జాతీయ వార్తలు

‘పఠాన్‌కోట్’పై దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడి కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ) బృందాలు జమ్మూ రీజియన్‌లో గత ఏడాది ఇదేవిధమైన దాడులు జరిగిన సాంబా, కథువా ప్రాంతాలను మంగళవారం సందర్శించాయి. అంతేకాకుండా వైమానిక స్థావరంపై దాడికి కొన్ని గంటల ముందు ఉగ్రవాదలు కిడ్నాప్ చేసిన పంజాబ్ పోలీసు అధికారి సల్వీందర్ సింగ్‌ను వరుసగా రెండో రోజు కూడా ఎన్‌ఐఎ అధికారులు ప్రశ్నించారు. పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు గత ఏడాది మార్చి 21వ తేదీన జమ్మూ-పఠాన్‌కోట్ హైవే పక్కన సాంబాలో సైనిక శిబిరంపై దాడికి తెగబడిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడిన ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టగా, ఎదురుకాల్పుల్లో సైనిక మేజర్ సహా ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనకు ముందు రోజు మరో ఉగ్రవాద మూక కథువాలోని రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా వారికి, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ముగ్గురు భద్రతా సిబ్బంది, మరో ఇద్దరు సామాన్య పౌరులు మృతిచెందిన విషయం విదితమే. ఈ దాడులకు, ఇటీవల పఠాన్‌కోట్‌లో జరిగిన దాడులకు మధ్య సారూప్యతలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఎన్‌ఐఎకి చెందిన వేర్వేరు బృందాలు మంగళవారం ఈ రెండు ప్రాంతాలను సందర్శించాయని జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. అలాగే పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి సందర్భంగా ఆ ప్రాంతానికి సంబంధించిన కొన్ని టెలిఫోన్ టవర్ల ద్వారా జరిగిన ఫోన్‌కాల్స్ వివరాలను సమర్పించాలని అధికారులు సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించినట్లు ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి.
ఇదిలావుంటే, పఠాన్‌కోట్‌లో దాడికి ముందు ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఎస్‌పి ర్యాంకు అధికారి సల్వీందర్ సింగ్‌ను మంగళవారం ఎన్‌ఐఎ ప్రధాన కార్యాలయంలో వరుసగా రెండో రోజు కూడా ప్రశ్నించారు. వైమానిక స్థావరంలోకి ఉగ్రవాదులు చొరబడేందుకు వీలు కల్పించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్వీందర్ సింగ్ ఈ విచారణలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లు ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేయడానికి ముందు పంజాబ్‌లోని పంజ్ పీర్ దర్గాను సందర్శించినట్లు సల్వీందర్ సింగ్ చెప్పడంతో ఆ దర్గా సంరక్షకుడు సోమ్‌రాజ్‌కు కూడా ఎన్‌ఐఎ సమన్లు జారీ చేసింది.
50 రూపాయలిస్తే చాలు..
మరోవైపు ఈ కేసుపై ఎన్‌ఐఎ జరుపుతున్న దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నెల 2వ తేదీన దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఇష్టంగానో లేక అయిష్టంగానో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోని ఒక ఉద్యోగి సహకరించినట్లు ఎన్‌ఐఎ దర్యాప్తులో తేలిందని సిఎన్‌ఎన్-ఐబిఎన్ వార్తా చానల్ వెల్లడించింది. కేవలం 50 రూపాయలు చెల్లిస్తే ఎవరినైనా ఈ వైమానిక స్థావరంలోకి ప్రవేశించేందుకు అక్రమంగా అనుమతిస్తున్నట్లు ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తులో తేలిందని, వైమానిక స్థావరంలో పశువులను మేపుకునేందుకు స్థానికులను ఈవిధంగా అనుమతిస్తున్నారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.