జాతీయ వార్తలు

ఇక అందరికీ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం బలమైన ముందడుగు వేసింది. అందరికీ ఇళ్లు అనే ప్రతిష్టాత్మక పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల 95లక్షల ఇళ్లను నిర్మించాలని సంకల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం (గ్రామీణ)కింద మొదటి మూడేళ్లలో కోటి ఇళ్లను నిర్మించడానికి 81,875 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో భాగంగా మైదాన ప్రాంతాల్లో నివశించే వారికి కోటి ఇరవై లక్షలు, కొండ ప్రాంతాల్లో ఉండే వారికి కోటి 30లక్షల చొప్పున కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆవాసం కల్పించే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైనదని, మొత్తం నిర్మించే ఇళ్ల సంఖ్యకు, అంచనాలకు మధ్య పది శాతం మేర వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఢిల్లీ, చండీగఢ్ మినహా దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ పథకం కింద ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన వ్యయాన్ని మైదాన ప్రాంతాలకు సంబంధించి 60:40, ఈశాన్య, కొండ ప్రాంతాల విషయంలో 90:10 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్రాలు పంచుకుంటాయని తెలిపారు.2016-17, 2018-19 సంవత్సరాల మధ్య కోటి ఇళ్లను నిర్మించడానికి అయ్యే 81,975 కోట్ల రూపాయల ఖర్చులో 68వేల కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయింపుల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. మిగిలిన 21,975 కోట్ల రూపాయల మొత్తాన్ని నాబార్డ్ నుంచి సేకరిస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. నేటి కేబినెట్ సమావేశంలో ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణ అంశానికి మాత్రమే ఆమోదం తెలిపిందన్నారు. ఈ కేంద్ర పథకంలో భాగంగా రానున్న ఏడేళ్ల కాలంలో 20మిలియన్ ఇళ్లను నిర్మించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అంటే 2022 నాటికల్లా మురికివాడల ప్రజలకు పునరావాసం, పట్టణ పేదలకు అధిక భారం లేకుండా ఇళ్లను అందించాలన్నది ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. పూర్తి స్థాయి పారదర్శకతతో ఈ పథకం అమలు కాగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపిక మొదలుకుని..ప్రాధాన్యతా పూర్వకంగా వారికి ఆర్థిక సహాయాన్ని అందించే వరకూ ఏ దశలోనూ అవకతవకలకు ఆస్కారం లేని విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

చిత్రం... కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం బయటకు వస్తున్న కేంద్ర మంత్రులు కల్‌రాజ్ మిశ్రా, రాధామోహన్ సింగ్, హర్షవర్ధన్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు