జాతీయ వార్తలు

బైటపడిన పాక్ ద్వంద్వ వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడిచేసిన జైషే మహ్మద్ అధినేత వౌలానా మసూద్ ఆజర్‌తోపాటు పలువురు ఇతర ఉగ్రవాదులను అరెస్టు చేశామని భారత ప్రభుత్వానికి వర్తమానం పంపించిన పాకిస్తాన్ పాలకుల అసలు రంగు బయటపడింది. జైషే మహ్మద్ నేతల అరెస్టు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖాజీ ఖలీల్లాహ గురువారం ఇస్లామాబాద్‌లో ప్రకటించారు. ఆయన అంతటితో ఆగకుండా శుక్రవారం రెండు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం జరగటం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినాయకులపై చర్య తీసుకొనకపోతే విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం జరగటం కష్టమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించటం తెలిసిందే. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ కుట్రదారులపై చర్య తీసుకుంటామని హామీ ఇస్తే సరిపోదని, చర్యలు తీసుకున్నట్లు తమకు సాక్ష్యాలు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ టెలిఫోన్ చేసినప్పుడు స్పష్టం చేశారు. మోదీ హెచ్చరిక నేపథ్యంలో నవాజ్ షరీఫ్ సైనిక, ఇంటలిజెన్స్, సివిల్ సర్వీస్ అధికారులతో పలుమార్లు ఉన్నత స్థాయి సమావేశాలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ ఆజర్‌ను అరెస్టు చేసినట్లు పాక్ నుండి సమాచారం వచ్చింది.
ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రధాని నవాజ్ షరీఫ్ కార్యాలయం బుధవారం సాయంత్రం జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ అంశాన్ని ధ్రువీకరించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించటం లేదు. ప్రధాని కార్యాలయం జారీ చేసిన ప్రకటన అస్పష్టంగా ఉండటంతోపాటు మసూద్ అజర్‌తోపాటు ఇంకా ఎవరెవరిని అరెస్టు చేశారనేది ప్రకటనలో తెలపలేదు. కచ్చితంగా ఎంత మందిని అరెస్టు చేశారనేది స్పష్టం చేయకుండా కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జైషే మహ్మద్ కార్యాలయాన్ని సీల్ చేయటంతోపాటు పలువురు ఇతర సీనియర్ ఉగ్ర నాయకులను కూడా అరెస్టు చేసినట్లు పాక్ ప్రచార మాధ్యమాలు ప్రసారం చేశాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి అనధికారికంగా తెలియజేసింది. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ వార్తలను విశ్వసించకుండా మసూద్ అజర్‌ను అరెస్టు చేసినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేసింది. పాక్ ప్రభుత్వం మసూద్ అజర్ అరెస్టును ధ్రువీకరిస్తేనే రెండు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం జరుగుతుందని స్పష్టం చేసింది.
పాక్ ప్రభుత్వం గురువారం ధ్రువీకరిస్తే శుక్రవారం రెండు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం జరిగేది. అయితే పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖాజీ ఖలీలుల్లాహ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ మసూద్ అజర్ అరెస్టు అయినట్లు తనవద్ద ఎలాంటి సమాచారం లేదని విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తెలిపారు. రెండు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల మధ్య శుక్రవారం చర్చలు జరగటం లేదని ఆయన ప్రకటించారు. చర్చల తేదీలను సవరించేందుకు రెండు దేశాల మధ్య పరస్పర చర్చలు జరుగుతున్నాయని ఖాజా ఖలీలుల్లాహ చెప్పారు.