అంతర్జాతీయం

పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లిన జకార్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జనవరి 14: ఇండోనేసియా రాజధాని జకార్తా గురువారం పేలుళ్లు, తుపాకీ కాల్పుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. గురువారం ఉదయం నిత్యం రద్దీగా ఉండే ఓ షాపింగ్ ఏరియాలో సాయుధ దుండగులు స్టార్‌బక్స్‌కు చెందిన ఒక హోటల్‌లో పేలుడు పదార్థాలతో దాడి చేయడంతో పాటు పోలీసులతో హోరాహోరీ కాల్పులకు దిగడంతో వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోవడమే కాకుండా ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు ఎత్తయిన భవనాలపైనుంచి ఈ భయానక దృశ్యాలను కళ్లారా చూసి భయంతో వణికిపోయారు. పారిస్ దాడులను అనుకరించిన అయిదుగురు ఉగ్రవాదులు షాపింగ్ మాల్స్, వివిధ దేశాల దౌత్యకార్యాలయాలు, ఐక్యరాజ్య సమితి కార్యాలయాలతో నిత్యం బిజీగా ఉండే ప్రాంతం తామ్రిన్ స్ట్రీట్‌లో గ్రెనేడ్లు పేల్చి, జనంపై కాల్పులకు దిగారు. ఈ దాడిలో ఒక ఇండోనేసియా పౌరుడు చనిపోగా, మరో 19 మంది గాయపడ్డారు. ఒక పోలీసు పోస్టు ధ్వంసమైంది. ‘ఇది ఇండోనేసియాలో ఐఎస్‌ఐఎస్‌తో సంబంధం ఉన్న ఓ ముఠా జరిపిన దాడి అయి ఉండవచ్చన్న అనుమానాలు బలంగా ఉన్నాయి’ అని జాతీయ పోలీసు ప్రతినిధి ఆంటోన్ చార్లియాన్ ఎఎఫ్‌పి వార్తాసంస్థకు చెప్పారు. ఇస్లామిక్ మిలిటెంట్లు పెద్దఎత్తున దాడికి పథకం వేస్తున్నారని ఇటీవలి వారాల్లో ఇంటెలిజన్స్ వర్గాలు పలు హెచ్చరికలు చేసిన తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ముఠా ఇటీవలి పారిస్ దాడుల తీరును అనుకరించినట్లు దాడులు జరిగిన తీరును బట్టి అనిపిస్తోందని కూడా ఆయన చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన వరస దాడుల్లో 130 మందికి పైగా చనిపోవడం తెలిసిందే.
దాడికి పాల్పడ్డ అయిదుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురు మానవ బాంబులున్నారని, వారు మొదట ఓ షాపింగ్ మాల్‌కు ఎదురుగా ఉన్న స్టార్‌బక్స్ కేఫ్‌ను టార్గెట్‌గా చేసుకున్నారని చార్లియాన్ చెప్పారు. మొదటి పేలుడు తర్వాత పిస్టళ్లుతో ఇద్దరు మిలిటెంట్లు ఇద్దరు వ్యక్తులను బందీలుగా పట్టుకున్నారని ఆయన చెప్పారు. బందీల్లో ఒకరు అల్జీరియాకు చెందిన వారు కాగా, మరొకరు డచ్ పౌరుడని అయన చెప్పారు. అయితే రెండో వ్యక్తి కెనడాకు చెందిన వాడని జకార్తా పోలీసు చీఫ్ టిటో కర్నవియాన్ చెప్పారు. అల్జీరియాకు చెందిన వ్యక్తి బులెట్ గాయాలతో దుండగులనుంచి తప్పించుకున్నాడని, అయితే రెండో వ్యక్తిని కాల్చి చంపారని, అలాగే బందీలకు సాయం చేయడానికి ప్రయత్నించిన ఓ ఇండోనేసియా పౌరుడ్ని కూడా దుండగులు కాల్చి చంపారని చార్లియాన్ చెప్పారు. ఆ తర్వాత మోటారు బైకులపై ఇద్దరు వ్యక్తులు ఒక పోలీసు పోస్టులోపలికి వెళ్లి తమను పేల్చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ దాడిలో నలుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని ఆయన చెప్పారు. స్టార్‌బక్స్‌లోనుంచి వచ్చిన ఓ సాయుధ దుండగుడు దారిన వెళ్లే వారిపైకి కాల్పులు జరపడం, తన ఆయుధాన్ని రీలోడ్ చేసుకోవడం, కదులుతున్న వాహనాల వెనుకవైపునుంచి భద్రతా దళాల ముందుకు రావడం చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నాలుగు పేలుళ్లు జరిగినట్లు పోలీసులు చెప్తుండగా, ఆరు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
కాగా, శాంతిభద్రతలను భగ్నం చేయడం, ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించడమే ఈ దాడుల ప్రధాన లక్ష్యమని స్పష్టమవుతోందని ఇండోనేసియా అధ్యక్షుడు జోకో జోకోవి విదోడో టీవీలో చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జావాలోని సిరెబాన్ పట్టణంలో ఉన్న ఆయన వెంటనే జకార్తా తిరిగి వస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఉగ్రవాద దాడులకు ప్రభుత్వం, దేశం, ప్రజలు భయపడరని, వాటిని తిప్పికొడతామని ఆయన చెప్పారు.
2009లో తర్వాత జకార్తాలో ఇంత పెద్దఎత్తున దాడి జరగడం ఇదే మొదటిసారి. ఆ దాడుల్లో ఏడుగురు చనిపోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. 2002లో రిసార్ట్ దీవి బాలిలోని నైట్‌క్లబ్‌లపై జరిగిన బాంబు దాడుల్లో 202 మంది చనిపోయారు. వారిలో ఎక్కువ మంది విదేశీయులే. గంటన్నర పోరు తర్వాత కూడా కాల్పులు వినిపించాయి. పోలీసులకు, మిలిటెంట్లకు మధ్య కాల్పులు ముగిసిన తర్వాత మూడు మృతదేహాలు పేవ్‌మెంట్ పక్కన పడి ఉండడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు.

ఇండోనేసియా రాజధాని జకార్తాలో గురువారం దాడికి తెగబడిన మిలిటెంట్లను ఎదుర్కొంటున్న భద్రతా దళాలు. కాల్పులకు భయపడి పరుగులు తీస్తున్న జనం. ఎదురుకాల్పులు, పేలుళ్ల అనంతరం చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు