జాతీయ వార్తలు

పిఒకె పాక్‌లో భాగమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, నవంబర్ 27: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) పాకిస్తాన్‌లో భాగమని, ఇకముందు కూడా అది పాకిస్తాన్‌లోనే కొనసాగుతుందని, భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూకాశ్మీర్ ఈ దేశంలోనే కొనసాగుతుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి అప్పట్లోనే పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఈ ప్రతిపాదన చేశారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న అబ్దుల్లా విడిగా విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వాజపేయి లాహోర్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు.. పిఒకెను పాకిస్తాన్ ఉంచుకొని, జమ్మూకాశ్మీర్‌ను భారత్‌కు వదలివేయాలని ముషారఫ్‌కు ప్రతిపాదించినట్లు వాజపేయి నాకు చెప్పారు. దీంతో పాటు సరిహద్దు రేఖలను సవరించడానికి భారత్‌కు వీలు కల్పించాలని, దీనివల్ల ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని, వాణిజ్యం కూడా పెరుగుతుందని వాజపేయి ప్రతిపాదించారు. కాని, ఆ ప్రతిపాదనకు వారు అంగీకరించలేదు’ అని అబ్దుల్లా తెలిపారు. ‘ఈరోజు ఆ ప్రతిపాదనకు వారు (పాకిస్తాన్) అంగీకరిస్తున్నారు. కాని, మనం చర్చలు ప్రారంభించాల్సి ఉంది’ అని ఆయన అన్నారు. పిఒకెను తిరిగి భారత్‌కు ఇచ్చివేయాలని డిమాండ్ చేసినట్లు వచ్చిన వార్తల గురించి ప్రస్తావించగా, అది ఎన్నటికీ జరుగబోదని అబ్దుల్లా బదులిచ్చారు. ఇరు దేశాల ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఆయా దేశాలలో భాగంగానే కొనసాగుతాయని ఆయన అన్నారు. ‘పిఒకె పాకిస్తాన్‌లో భాగంగా ఉంది. అది ఆ దేశంలో భాగంగానే కొనసాగుతుంది. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉంది. ఇది భారత్‌లోనే కొనసాగుతుంది. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి’ అని అబ్దుల్లా అన్నారు. ‘ఇప్పుడున్న ఏకైక మార్గం భారత్, పాకిస్తాన్‌లు పరస్పరం చర్చలు జరపడమే. ఈ చర్చల ఆధారంగా సమ స్య పరిష్కారానికి ఒక మార్గాన్ని కనుక్కోవడమే’ అని అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ‘అది (పిఒకె) భారత్‌లో అంతర్భాగమని మనం ఇంకెనే్నళ్లు చెబుతూ ఉంటాము. ఇప్పటి వరకు మనం ఏమి చేశాము. దాన్ని ఎప్పుడయినా వెనక్కి తీసుకున్నామా’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ గురించి అడగ్గా, ఈ దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొని ఉన్నదంటే భారత్, పాకిస్తాన్‌లు క్రికెట్ సిరీస్‌ను ఆడటానికి మూడో దేశాన్ని వెతుక్కునేలా ఉందని ఆయన బదులిచ్చారు. ఇరు దేశాల మధ్య యుద్ధం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని అబ్దుల్లా అన్నారు. ‘మనం ఇప్పటికే మూడుసార్లు యుద్ధం చేశాం. ఇరు దేశాల్లో ప్రజల ప్రాణాలు పోవడం తప్పించి, ఎవరూ కూడా ఏమీ సాధించలేదు’ అని అబ్దుల్లా అన్నారు.
అబ్దుల్లా వ్యాఖ్యలపై బిజెపి నాయకుడు, జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ స్పందిస్తూ, ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఆయన వ్యాఖ్యలను దేశం ఎన్నటికీ అంగీకరించబోదని అన్నారు.