి బయలుదేరాల్సిన ఆ విమానాన్ని వెనక్కి తీసుకు వచ్చేసాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఇప్పటికే అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియాను మరింత ఇబ్బందుల్లో పడేసింది.
అయితే విమానంలో ఎలుక ఉన్న విషయం ధ్రువీకరణ కానప్పటికీ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బయలుదేరడానికి సిద్ధం గా ఉన్న ఎఐ131 విమానం తిరిగి వెనక్కి వచ్చిందని, ఇంజనీర్లు ఈ ఉదంతంపై దర్యాప్తు జరుపుతున్నారని ఎయిర్‌ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను లండన్‌కు తీసుకెళ్లడం కోసం సంస్థ స్టాండ్‌బై విమానాన్ని సమకూర్చింది.
ఆరుగంటలు ఆలస్యంగా ఆ విమానం లండన్‌కు బయలుదేరి వెళ్లింది.అహ్మదాబాద్‌నుంచి ముంబయి మీదుగా లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మధ్యాహ్నం 12.50 గంటలకు ముంబయినుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే విమానం టేకాఫ్‌కు ముందు విమానం కేబిన్‌లో ఒక ఎలుక అటూ ఇటూ తిరుగుతుండడాన్ని ప్రయాణికులు చూసి చెప్పడంతో దాన్ని మళ్లీ బే వద్దకు తీసుకు వచ్చారు.

అవార్డులు వాపస్ చేయడం తెలివి తక్కువతనమే

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రఘువీర్

అహ్మదాబాద్, డిసెంబర్ 30: దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ అవార్డులు వాపసు చేయడం తెలివితక్కువతనం అని గుజరాతీ సాహితీవేత్త రఘువీర్ చౌదరి వ్యాఖ్యానించారు. 2015 సంవత్సరానికి సంబంధించి రఘువీర్‌కు జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. మేధావులన్నవారు నిరసన తెలపడానికి ఇది సరైన పద్ధతి కాదని మరో రూపంలో తన నిరసన తెలపచ్చని చౌదరి పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఆనాటి ఎమర్జెన్సీకి ఏమాత్రం పోలిక లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నా వరకయితే అవార్డులు తిరిగి ఇచ్చేడం అన్నది తెలివితక్కువతనం. నిరసన తెలపడానికి ఇది సరైన విధానం కూడా కాదన్నది నా అభిప్రాయం’ అని ఆయన అన్నారు. రచయితలు, కవులు అసంతృప్తి తెలపడానికి అనేక మార్గాలున్నాయని ఆయన చెప్పారు. జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న గుజరాతీల్లో రఘువీర్ చౌదరి (77) నాలుగోవారు. సాహిత్య దిగ్గజం రఘువీర్‌కు ఇంతకు ముందే అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. ఆయన రచించిన ఉపర్వాస్ నవలకు 1977లోనే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.
‘రచయితలు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. గతంలోనూ నాతోపాటు అనేకమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళంవిప్పి అరెస్టయిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు లేవు’ అని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండేలా చూడాలే తప్ప దిగిపోవాలని డిమాండ్ చేయడం సరైందికాదని ఆయన చెప్పారు.