జాతీయ వార్తలు

మాటలు తప్ప చేతలు ఏవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపెద్ద మాటలు చెబుతున్నారనీ, చేతల్లో మాత్రం ఏమీ ఉండటం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున దాడికి దిగారు. లోక్‌సభలో మంగళవారం అసహనం పెరిగిపోవటం గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ నుండి మంచి గుణాలు నేర్చుకోవాలి కానీ చెడ్డ గుణం కాదని మోదీకి హితవు చెప్పారు. దాద్రీ దాడిలో మహమ్మద్ అక్లాఖ్ మరణించిన అనంతరం భారత వైమానిక దళంలో పనిచేసే అతని కుమారుడు సర్తాజ్ మాట్లాడుతూ సారే జహా సే అచ్చా హిందూస్తాన్ హమారా (ప్రపంచం మొత్తంలో భారత దేశమే గొప్పది) అని చెబితే ప్రధాని మాత్రం దీనికి బదులివ్వలేకపోయారని దుయ్యబట్టారు. నైపుణ్య భారత్ గురించి మాట్లాడే మోదీ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు సమ్మె చేస్తే పట్టించుకోరని విమర్శించారు. దబోల్కర్, పంసారా, కల్బుర్గీ వంటి మేధావులు హత్యకు గురైతే మోదీ మాత్రం నోరెత్తటం లేదని రాహుల్ ఆరోపించారు. గుజరాత్ పట్టేదార్ల ఆందోళనకు సమాధానం ఇవ్వకుండా పోలీసు కేసులు పెడతారా? అని రాహుల్ ప్రశ్నించారు. బిజెపి మద్దతుదారులు తనపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి అరుణ్‌శౌరీ ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పలువురు రచయితలు, శాస్తవ్రేత్తలు, మేధావులు తమ అవార్డులు వాపస్ చేస్తుంటే ప్రభుత్వం స్పందించటం లేదు కానీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం అవార్డులను వాపస్ చేయటం బోగస్ అని విమర్శించటం సిగ్గు చేటన్నారు. నారాయణమూర్తి, రఘురాం రాజన్, పి.ఎం.్భర్గవ లాంటి వారు ఆందోళనకు గురవుతున్నారు కాబట్టే తమ అవార్డులు వాపస్ చేస్తున్నారు, మనసు విప్పి మాట్లాడుతున్నారని రాహుల్ వివరించారు. వారి ఆందోళనను అర్థం చేసుకోవలసిన బాధ్యత ప్రధానిపై లేదా అని ఆయన నిలదీశారు. వారు చెప్పేది వినటం ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. మన సహనశక్తి మూలంగానే ప్రఖ్యాతి గడిస్తున్నామనే వాస్తవాన్ని గ్రహించాలని రాహుల్ సూచించారు. పాకిస్తాన్ విఫలం కావటానికి ఆ దేశ ప్రజలకు వాక్ స్వాతంత్రం లేకపోవటమేననే వాస్తవాన్ని మోదీ గుర్తించాలన్నారు. పాక్ నాయకులు తమకు ఇష్టం లేని గొంతులను నొక్కేశారు కాబట్టే ఆ దేశం అభివృద్ధి చెందటం లేదని రాహుల్ అభిప్రాయపడ్డారు. పాక్ పాలకుల అసహనం మూలంగానే ఆ దేశం దెబ్బతింటోందన్న వాస్తవాన్ని మన పాలకులు గ్రహించాలన్నారు. మహత్మా గాంధీ మన దేశ ప్రజలకు మాట్లాడే హక్కు కల్పించారు, అలాంటి గాంధీ గుండెల్లో నాథురాం గాడ్సే తూటాలు దించారని రాహుల్ అన్నారు. నరేంద్ర మోదీ పార్లమెంటులో మహాత్మా గాంధీని పొగుడుతారు, అయితే సాక్షి మహారాజ్ నాథూరాం గాడ్సేను ప్రశంసలతో ముంచెత్తినప్పుడు మాత్రం మోదీ వౌనం వహించటం ఏమిటని రాహుల్ నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇకనైనా దేశ ప్రజలు ఏం చెబుతున్నారనేది వినాలి, తెలుసుకోవాలన్నారు. తన సహచరులు ప్రజల గొంతు నులుముతుంటే వౌనం వహించటం ఎంత మాత్రం మంచిది కాదని ఆయన మోదీని హెచ్చరించారు. మోదీ రాజ్యాంగాన్ని సంరక్షిస్తారా? లేదా గాలి కబుర్లు చెబుతారా? అని రాహుల్ ప్రశ్నించారు.