జాతీయ వార్తలు

‘స్టార్టప్’లు కొత్తేమీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన అంకుర పరిశ్రమల విధానం (స్టార్టప్)లో పలు లోపాలున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ విమర్శించారు. ఈ విధానాన్ని యుపిఏ ప్రభుత్వ హయాంలోనే అమలుచేయటం జరిగిందని, గతంలో అమలైన విధానాన్ని నరేంద్ర మోదీ కొత్తగా కనుగొన్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. యుపిఏ హయాంలో భారత్ మూడో అతిపెద్ద అంకుర పరిశ్రమల కేంద్రంగా మారిందనేది మరిచిపోరాదని ఆయన అన్నారు. అంతర్జాలం (ఇంటర్‌నెట్) తటస్థ వైఖరి విషయంలో అంకుర పరిశ్రమలు, పెద్ద పరిశ్రమల మధ్య ఎలాంటి భేదం చూపించకూడదని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర పారిశ్రామికవేత్తలు చేసిన డిమాండ్‌ను నరేంద్ర మోదీ పట్టించుకోకపోవటం శోచనీయమని జైరాం రమేశ్ విమర్శించారు. అంతర్జాలం తటస్థ వైఖరి గురించి మోదీ వౌనం వహించటం వలన పలు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అంకుర పరిశ్రమలకు పదివేల కోట్ల నిధి ప్రకటించటం గొప్ప విషయమేదీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంకుర పరిశ్రమలకు స్వదేశంతోపాటు విదేశీ నిధులు వాటంతటవే పెద్దఎత్తున వస్తాయనేది అందరికీ తెలిసిందేనని అన్నారు. సమాజంపై అధిక ప్రభావం చూపించే వ్యవసాయ సంబంధ సాంకేతిక పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలకు ఈ నిధులను మళ్లిస్తే బాగుంటుందని జైరాం రమేశ్ ప్రధాన మంత్రికి సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది, ఎగుమతులు తగ్గిపోతున్నాయి, డిమాండ్ ఆశించిన స్థాయిలో పెరగటం లేదు, రూపాయి మారకం రేటు పడిపోతోంది, ఈ పరిస్థితిలో ప్రభుత్వ నిధిని జెనెరిక్ వెంచర్ పెట్టుబడుల నిధికి మళ్లించటం మంచిదని జైరాం రమేశ్ ఎన్‌డిఏ ప్రభుత్వానికి సూచించారు.

వచ్చే సమావేశాల్లోనే
జిఎస్‌టి బిల్లుకు ఆమోదం

వెంకయ్య ఆశాభావం

న్యూఢిల్లీ, జనవరి 17: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన నివాసంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల తేదీలను సిసిపిఏ సమావేశంలో ఖరారు చేస్తామన్నారు. బడ్జెట్ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లును ఆమోదించటం ఎంతో అవసరమని, కాంగ్రెస్ పార్టీ జిఎస్‌టి బిల్లును సమర్థించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి జిఎస్‌టి బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరిన విషయాన్ని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా జిఎస్‌టి బిల్లును సమర్థిస్తున్నారన్నారని తెలిపారు.

మహిళను కాల్చి చంపి.. ఎస్‌ఐ ఆత్మహత్య

న్యూఢిల్లీ, జనవరి 17: ఒక మహిళను దారుణంగా కాల్చి చంపిన సబ్‌ఇన్‌స్పెక్టర్ అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 4లో పట్టపగలు ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఎస్‌ఐను రాజస్థాన్‌కు చెందిన విజేంద్ర బిష్ణోయ్ (33)గా గుర్తించారు. హత్య గురైన మహిళ ద్వారకలో నివసించే మాజీ న్యూస్ కంట్రిబ్యూటర్ నిఖిత (28). ఈమె భర్తకు దూరంగా ఉంటోంది. అయితే విజేంద్రకు నిఖితతో ఉన్న అక్రమ సంబంధం కారణంగా ఈ సంఘటన జరిగివుంటుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. విజేంద్ర గృహహింసకు పాల్పడినట్లు ఆయన భార్య ఫిర్యాదు మేరకు రాజస్థాన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆ అధికారి తెలిపారు. ఆదివారం ఉదయం 9.45 గంటలకు నిఖిత, విజేంద్ర ద్వారకలోని పార్కులో కలుసుకున్నారు. అయితే అకస్మాత్తుగా విజేంద్ర తన రివాల్వర్‌తో నిఖితపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. నిఖిత అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే తనను తాను కాల్చుకున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ విజేంద్ర కూడా మృతిచెందాడు. 2008లో ఎస్‌ఐగా జాయిన్ అయిన విజేంద్ర బిష్ణోయ్ ప్రస్తుతం ఢిల్లోలోని రన్‌హౌలా స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

బిజెపికి మద్దతివ్వం

కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్‌సి నేత ఒమర్ స్పష్టీకరణ

శ్రీనగర్/జమ్ము, జనవరి 17: జమ్మూకాశ్మీర్‌లో తాము బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమస్యే లేదని నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. తమ పార్టీకి అధికార దాహం లేదని, సిద్ధాంతం విషయంలో ఎలాంటి రాజీ ధోరణిని ప్రదర్శించబోమని ఆయన ఆదివారం సామాజిక మాధ్యమ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సైద్ధాంతికంగా రాజీపడి రాజకీయాధికారాన్ని చేపట్టడం పట్ల తమకు ఆసక్తి లేదని, అందుకే సంవత్సరం క్రితమే బిజెపితో జట్టు కట్టలేదని, ఇప్పటికీ తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన వివరించారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటులో బిజెపికి మద్దతిస్తామని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఆదివారం ఖండించారు. పిడిపి, బిజెపిలు తమ సమస్యలను పరిష్కరించుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బిజెపి తమను కోరితే, ఆ ప్రతిపాదనపై తమ పార్టీ వర్కింగ్ కమిటీలో చర్చిస్తామని మాత్రమే తాను శనివారం చెప్పానని ఫరూక్ అబ్దుల్లా వివరించారు.