జాతీయ వార్తలు

మావోల మెరుపుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం/ చింతూరు, మార్చి 30: చత్తీస్‌గఢ్‌లో బుధవారం మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మందుపాతరలతో మారణహోమం సృష్టించారు. దంతెవాడలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని శక్తివంతమైన మందుపాతరతో పేల్చివేసిన ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో బీజాపూర్ జిల్లాలోప్రెషర్‌బాంబు పేల్చి ఇద్దరు జవాన్లను తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ వారిని హెలికాప్టర్‌లో రాజధాని రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. గత కొంతకాలం లొంగుబాట్లు, అరెస్ట్‌లు, ఎన్‌కౌంటర్లతో తీవ్రంగా నష్టపోయిన మావోలు ఒక్కసారిగా విరుచుకుపడి చత్తీస్‌గఢ్‌లో కలకలం రేపారు. సంఘటనా స్థలానికి బస్తర్ ఐజీ ఎస్‌ఆర్‌పీ కల్లూరి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దంతెవాడ జిల్లా నకుల్‌నార్‌లోని 230 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ప్రతివారం వారపు సంతకు వాహనంలో బయలుదేరి వెళ్తారు. రెక్కీ నిర్వహించిన మావోయిస్టులు బుధవారం సంతకు బయలుదేరుతున్న సమాచారాన్ని తెలుసుకున్నారు. స్వరాజ్ మజ్దా వాహనంలో ఏఎస్‌ఐ డి.విజయ్‌రాజ్, హెడ్‌కానిస్టేబుల్ ప్రదీప్‌టర్కే, జవాన్లు నానా ఉదయ్‌వీర్, రంజన్‌దాస్, జెల్లా రాజేందర్, కేద్రాసు, ఆర్‌ఎన్ దాస్‌లు వాహనంలో బయలుదేరారు. మోక్‌పాల్- మైలవాడ గ్రామాల మధ్య కల్వర్టు కింద మందుపాతర పెట్టి మావోయిస్టులు కాపుకాశారు. వాహనం కల్వర్టు సమీపానికి రాగానే మందుపాతరను పేల్చేయడంతో వాహనం తునాతునకలైంది. అందులో ప్రయాణిస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ల శరీరాలు ఛిద్రమైపోయి సంఘటన ప్రదేశం నుంచి దూరంగా పడ్డాయి. మందుపాతర పేల్చిన ప్రదేశంలో పెద్దగొయ్యి ఏర్పడింది. వాహనం ముక్కలు సుమారు అర కిలోమీటర్ వరకు వెళ్లి పడ్డాయి. జవాన్ల మాంసం ముద్దలతో ఘటన ప్రదేశం హృదయవిదారకరంగా మారింది. విషయం తెలుసుకున్న వెంటనే బస్తర్ ఐజీ ఎస్‌ఆర్‌పీ కల్లూరి మైలవాడకు బయలుదేరి వెళ్లారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ మైలవాడ ఘటనలో ఏడుగురు జవాన్లు మరణించినట్లుగా ప్రకటించారు.
ప్రెషర్‌బాంబు పేలి...
బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజుపేట-సార్కెగూడె మధ్య బుధవారం ఉదయం ప్రెషర్‌బాంబు పేలి 168 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ నీరజ్‌కుమార్, జవాన్ మనీష్ తీవ్రంగా గాయపడ్డారు. సార్కెగూడెకు 2 కి.మీల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 10.40 గంటల సమయంలో వీరు నడుచుకుంటూ వెళ్తూ బాంబుపై కాలు వేశారు. వెంటనే అది పేలడంతో వీరి కళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే హెలీకాప్టర్ ద్వారా రాజధాని రాయ్‌పూర్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వీరిలో అసిస్టెంట్ కమాండెంట్ నీరజ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు.

చిత్రం... పేలుడు ధాటికి తునాతునకలైన వాహనం. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు

మందుపాతర తీవ్రతకు ఏర్పడిన పెద్ద గొయ్యి