జాతీయ వార్తలు

కట్టుకథలు కట్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: భారత్ ప్రతిష్టను దెబ్బతీయడానికి పాకిస్తాన్ కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తోందని కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. భారత్‌కు చెందిన కులభూషణ్ జాదవ్ గూఢచర్యానికి పాల్పడుతూ ఉగ్రవాదులతో సంబంధాలు నెరపుతున్నట్టు పాక్ చేస్తున్న ఆరోపణలను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కట్టుకథలు వండుతూ, నకిలీ వీడియోలతో బరితెగించి ప్రవర్తిస్తున్నారని మంత్రి విరుచుకుపడ్డారు. నావీ మాజీ అధికారిపై లేనిపోని అభియోగాలు చేస్తూ బలూచిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలతో లింకులున్నాయని కథనాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పాక్ ఆరోపణలన్నీ అభూతకల్పనలేనని హోమ్ మంత్రిత్వశాఖ వెల్లడించిన విషయాన్ని ఆయన బుధవారం ఇక్కడ మీడియా ప్రతినిధులకు చెప్పారు. మార్ఫింగ్ వీడియోలు, వండివార్చిన కథనాల అంతర్జాతీయంగా భారత్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోవని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని తాము అసలు పట్టించుకోమన్న రిజిజు ‘ఇదంతా పాకిస్తాన్ పిఎంవో, అధికారులు ఆడుతున్న నాటకాలు’ అని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ విడుదల చేసిన వీడియోను చూశాం. ఇలాంటి కట్టుకథలు కట్టిపెట్టాలని ఆయన హెచ్చరించారు.

బాకీలు తీరిస్తేనే పోటీకి అర్హత
ఎన్నికల కమిషన్ మెలిక

న్యూఢిల్లీ, మార్చి 30: ఇకనుంచి ఎన్నికలలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని బిల్లులను ముందే చెల్లించి ఉండాల్సి ఉంటుంది. గత పదేళ్లలో ప్రభుత్వం నుంచి వసతి సౌకర్యం పొంది ఉంటే దానికి సంబంధించి ఎలాంటి బిల్లుల బకాయిలు లేవని అభ్యర్థులు అఫిడవిట్ దాఖలు చేయవలసి ఉంటుంది. దీంతో పాటు అభ్యర్థులు తాము వినియోగించిన విద్యుత్‌కు, నీటికి, టెలిఫోన్ సౌకర్యానికి సంబంధించిన ఎలాంటి బిల్లుల బకాయిలు లేవని పేర్కొంటూ సదరు సంస్థల నుంచి ‘నో డ్యూస్’ సర్ట్ఫికెట్లను పొంది ఎన్నికల కమిషన్‌కు సమర్పించవలసి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు గత నెలలో అమలులోకి వచ్చాయని ఎన్నికల సంఘం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో పోటీ చేసే అభ్యర్థులు కొత్త అఫిడవిట్‌తో పాటు ఈ ‘నో డ్యూస్’ సర్ట్ఫికెట్లను సమర్పించవలసి ఉంటుంది. అసెంబ్లీలకు, పార్లమెంటుకు పోటీ చేయబోయే అభ్యర్థులు ఎలాంటి బకాయిలు ఉండకూడదని, బకాయిలు లేవని పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఈ కొత్త నిబంధనలను చేర్చింది. ఇటీవల ఎన్నికల సంస్కరణలకు సంబంధించి చర్చించడానికి ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ ‘నో డ్యూస్ సర్ట్ఫికెట్ల’ నిబంధన వల్ల సదరు సంస్థల అధికారులు ఈ సర్ట్ఫికెట్లను ఇవ్వడానికి లంచాలు అడుగుతారని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు తన తీర్పులో అభ్యర్థులు తాము ఎలాంటి బిల్లుల బకాయిలు లేమని పేర్కొంటూ సమర్పించే అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

పదవులు చెరిసగం
జమ్మూకాశ్మీర్ బిజెపి
విభాగం డిమాండ్

జమ్మూ, మార్చి 30: అధికారంలో భాగస్వామ్య పక్షమైన పిడిపితో సమానమైన వాటా తమ పార్టీకి కూడా దక్కాలని, ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానవర్గానికి కూడా తెలియజేశామని జమ్మూ, కాశ్మీర్ బిజెపి విభాగం బుధవారం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి పదవికి ఎంపికయిన మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే పదవుల పంపిణీకి సంబంధించి బిజెపి గట్టిగా పట్టుబట్టనుందనే సంకేతాలు ఈ ప్రకటనతో స్పష్టమైనాయి. ‘మా పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పిడిపి ఎమ్మెల్యేల సంఖ్య రెండూ ఒకటే అయినందున ప్రభుత్వంలో కూడా మా సంఖ్య సమానంగా ఉండాలనుకోవడంలో ఎలాంటి తప్పూ లేదనే భావన పార్టీలోని అందరిలో ఉంది. అధికార పంపిణీలో మాకు న్యాయమైన, సమానమైన వాటా లభించాలి’ అని బిజెపి రాష్ట్ర విభాగం ముఖ్య అధికార ప్రతినిధి సునీల్ సేథీ విలేఖరులతో అన్నారు.
గత శనివారం పిడిపి-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి ఎంపికయిన మెహబూబా ప్రమాణ స్వీకారం తేదీని ఇంకా నిర్ణయించని విషయం తెలిసిందే.
87 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలలో పిడిపికి 28 మంది ఎమ్మెల్యేలుండగా, బిజెపికి 25 మంది ఉన్నారు. ముఫ్తీ మహమ్మద్ సరుూద్ ముఖ్యమంత్రిగా, బిజెపికి చెందిన నిర్మల్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా పిడిపి-బిజెపి కూటమి గత ఏడాది మార్చి 1న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు మంత్రివర్గంలో పిడిపికి చెందిన వారు 14 మంది ఉండగా, బిజెపికి పది మంది మంత్రులున్నారు.
మంత్రుల శాఖల విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య కుమ్ములాట కారణంగానే ప్రమాణ స్వీకారం ఆలస్యం అవుతోందా? అని అడగ్గా, ‘్ఫలానా శాఖ కావాలంటూ ఏమీ లేదు. సమానమైన అధికార పంపిణీ జరగాలని మాత్రమే మేము కోరుతున్నాం. అసెంబ్లీలో కాశ్మీర్ లోయతో సమానంగా జమ్మూ ప్రాంత ఎమ్మెల్యేలున్నందున జమ్మూకు కూడా మంత్రివర్గంలో సమాన ప్రాతినిధ్యం ఉండాలి’ అని సేథీ చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుపై బిజెపి, పిడిపిలు సీరియస్‌గా లేవన్న మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆరోపణల గురించి అడగ్గా, రెండు పార్టీలు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాయని ఆయన తెలిపారు.

ఆ నివేదికను బయటపెట్టలేం: జెఎన్‌యు

న్యూఢిల్లీ, మార్చి 30: జెఎన్‌యులో గత నెల 9న చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనపై జరిపిన ప్రాధమిక నివేదికను బహిర్గతం చేయడానికి వర్శిటీ నిరాకరించింది. జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను దేశద్రోహం కేసుపై అరెస్టు చేశారు. జెఎన్‌యులో జరిగిన ఈ మొత్తం వ్యవహారంపై ముగ్గురు ప్రొఫెసర్లతో ప్రాధమిక విచారణ జరిపించారు. అయితే ప్రాధమిక విచారణ నివేదికను బహిర్గం చేయాల్సిందిగా ఆర్‌టిఐ కార్యకర్త పరాస్‌నాథ్ సింగ్ చేసిన అభ్యర్థనను వర్శిటీ తిరస్కరించింది. దీనికి ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జి), 8(1)(హెచ్)లను జెఎన్‌యు ఉదాహరించింది. 9న జెఎన్‌యులో జరిగిన వివాదాస్పద కార్యక్రమంపై వర్శిటీ స్థాయి విచారణ నిర్వహించారు. సెక్షన్ 8(1)(హెచ్) కింద విచారణ కొనసాగుతున్నందున బహిర్గం చేయకూడదని, అలాగే 8(1)(జి) సెక్షన్ కింద నివేదికను బయటపడితే సంబంధింత వ్యక్తుల భద్రతకు ముప్పు కాబట్టి వర్శిటీ మినహాయింపు కోరింది.