జాతీయ వార్తలు

నా రక్తంలోనే దేశభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశభక్తి నా రక్తంలో, నా హృదయంలో ఉంది... ఇది మినహా నాలో ఏమీలేదు... ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా ఏమైనా చేసినా, చెప్పినా కఠినంగా శిక్షించాలి... కానీ దేశంలోని విద్యార్థులు, విద్యాసంస్థలు, జెఎన్‌యును అపఖ్యాతిపాలు చేయటం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు గురువారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంటున్న సంఘటనలపై ఫిర్యాదు చేశారు. రాహుల్‌తోపాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాధిత్య సింధియా తదితరులు రాష్టప్రతిని కలిసి జెఎన్‌యు విషయంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఫిర్యాదు చేశారు. దేశంలోని యువతలో శక్తి ఉన్నది... కొత్త కొత్త ఆలోచనలున్నాయి... వేరు వేరు భావాలున్నాయి... వీటన్నింటినీ ఒక అలోచనా విధానంలోకి తెచ్చేలా కట్టడి చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్ తెస్తున్న వత్తిడిని ఎదుర్కొంటామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్ దేశంలోని విద్యార్థులందరిపై తమ ఆలోచనా విధానాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తోంది... తమ విధానాన్ని వ్యతిరేకించే వారందరిపై కక్ష కడుతోంది... హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల విషయంలో ఇదే జరిగిందని ఆయన ఆరోపించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా, ఎన్‌డిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని అణిచివేస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ అణిచివేతను కొనసాగనివ్వదని ఆయన స్పష్టం చేశారు. పత్రికా విలేఖరులను కొడుతున్నారు... అయినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం విద్యార్థులను, విలేఖరులను రక్షించాలి తప్ప అణిచివేయకూడదని, ఈ కారణం చేతనే తాము రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఎన్‌డిఏ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినట్లు రాహుల్ గాంధీ వివరించారు. దేశంకోసం మా కుటుంబం పలుమార్లు త్యాగం చేసిందని రాహుల్ గాంధీ చెప్పారు. మన విద్యా సంస్థలను నాశనం చేసి విద్యార్థులను అణిచివేయటం ప్రభుత్వం పని కాదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మృత ఆలోచనా విధానాన్ని విద్యార్థులపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని, ఇది అదిపెద్ద నేరమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఎదుర్కొంటుందని ఆయన ప్రకటించారు. తన అభిప్రాయాలను వెల్లడించేందుకు ప్రయత్నించిన రోహిత్ వేములను ఈ ప్రభుత్వం అణిచివేసిందన్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత విధానం మూలంగా ప్రపంచంలో భారతదేశం ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన చెప్పారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఏదైనా హామీ ఇచ్చారా? ఏదైనా చర్య తీసుకుంటానని చెప్పారా? అని విలేఖరులు అడుగ్గా, రాహుల్ గాంధీ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.