జాతీయ వార్తలు

ఏం సాధించారో చెప్పండి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక రంగంలో ఘోరంగా విఫలమైందని, 2015 సంవత్సరం ప్రారంభంలో 8.1 నుండి 8.5 శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తామని ప్రకటించిన ప్రభుత్వం సంవత్సరాంతానికి ఇది ఏడు శాతానికి పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం విమర్శించారు. చిదంబరం శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిందని ఆరోపించారు. అధిక ఉపాధి కల్పన, అధిక పెట్టుబడులు, త్వరితగతిన వౌలిక సదుపాయాల కల్పన చేస్తామంటూ 2015లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేకపోయిందని చిదంబరం ఆరోపించారు. గత సంవత్సరం జిడిపి వృద్ధి 7 నుండి 7.3 శాతానికి మించటం లేదని చిదంబరం చెప్పారు. దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు ఆశించిన స్థాయిలో పెరగలేదని ఆర్థిక శాఖ విభాగం జరిపిన ఆర్ధసంవత్సరం విశే్లషణలో అంగీకరించిందని చిదంబరం తెలిపారు. రెండు చక్రాలపై ముందుకు సాగుతున్న కారులా మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. ఎగుమతులు గత పనె్నండు నెలల నుండి తగ్గుదలనే చూపిస్తున్నాయంటూ గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాల మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో వేతనాల పెరుగుదల నిలిచిపోయిందని దుయ్యబట్టారు. దేశంలోని ఏ మూలకు వెళ్లి ప్రజలతో మాట్లాడినా ప్రభుత్వం పట్ల వారిలో పెరిగిపోతున్న కోపతాపాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. పట్టణ భారతం పరిస్థితి కూడా ఇలాగే ఉన్నదని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ముఖ్యంగా రవాణా, విద్యుత్తు, నీరు, ఆహార ధరల పెరుగుదల, నేరాలు పెరిగిపోవటం, ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోవటంతో పట్టణ ప్రాంతాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతమని చిదంబరం తెలిపారు. 3.9 శాతం ఆర్థిక లోటును భర్తీ చేసుకోగలుగుతామనే ధీమా ప్రభుత్వంలో కనిపించటం లేదని ఆయన చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన అనంతరం బిజెపి అధినాయకత్వం ప్రతిపక్షాన్ని కలుపుకుపోతుందని అనిపించినా ఆ తరువాత పరిస్థితి పూర్తిగా ప్రతికూలంగా మారిందని చిదంబర దుయ్యబట్టారు.
విదేశాంగ విధానంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. నేపాల్ దీనికి తాజా ఉదాహరణ అని తెలిపారు. పాకిస్తాన్ విషయంలోను ప్రభుత్వ విధానం గందరగోళంగా ఉందన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగకపోవటానికి ప్రతిపక్షం కారణమంటూ బిజెపి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని చిదంబరం స్పష్టం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రతిపక్షం ఎంతో బాధ్యతతో పని చేస్తోందన్నారు. ఘర్షణ విధానాన్ని అవలంబిస్తున్న అధికార పక్షానికి ప్రతిపక్షాన్ని విమర్శించే హక్కు, అధికారం లేదని చిదంబరం స్పష్టం చేశారు. కాగా, దేశ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రివాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేసి-సరి వాహనాల విధానాన్ని సమర్థిస్తూ, ప్రజల్లో అవగాహన తీసుకు రావడానికి తక్కువ వ్యవధిలో ఇలాంటి విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.