జాతీయ వార్తలు

వేర్పాటువాదులతో చర్చలకు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలం
రాళ్లు, బుల్లెట్లతో శాంతి అసాధ్యం
చర్చలకు సరైన వాతావరణం ఏర్పడాలి
ప్రధానితో కాశ్మీర్ సిఎం మెహబూబా భేటీ
దిగజారుతున్న పరిస్థితులపై చర్చలు
మెహబూబాతో విభేదాలు లేవు: రాంమాధవ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కాశ్మీర్‌లో పరిస్థితిని చక్కబెట్టడానికి సంబంధిత వర్గాలతో చర్చలు జరిపేందుకు మోదీ సుముఖంగా ఉన్నట్లు జమ్ము కాశ్మీర్ సిఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. సోమవారం మోదీతో సమావేశమై రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులపై ఇరవై నిమిషాల పాటు చర్చలు జరిపారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘రాళ్లు, బుల్లెట్లతో చర్చల వాతావరణం ఏర్పడదు. సుహృద్భావ వాతావరణం లేకుండా చర్చలు జరపడం సాధ్యం కాదు’ అన్నారు. మాజీ ప్రధాని వాజపేయి కాశ్మీర్‌పై అనుసరించిన విధానాన్ని అనుసరించాలని, వేర్పాటు వాదులతో చర్చలు జరపాలని తాను మోదీని కోరినట్లు ఆమె వివరించారు. పరిస్థితులు చక్కబడిన తరువాత చర్చలు జరపటానికి మోదీ సుముఖత వ్యక్తం చేశారన్నారు. వాజపేయి ప్రధానిగా, అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నప్పుడు హురియత్ నేతలతో చర్చలు జరిపినట్లు తాను మోదీకి గుర్తు చేశానన్నారు. ‘ఈ ఘర్షణ వాతావరణం ఇంకెన్నాళ్లు? దీనికి చర్చలు ఒక్కటే పరిష్కారం. వాజపేయిజీ ఎక్కడైతే వదిలేశారో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించాలి’ అని మెహబూబా వ్యాఖ్యానించారు. రాళ్లు రువ్వుతున్న ఘటనలు పెరుగుతున్నాయన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ కొందరు యువకులు ప్రలోభాలకు లోనై తప్పుదారి పడుతున్నారని వాఖ్యానించారు. వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయన్నారు. బిజెపి, పిడిపిల మధ్య ఇటీవల ఎంఎల్‌సి ఎన్నికల్లో వచ్చిన విభేదాలపై స్పందిస్తూ వాటిని తాము పరిష్కరించుకుంటామన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం వల్ల రాష్ట్రానికి 20వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందని ఆమె మోదీకి తెలియజేశారు.
కూటమి కొనసాగుతుంది: రాంమాధవ్
జమ్ముకాశ్మీర్‌లో బిజెపి, పిడిపిల మధ్య పొత్తు కొనసాగుతుందని, రెండు పార్టీల మధ్య విభేదాలు లేవని బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ స్పష్టం చేశారు. ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీల నేతల మధ్య సమాచార లోపం వల్లనే ఇబ్బంది ఏర్పడిందని, దీన్ని పరిష్కరించుకుంటామన్నారు. జమ్ముకాశ్మీర్‌లో బిజెపి వ్యూహకర్త అయిన రాంమాధవ్ ఒకటి రెండు నెలల్లో కాశ్మీర్ లోయలో ప్రశాంత పరిస్థితులను నెలకొల్పటం లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. రెండు పార్టీల సంయుక్త ప్రణాళిక మేరకే పని చేస్తున్నామని రాంమాధవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.