జాతీయ వార్తలు

చల్లారని జెఎన్‌యు రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా/వదోదర/చెన్నై : ఢిల్లీ జెఎన్‌యు వ్యవహారం దేశవ్యాప్తంగా అట్టుడుకుతోంది. జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్టుకు నిరసనగా, అనుకూలంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. కొన్ని నగరాలకే పరిమితమైన నిరసన కార్యక్రమాలు గురువారం మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో కన్హయ్య కుమార్‌కు మద్దతుగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని పాటియాల కోర్టు వద్ద కన్హయ్య కుమార్‌పై దాడి చేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న ఆందోళకారులను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తమిళ జానపద కళాకారుడు కొవన్ సహా 57 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య కమార్ అరెస్టును నిరసిస్తూ వదోదరలోని యూనివర్శిటీ ఆఫ్ బరోడా వద్ద పోస్టర్లు వెలిశాయి. కేరళ అసెంబ్లీలోనూ జెఎన్‌యు వ్యవహారం కుదిపేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా నగరాల్లో ఎబివిపి కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వందేమాతరం నినాదాలు ఇచ్చారు. జెఎన్‌యులోని జాతి వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బిహార్ రాజధాని పాట్నాలో ఎఐఎస్‌ఎఫ్, ఆర్‌జెడి యూత్ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలతో గొడవకు దిగారు. బిజెపి కార్యాలయం వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. ఎఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు, లాలూ ప్రసాద్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు బిజెపి రాష్ట్ర కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారని పాట్నా సిటీ సూపరింటిండెంట్ చందన్ కుష్వా తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తలు, లెఫ్ట్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపైకి ఒకరు రాళ్లు, వాటర్ బాటిళ్లు విసురుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. ఇక చెన్నైలో మక్కల్ కలై ఇలకియా కజగం, రివల్యూషనరీ స్టూడెంట్స్ యూత్ ఫ్రంట్ మరో ఐదు విద్యార్థి సంఘాలు కన్హయ్య కుమార్ అరెస్టుకు నిరసనగా ప్రదర్శన చేశాయి. నుంగంబాకంలోని శాస్ర్తి భవన్ ఎదుటు ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

chitram...
జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న పలు విద్యార్థి సంఘాల కార్యకర్తలు.
పాట్నాలో పరస్పరం దాడులకు దిగిన విద్యార్థులు, బిజెపి కార్యకర్తలు

జెఎన్‌యులో జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం బెంగళూరులో 200 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించిన ఎబివిపి కార్యకర్తలు. ముంబయలో ఎబివిపి ఆందోళన

కన్హయ్యను విడుదల చేయాలి

సిపిఐ డిమాండ్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశద్రోహం కేసులో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌పై కేసులను ఉపసంహరించి వెంటనే విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ను కోరినట్లు సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. సురవరం గురువారం విలేఖరులతో మాట్లాడుతూ జెఎన్‌యులో జరిగిన పరిణాణాలు, పాటియాల కోర్టులో న్యాయవాదుల దాడి తదితర అంశాలపై రాజ్‌నాథ్‌తో చర్చించామన్నారు. జెఎన్‌యులో జరిగిన సంఘటనలు, అనంతర పరిణామాలపై ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సి అత్యుత్సాహం ప్రదర్శించారని సురవరం విమర్శించారు. కోర్టు ఆవరణలోనే దాడిచేసిన వారిపైనా, నడిరోడ్డుపై ఎమ్మెల్యే ఓపీ శర్మ సిపిఐ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే కేసులు ఎందుకు నమోదు చేయాలేదో ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాటియాల కోర్టులో జర్నలిస్టులు, విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్న సురవరం, జర్నలిస్టులు, విద్యార్థులపై దాడులను అడ్డుకోవడంలో విఫలమైన ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సిని తొలగించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను బిజెపి నిలబెట్టుకోలేక మొదట మైనారిటీలపైన, తర్వాత దళితులపై, ఇప్పుడు వామపక్షాలపై దాడులకు దిగుతోందని సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. జెఎన్‌యు పరిణామాలు, తర్వాత జరిగిన ఘటనలపై ప్రభుత్వంపై ఎలా వ్యవహరించాలన్న దానిపై వామపక్ష పార్టీలు శుక్రవారం సమావేశం అవుతాయని సురవరం అన్నారు. విలేఖరుల సమావేశంలో సిపిఐ నేతలు డి.రాజా, కె.నారాయణ పాల్గొన్నారు.
నేడు వామపక్షాల భేటీ: ఏచూరి
జెఎన్‌యు సాకుతో వామపక్ష పార్టీలపై మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు చేస్తున్న దాడులను ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. ఈ అంశంపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు ఆరు వామపక్ష పార్టీలతో శుక్రవారం ఢిల్లీలో సమావేశమవుతామని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో సిపిఎం 21వ మహాసభ ఆమోదించిన ఆంశాల ఆధారంగానే పోటీ చేస్తామని ఏచూరి అన్నారు. బెంగాల్ ప్రజలను ఐక్యపరచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని, కలిసొచ్చే ప్రజాతంత్ర శక్తులతో ముందుకెళ్తామని అన్నారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోటీ వ్యూహాలపై ప్రస్తుత రాజకీయ అంశలపై చర్చించేందుకు ఉద్దేశించిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు గురువారం ముగిశాయి. ఎన్డీయే ప్రభుత్వ ప్రోత్సాహంతో సంఘ్ శక్తులు జెఎన్‌యులో చేస్తున్న దాడిని కేంద్ర కమిటీ ఖండించినట్టు ఏచూరి తెలిపారు.

కన్హయ్య కుమార్‌పై కేసులను ఉపసంహరించి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సిపిఐ నాయకులు

ఇల్లు నిర్మాణంలో జాప్యం..అడ్మిషన్ల నిరాకరణ
లోక్‌అదాలత్‌ను ఆశ్రయించొచ్చు
ప్రజలకు సర్కార్ వెసులుబాటు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పూర్తయిన ఇల్లు నిర్మాణంలో జాప్యం, వడ్డీ చెల్లించకపోయినా, ఏవో కారణాలు చూపి విద్యాసంస్థల్లో ప్రవేశాలు నిరాకరించినా సత్వర పరిష్కారం కోసం లోక్‌అదాలత్‌ను ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు పట్టేసున్న నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనలు, సలహాల ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘విద్యా లేదా విద్యా సంస్థలు’ మరియు ‘హౌసింగ్, రియల్ ఎస్టేట్ సర్వీసులు’ ప్రజాప్రయోజన సర్వీసుల కింద పరిగణిస్తారు. అలాంటి కేసులను లోక్‌అదాలత్‌ను ఆశ్రయించి పరిష్కారం పొందవచ్చు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వశాఖ మంగళవారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 1987 లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టంలోని 22ఏ సెక్షన్‌లో ఈ రెండు కొత్త సర్వీసులను చేర్చారు. రవాణా సర్వీసులు, పోస్టల్, టెలీగ్రాఫ్, టెలీఫోన్ సర్వీసులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం,ఆసుపత్రులు లేదా డిస్పెన్సరీలు, బీమా సర్వీసులు ఇప్పటివరకూ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ కింద పరిగణిస్తున్నారు.

వీటికి సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తితే ప్రజలు లోక్ అదాలత్‌లను ఆశ్రయిస్తున్నారు. కోర్టుల్లో కేసులు భారీగా పేరుకుపోవడంతో వాటిని తగ్గించడానికి పై రెండు సర్వీసులు చేర్చారు. గత ఏడాది అక్టోబర్‌లో జాతీయ స్థాయిలో చేపట్టిన లోక్‌అదాలత్‌లలో ట్రాఫిక్, మున్సిపల్, చిన్న చిన్న కేసులు మొత్తం కలిపి 3.50 లక్షలు పరిష్కరించారు.

టర్కీలో కారుబాంబు పేలి 28 మంది మృతి

అంకారా, ఫిబ్రవరి 18: టర్కీ రాజధాని అంకారా నగరం రక్తసిక్తమైంది. మిలిటెంట్ల బాంబు దాడుల్లో 28 మంది మృతి చెందారు. మరో 61 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి మిలటరీ వాహనాల కాన్వాయ్‌పై టర్కీష్ మిలిటెంట్లు బాంబుదాడులు చేసినట్టు ఉప ప్రధాన మంత్రి నుమన్ కర్టూల్మస్ వెల్లడించారు. దాడిలో 28 మంది మృతి చెందారు. అయితే దాడికి పాల్పడిన మిలిటెంట్లు ఏ సంస్థకు చెందిన వారైందీ తెలియరాలేదు. దేశాధ్యక్షుడు తయిపీ ఎర్డోంగా బాంబు దాడుల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని కారుబాంబును పేల్చివేసినట్టు తెలిపారు.
సెంట్రల్ అంకారాలో ట్రాఫిక్ లైట్ల వద్ద కాన్వాయ్ ఆగిన సందర్భంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దాడి జరిగిన ప్రాంతం టర్కీ సైనిక ప్రధాన కేంద్రం. పేలుళ్ల శబ్ధానికి జనం భయభ్రాంతులకు గురై ఇళ్ల బాల్కానీల్లోకి వచ్చేశారు.

పేలుళ్లు జరిగిన ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఏం జరుగుతుందో తెలియక తామంతా ఎటుబడితే అటు పరుగులెత్తామని గుర్కాన్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. తాము 500 మీటర్ల దూరంలో ఉన్నామన్న అతడు బాంబు పేలుళ్ల వల్ల దిక్కులు పిక్కటిల్లే శబ్ధం వచ్చిందన్నాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బాంబుదాడి జరిగింది.