జాతీయ వార్తలు

మూడేళ్లలో అందరికీ వంటగ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరాన్ని ‘ఎల్‌పిజి వినియోగదారుల సంవత్సరం’గా ప్రకటించింది. రానున్న మూడేళ్ల కాలంలో దేశంలోని అన్ని ఇళ్లకు శుద్ధమైన వంటగ్యాస్‌ను అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించిన ప్రణాళికలను శుక్రవారం ఆవిష్కరించింది. ఆన్‌లైన్‌లో వంట గ్యాస్ బిల్లు చెల్లించే సౌకర్యాన్ని ప్రారంభిస్తామని, పారదర్శక గ్యాస్ సిలిండర్లను ప్రవేశపెడతామని కేంద్రం ప్రకటించింది. ‘2016 ఎల్‌పిజి వినియోగదారుల సంవత్సరంగా ఉంటుంది. దేశంలో వంట గ్యాస్ అందుబాటును పెంచడానికి మేము కృషి చేస్తాం. వచ్చే మూడు క్యాలెండర్ సంవత్సరాలు 2016, 2017, 2018లలో దేశ ప్రజలందరికీ శుద్ధ వంటగ్యాస్‌ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంటాం’ అని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా గల వంట గ్యాస్ వినియోగదారుల కోసం ఎల్‌పిజి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ 1906ను ప్రారంభించే సభలో మంత్రి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. గ్యాస్ లీక్ అయినప్పుడు వినియోగదారులు ఈ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి, సహాయం పొందవచ్చని ఆయన వివరించారు. ఈ 1906 నంబర్‌ను టోల్ ఫ్రీ నంబర్‌గా మార్చాలని ఆయన చమురు మంత్రిత్వ శాఖను, చమురు మార్కెటింగ్ కంపనీల ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే సాధారణ చార్జీలు పడుతున్నాయి. దేశంలో 27 కోట్ల మంది వంట గ్యాస్ వినియోగదారులు ఉండగా, వీరిలో 16.5 కోట్ల మంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారని మంత్రి వెల్లడించారు. చమురు మార్కెటింగ్ కంపనీలు దేశంలోని సుమారు 60 శాతం జనాభాకు సేవలు అందిస్తున్నాయని ఆయన తెలిపారు. నూటికి నూరు శాతం మంది ప్రజలకు ఎల్‌పిజి గ్యాస్‌ను అందించాల్సి ఉందని, అయితే ప్రజలు ఈ వంటగ్యాస్‌ను కొనేందుకు అయ్యే ఖర్చును భరించగలగడం, వారికి గ్యాస్ అందుబాటులో ఉంచగలగడం అనే రెండు అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. వచ్చే మూడేళ్లలో ఆర్థిక వృద్ధిని సాధించడం ద్వారా ఇప్పటికీ వంటగ్యాస్ వినియోగించని ప్రజలందరి కొనుగోలు శక్తిని పెంచడం వల్ల వారు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేలా చేస్తామనే విశ్వాసం తమకు ఉందని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో ఎల్‌పిజి బిల్లును చెల్లించే పద్ధతిని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, ఈ సంవత్సరమే ఈ సౌకర్యాన్ని ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. లోపల ఎంత గ్యాస్ ఉందో తెలియజేసే పారదర్శక సిలిండర్లు 2016-17 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.