జాతీయ వార్తలు

బరాక్ క్షిపణి పరీక్ష విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 30: భూ ఉపరితలంపైనుంచి గగనతల లక్ష్యాలను ఛేదించగల బరాక్-8 క్షిపణిని నౌకాదళం బుధవారం ఇక్కడ ఐఎన్‌ఎస్ కలకత్తా నౌకపైనుంచి విజయవంతంగా పరీక్షించింది. దీంతో సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి వ్యవస్థను నౌకాదళంలో చేర్చడానికి రంగం సిద్ధమైంది. భారత నౌకాదళం, డిఆర్‌డిఎల్, ఇజ్రాయెల్‌కు చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేసాయి. కొత్తగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ క్షిపణి తొలి ప్రయోగమే విజయవంతం కావడం ఒక మైలురాయని నేవీ అభివర్ణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత నౌకాదళ సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లయింది. అరేబియా సముద్రంలో జరుగుతున్న నౌకాదళ విన్యాసాల్లో భాగంగా ఐఎన్‌ఎస్ కలకత్తా నౌకపైనుంచి నిన్న, ఈ రోజు ఈ క్షిపణిని ప్రయోగించి పరీక్షించినట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. శత్రు సైన్యాలకు చెందిన క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్‌లనుంచి రక్షణకోసం ఈ బరాక్ క్షిపణిని రూపొందించారు.
ఇప్పుడు ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత నౌకాదళం కూడా ఈ సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల నౌకాదళాల సరసన చేరినట్లయింది. బరాక్ క్షిపణికోసం భారత్, ఇజ్రాయెల్ దేశాలకు పెద్దఎత్తున ఆర్డర్లు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు కలిగిన బరాక్ క్షిపణిని గత వారం ఇజ్రాయెల్ యుద్ధ నౌకపైనుంచి కూడా ప్రయోగించి పరీక్షించడం జరిగింది.

ఇజ్రాయెల్ నౌకనుంచి బరాక్‌ను పరీక్షిస్తున్న దృశ్యం (ఫైల్ ఫొటో)