జాతీయ వార్తలు

కట్టుబాట్ల ప్రకారమే ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 12: రుతుస్రావ వయసులో ఉన్న యువతులు, మహిళలను శబరిమలలోని చారిత్రాత్మక అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించనీయకపోవడం అక్కడి కట్టుబాట్లలో భాగమేనని, ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిందేనని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) పేర్కొంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించిన మరుసటి రోజే ఆ ఆలయ నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న టిడిబి మంగళవారం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న యువతులు, మహిళలను ఈ ఆలయంలోకి ప్రవేశించనీయకుండా నిషేధాన్ని కొనసాగించాలన్న తమ వైఖరిని సుప్రీం కోర్టుకు వివరిస్తామని టిడిబి అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ తిరువనంతపురంలో పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. శబరిమల ఆలయంలో యువతులు సహా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలని యువ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరుపుతూ, ఈ సాంప్రదాయాన్ని రాజ్యాంగం సమర్థించడం లేదని స్పష్టం చేసిన విషయం విదితమే. అయితే 2006లో సిపిఎం నేతృత్వంలోని అప్పటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ప్రభుత్వ హయాంలో దాఖలైన అఫిడవిట్‌ను ఆధారంగా చేసుకుని సుప్రీం కోర్టు ఈ అభిప్రాయన్ని వెలిబుచ్చిందని, ‘నైస్థిక బ్రహ్మచారి’గా పరిగణించే స్వామి అయ్యప్ప ప్రాశస్థ్యం గురించి, శబరిమల ఆలయంలో జరిగే పూజల ప్రత్యేకత గురించి సరిగా తెలియక సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని గోపాలకృష్ణన్ చెప్పారు. శబరిమల ఆలయ ఆచారాలు, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు టిడిబితోపాటు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ ఆలయాన్ని సందర్శించేటప్పుడు అక్కడి విశ్వాసాలను, ఆచార వ్యవహారాలను పాటించాల్సిందేనని ఆయన అన్నారు. ఈ విషయమై సుప్రీం కోర్టులో తమ వాదన వినిపించేందుకు ఈ కేసులో టిడిబి ఇంప్లీడ్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుంటే, శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించనీయకపోవడం కేవలం ఆచార, వ్యవహారాలతో ముడిపడిన అంశం మాత్రమే కాదని, ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు మూడు నెలల కాలంలో అక్కడ లక్షలాది మంది భక్తులతో విపరీతంగా ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని మహిళల భద్రతకోసం కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం జరుగుతోందని కేరళ విహెచ్‌పి (విశ్వ హిందూ పరిషత్) అధ్యక్షుడు ఎస్‌జెఆర్.కుమార్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని కొనసాగించాలని విహెచ్‌పి కోరుకుంటోందని, ఈ విషయమై సుప్రీం కోర్టును ఒప్పించేందుకు తాము కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.