జాతీయ వార్తలు

జనరల్ కెవి కృష్ణారావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ హైదరాబాద్, జనవరి 30: సైనికదళ మాజీ ప్రధానాధికారి జనరల్ కెవి కృష్ణారావు (92) ఇకలేరు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించేందుకు 1971లో జరిగిన యుద్ధంలో కీలకపాత్ర పోషించిన కృష్ణారావు న్యూఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదం అత్యంత పతాక స్థాయికి చేరినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్‌గా కృష్ణారావు విశిష్ట సేవలు అందించిన విషయం తెలిసిందే. సైనిక దళంలో నాలుగు దశాబ్దాల పాటు సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించి దేశానికి ఎనలేని సేవలు అందించిన కృష్ణారావు భారత సైనికదళ 14వ ప్రధానాధికారిగా వ్యవహరించారు. 1942 ఆగస్టు 9వ తేదీన సైనిక దళంలో చేరిన కృష్ణారావు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యువ అధికారిగా బర్మా, వాయువ్య సరిహద్దు, బలూచిస్తాన్ ప్రాంతాల్లో పనిచేశారు. 1947లో దేశ విభజన జరిగినకు ముందు తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్‌లలో పనిచేసిన కృష్ణారావు 1947-48లో జమ్మూ-కాశ్మీరులో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1949-51 మధ్య నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక బోధకుడిగా సేవలు అందించిన కృష్ణారావు 1965-66 మధ్య లడఖ్ ఫార్వర్డ్ ఏరియా బ్రిగేడ్‌కు, 1969-70 మధ్య జమ్మూ రీజియన్ పదాతిదళ (ఇన్‌ఫాంట్రీ) విభాగానికి, 1970-72 మధ్య నాగాలాండ్, మణిపూర్‌లలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న వౌంటెన్ డివిజన్‌కు సారథ్యం వహించారు. ఈ సమయంలోనే ఆ డివిజన్ 1971లో పాక్‌తో జరిగిన యుద్ధంలో కూడా పాల్గొని సిల్హెట్ ఏరియాను కైవసం చేసుకోవడంతో పాటు ఈశాన్య బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో కీలకపాత్ర పోషించిందని సైనిక దళం ఒక ప్రకటనలో వివరించింది. ఈ యుద్ధ సమయంలో అత్యంత ధైర్య, సాహసాలను, నాయకత్వ ప్రతిభను చాటుకుని దేశానికి అకుంఠిత దీక్షతో సేవలను అందించిన కృష్ణారావును కేంద్ర ప్రభుత్వం ‘పరమ విశిష్ఠ సేవా పతకం’తో సత్కరించింది.
రక్షణ మంత్రి సంతాపం
జనరల్ కెవి.కృష్ణారావు మరణం పట్ల రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కృష్ణారావు మరణంతో దేశం ఒక సమర్థుడైన సైనిక నాయకుడిని కోల్పోయిందని పారిక్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టి కలిగిన కృష్ణారావు అనేక మంది సైనికులకు ఆదర్శంగా నిలిచారని, 80 దశకంలో సైన్యాన్ని ఆధునీకీకరించటంతలో ఆయన ప్రముఖ పాత్ర నిర్వహించారని పారిక్కర్ ప్రశంసించారు. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధంలో కృష్ణారావు నిర్వహించిన పాత్ర చిరస్మీరణీయని, దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరిచిపోలేమని రక్షణ శాఖ తెలిపారు. 1981 జూన్ 1వ తేదీన భారత సైన్యాధ్యక్షుడుగా నియమితుడైన కృష్ణారావు 1983 జూలై ఆఖరు వరకు పదవిలో కొనసాగడంతో పాటు త్రివిధ దళాల కమిటీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. పదవీ విరమణ అనంతరం నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం గవర్నర్‌గా పనిచేసిన కృష్ణారావు ఆ తర్వాత జమ్ము-కాశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఆ రాష్టంలో శాంతిని నెలకొల్పటంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
గవర్నర్, సిఎంల సంతాపం
కృష్ణారావు మృతి పట్ల గవర్నర్ ఇఎస్‌ఎల్.నరసింహన్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేరువేరు ప్రకటనల్లో సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశ రక్షణకు కృష్ణారావు విశిష్ట సేవలు అందించారని వారు ఘనంగా నివాళులర్పించారు.