జాతీయ వార్తలు

ఐరాసకు 11మంది ఉగ్రవాదుల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాదానికి కారకులయిన పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన 11 మంది పేర్లను భారత్ తాజాగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆంక్షల కమిటీకి అందజేసింది. వీరంతా పాకిస్తాన్‌లోని అల్‌ఖయిదా, తాలిబన్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 11మంది ఉగ్రవాదులు, ఒక ఉగ్రవాద సంస్థతో కూడిన జాబితాను ఈ నెల 18న ఐరాసకు చెందిన ఐఎస్‌ఐఎల్ (దాయేశ్), అల్‌ఖయిదా శాంక్షన్స్ కమిటీకి అందజేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ తాజా జాబితాలో పాకిస్తాన్‌లోని అల్‌ఖయిదా, తాలిబన్, ఐఎస్‌ఐఎస్ సంస్థలకు చెందిన వారి పేర్లు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ 11మంది పేర్లను మాత్రం ఆ వర్గాలు వెల్లడించలేదు. ఐఎస్‌ఐఎల్, అల్‌ఖయిదా, వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు, గ్రూపులు, సంస్థల ఆస్తులను స్తంభింపచేయడం, ప్రయాణాలను నిషేధించడం వంటి అధికారాలు ఐరాస సాంక్షన్స్ కమిటీకి ఉన్నాయి. భారత్ నేరస్థుల అప్పగింతకు సంబంధించి 40 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుందని, వీటిలో తొమ్మిది దేశాలతో ఆ ఒప్పందాలు అమలులోకి వచ్చాయని సుష్మా స్వరాజ్ వెల్లడించారు. భారత్‌లో ఉగ్రవాదం సహా వివిధ నేరాలకు పాల్పడి విదేశాలలో తలదాచుకుంటున్న వారిని వెనక్కి తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి వీలయినంత ఎక్కువ దేశాలతో నేరస్థుల అప్పగింత ఒప్పందాలు కుదుర్చుకోవాలనేది తమ ప్రభుత్వ విధానమని మంత్రి వివరించారు.

చల్లారిన జాట్‌ల ఉద్యమం

హర్యానాలో ప్రశాంత పరిస్థితులు కర్ఫ్యూ వేళల సడలింపు యథావిధిగా రైళ్లు, వాహనాలు

చండీగఢ్, ఫిబ్రవరి 24: జాట్‌ల రిజర్వేషన్ ఉద్యమ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. హింసాత్మక ఘటనలతో అట్టుడికిన రొహ్‌తక్, భివానీ జిల్లాల్లో రైళ్ల సర్వీసులు యథావిధిగా నడిచాయి. రోడ్లపై వాహనాలు తిరిగాయి. హిస్సార్ జిల్లాలో బుధవారం కర్ఫ్యూ సడలించారు. వారంపాటు అస్థవ్యస్థమైన రాకపోకలు పునరుద్ధరించారు. జాట్‌ల రిజర్వేషన్ల ఉద్యమంలో 19 మంది మృతి చెందారు. మొత్తంగా చూస్తే భివానీలోనే భారీ నష్టం సంభవించింది. ఈ జిల్లాలో కర్ఫ్యూను నాలుగు గంటలపాటు సడలించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలో పరిస్థితి మెరుగవుతోందని వారన్నారు. హిస్సార్ జిల్లాలో కర్ఫ్యూను ఎత్తివేశారు. సమీప పట్టణమైన హన్సీలో మాత్రం నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. గుంపులుగా నలుగురు లేదా ఐదుగురు సమావేశం కావడాన్ని నిషేధించారు. రొహ్‌తక్‌లో రోజంతా కర్ఫ్యూ సడలించినట్టు అధికారులు చెప్పారు. జాట్‌ల ఉద్యమం వల్ల హర్యానాలో వ్యాపార, వాణిజ్య రంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లింది. షాపులు, షోరూంలు, హోటళ్లు, మాల్స్, వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ‘రోహ్‌తక్‌లో పరిస్థితి సద్దుమణిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు సమాచారం లేదు’ అని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. కాగా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్, మాజీ ముఖ్యమంత్రి భుపేందర్ సింగ్ హూడా మంగళవారం రోహ్‌తక్‌లో పర్యటించినప్పుడు ఆస్తులు నష్టపోయినవారి నుంచి తీవ్ర నిరసన చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కట్టర్‌కు బాధితులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. హూడాను కూడా వ్యాపారులు ఘెరావ్ చేశారు. ఇక సోనిపట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

భివానీ, హిస్సార్, సోనిపట్, రొహ్‌తక్‌లలోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా దళాల పెట్రోలింగ్ కొనసాగుతోంది.

ఆందోళనకారులదే బాధ్యత

విధ్వంసాల్లో ఆస్తుల నష్టంపై సుప్రీం మార్గదర్శకాలు రూపొందిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: వివిధ రకాల డిమాండ్లలో జరుగుతున్న ఆందోళనలు, హింసా విధ్వంసకాండలకు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి దారితీయడం పట్ల సుప్రీం కోర్టు బుధవారం తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విఘాతక చర్యల ద్వారా ప్రభుత్వాలను లొంగదీసుకునే ధోరణిని సహించేది లేదని స్పష్టం చేసింది.
ఇలాంటి ఆందోళనలతో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారినే అందుకు జవాబుదారీగా చేయడానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తామని జస్టిస్ జె.ఎస్.కేహర్ సారథ్యంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఆందోళనల సమయంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలుగుతున్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం కలిగించే హేయమైన కృత్యాలకు పాల్పడేవారిపై తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని, ఇందుకు మార్గదర్శకాలను తీసుకొస్తామని సుప్రీం బెంచ్ తెలిపింది. ఈ ఆందోళనలు చేపట్టేది బిజెపి అయినా, కాంగ్రెస్ అయినా లేదా మరో సంస్థ అయినా కూడా ప్రభుత్వ ఆస్తులకు జరిగే నష్టానికి తామే బాధ్యత వహించాల్సి వుంటుందని సుప్రీం బెంచ్ తెలిపింది. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ గుజరాత్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో హార్దిక్ పటేల్‌పై ఇప్పటికే చార్జిషీట్ దాఖలైందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్‌గీ సుప్రీం కోర్టు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ దాఖలైన వెంటనే హార్దిక్‌పై చార్జిషీట్ నమోదు చేశారని వెల్లడించారు. కాగా ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను సుప్రీం కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

అఫ్జల్ కుట్ర ఫలించి ఉంటే..
మనం మిగిలేవాళ్లం కాదు

విద్యార్థులంతా దేశ వ్యతిరేకులని ఎవరూ అనరు
కుట్రదారులను సమర్థించేవారు దేశ వ్యతిరేకులే
ప్రతిపక్షాల తీరుపై వెంకయ్యనాయుడు ధ్వజం

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పార్లమెంటును పేల్చివేసేందుకు అఫ్జల్‌గురు చేసిన కుట్ర ఫలించి ఉంటే ఇక్కడ కూర్చున్న చాలామంది ప్రాణాలతో మిగిలేవారు కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. హైదరాబాద్, జెఎన్‌యులో ఇటీవల సంభవించిన సంఘటనలపై చర్చలో పాల్గొంటూ వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటును పేల్చివేసేందుకు కుట్ర చేసిన అఫ్జల్ గురును పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నవారిని అరెస్టు చేయటాన్ని మీరంతా ఖండించటం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులందరూ దేశ వ్యతిరేకులని చెప్పటం లేదు, భారత దేశానికి ఊరు, పేరు లేదనే వారు దేశ వ్యతిరేకులని ఆయన స్పష్టం చేశారు. అఫ్జల్ గురును న్యాయ వ్యవస్థ ఉరి తీసిందనే వారు దేశ వ్యతిరేకులని వెంకయ్యనాయుడు ఆవేశంతో అన్నారు. అఫ్జల్ గురు, మక్బూల్ భట్‌ను ప్రశంసిస్తూ నినాదాలు చేసిన వారు దేశ వ్యతిరేకులని చెప్పారు. జెఎన్‌యును విమర్శించటం లేదు, అందులోని కొందరు విద్యార్థులు చేస్తున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలను విమర్శిస్తున్నామని తెలిపారు. ‘జెఎన్‌యు పాలక మండలి దర్యాప్తు జరుపుతోంది. అది పూర్తి అయితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. అంతవరకు మనం బాధ్యతారహితమైన ప్రకటనలు చేయటం మంచిది కాదు’ అని ఆయన ప్రతిపక్షానికి హితవు చెప్పారు.
జితేందర్ రెడ్డి వివరణ
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య అనంతరం శాంతి భద్రతలను కాపాడేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని చర్యలు తీసుకున్నారని, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయకు పూర్తిస్థాయి భద్రత కల్పించారని లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి వివరించారు. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్యను తాము రాజకీయం చేయలేదని, అప్పుడక్కడ ఎన్నికలు జరుగుతున్నందున జాగ్రత్తగా వ్యవహరించామని జితేందర్ రెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్ సభ్యుడు కొండా విశే్వశ్వర రెడ్డి మాట్లాడుతూ తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని రోహిత్ తన లేఖలో రాయటం విస్మరించరాదని సూచించారు. అతని ఉపకార వేతనాన్ని నిలిపివేయటంతో పాటు బాయ్‌కాట్ చేశారని విమర్శించారు.