జాతీయ వార్తలు

మోదీ వ్యాఖ్యలతో దద్దరిల్లిన పార్లమెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రతిపక్ష పార్టీలు నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు శుక్రవారం పార్లమెంటును కుదిపేశాయి. మోదీ తమకు క్షమాపణ చెప్పాలంటూ ప్రతిపక్ష పార్టీలు గొడవకు దిగడంతో సభాకార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సోమవారానికి వాయిదా పడ్డాయి. నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పార్లమెంటు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఒక పుస్తకావిష్కణ కార్యక్రమంలో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుకు ముందు వారికి సమయం ఇవ్వనందుకే తన పట్ల కోపంతో ఉన్నారంటూ ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, బిఎస్‌పి అధినాయకురాలు మాయావతి తదితర నాయకులు మోదీ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
రాజ్యసభను అవమానపరిచిన మోదీ సభకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, తృణమూల్ పక్షం నాయుకుడు సుదీప్ బందోపాధ్యాయ తదితరులు ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధాన మంత్రి తమను అవమానించారు, ఆయన క్షమాపణ చెప్పేంత వరకు సభను కొనసాగనిచ్చే ప్రసక్తే లేదంటూ ప్రతిపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. పోడియం వద్ద నిలబడి పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ వాగ్వివాదానికి దిగిన కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు ఎంఏ ఖాన్‌ను రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజె కురియన్ హెచ్చరించారు. లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు పోడియం చుట్టు నిలబడి ప్రధాన మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ ఇచ్చిన నినాదాలతో సభలు దద్దరిల్లిపోయాయి. ప్రతిపక్షం సభ్యులు నరేంద్ర మోదీని విమర్శిస్తూ నినాదాలు ఇవ్వడాన్ని అధికార పక్షం గట్టిగా వ్యతిరేకించటంతో సభ గందరగోళంలో పడిపోయింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్యనే కొద్ది సేపు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమిత్రా మహాజన్ పలుమార్లు ప్రతిపక్షానికి నచ్చ జెప్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ గందరగోళం మధ్య సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభాకార్యక్రమాలకు అడ్డుపడ్డారు. ప్రతిపక్ష సభ్యుల గొడవ, గందరగోళం మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. తరువాత జీరో అవర్ కార్యక్రమాన్ని చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తమకు బాధను కలిగించాయని చెప్పారు. మోదీ ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతోపాటు ప్రతిపక్షానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పక్షం అభ్యంతరం పెట్టటంతో ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
రాజ్యసభలో ఇదే గొడవ
ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభను కుదిపేశాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్షం చేసిన డిమాండ్‌తో రాజ్యసభ స్తంభించిపోయింది. ఉపాధ్యక్షుడు కురియన్ సభలో ప్రభుత్వ పత్రాలను సమర్పింపజేయగానే బిఎస్‌పి నాయకురాలు మాయావతి, ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఇతర ప్రతిపక్షం నాయకులు లేచి మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధాన మంత్రి సభకు వచ్చి క్షమాపణలు చెప్పనంత వరకు సభ ముందుకు సాగదని వారు స్పష్టం చేశారు. ప్రతిపక్షాన్ని అవమానించిన ప్రధాన మంత్రి రాజ్యసభకు వచ్చి క్షమాపణలు చెప్పాలని ఆజాద్ డిమాండ్ చేశారు. ఆజాద్ ఆరోపణలను అధికార పక్షం ఖండించటంతో సభలో గందరగోళం నెలకొంది. ఉపాధ్యక్షుడు కురియన్ ఈ గందరగోళం మధ్యనే ప్రభుత్వ పత్రాలున సభకు సమర్పింపజేశారు. ఇంతలో ఆజాద్ లేచి ప్రతిపక్షాలు నల్లధనం, అవినీతిని వ్యతిరేకిస్తున్నాయని స్పష్టంగా చెప్పినా నరేంద్ర మోదీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారని నిలదీశారు. ఎంఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి తదితర కాంగ్రెస్ సభ్యులతోపాటు పలువురు ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ప్రధాని గ్రంథాలయంలో మాట్లాడిన దానికి రాజ్యసభతో సంబంధమేమిటని కురియన్ ప్రశ్నించారు. ఆజాద్ చెప్పేది మీరూ వినాలని జెడియు పక్షం నాయకుడు శరద్ యాదవ్ ఉపాద్యక్షుడికి సూచించారు. బిఎస్‌పి నాయకుడు సతీశ్‌చంద్ర మిశ్రాలేచి ప్రధాని తమను అవమానించారంటూ విమర్శలు గుప్పించారు. పెద్దనోట్ల చర్చను కొనసాగించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సూచించారు. ప్రభుత్వమే చర్చను దెబ్బ తీస్తుంటే ప్రతిపక్షం ఏం చేస్తుందని ఆజాద్ ఆయనను ఎదురుప్రశ్నించారు. దీంతో కురియన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ప్రతిపక్ష సభ్యులను శాంతింపజేసేందుకు విఫలయత్నం చేశారు.
మధ్యలో మంత్రి నఖ్వీ చేసిన వ్యాఖ్యలతో గొడవ మరింత పెరిగింది. హమీద్ అన్సారీ దాదాపు అర్థగంట పాటు సభను నడిపించేందుకు ప్రయత్నించి చివరకు రెండున్నర వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమై కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగింది. ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున గొడవ చేయటంతో కురియన్ సభను సోమవారం వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.

చిత్రం... శుక్రవారం రాజ్యసభలో మోదీ వ్యాఖ్యలపై
నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష సభ్యులు