జాతీయ వార్తలు

బెంగాల్, అసోంలో నేడు తొలి విడత పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి/ కోల్‌కతా, ఏప్రిల్ 3: పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీలకు తొలి విడత పోలింగ్ సోమవారం జరుగనుంది. పశ్చిమబెంగాల్‌లోని 18 నియోజకవర్గాలకు, అస్సాంలోని 65 నియోజకవర్గాలకు తొలి విడతలో పోలింగ్ జరుగుతుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో సుమారు నెల రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. 294 నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఆరు దశలలో, 126 నియోజకవర్గాలున్న అస్సాంలో రెండు దశలలో పోలింగ్ జరుగుతుంది. అయితే బెంగాల్‌లో తొలి దశ పోలింగ్ రెండు తేదీలలో జరుగుతుంది. ఈ నెల 4, 11వ తేదీలలో పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టుల ప్రాబల్యం గల పశ్చిమ మిడ్నాపూర్, పురూలియా, బంకుర జిల్లాల్లోని నియోజకవర్గాలకు సోమవారం జరిగే పోలింగ్‌లో 133 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. 13 నియోజకవర్గాలను వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. అందువల్ల ఈ నియోజకవర్గాలలో భద్రత కారణాల రీత్యా సాయంత్రం నాలుగు గంటలలోపే పోలింగ్‌ను ముగిస్తారు. మిగతా అయిదు నియోజకవర్గాలు- పురూలియా, మన్‌బజార్, కాశీపూర్, పారా, రఘునాథ్‌పూర్‌లలో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అస్సాంలో సోమవారం జరిగే ఎన్నికల్లో మొత్తం 539 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. కరీంగంజ్ జిల్లాలోని బారక్ లోయలో గల భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేయడంతో పాటు అస్సాంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 65 నియోజకవర్గాలలో 40వేల మందికిపైగా భద్రతా బలగాలను మోహరించారు. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బిజెపి-ఎజిపి-బిపిఎఫ్ కూటమి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఎఐయుడిఎఫ్ 27మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, పదవీకాలం ముగుస్తున్న అసెంబ్లీ స్పీకర్ ప్రణబ్ సింగ్ ఘటోవర్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు సోమవారం పోలింగ్ జరిగే వాటిలో ఉన్నాయి.
అసోంలోని తేజ్‌పూర్ నియోజకవర్గంలో ఇవిఎంలు పంపిణీ చేస్తున్న దృశ్యం

మహారాష్ట్ర సిఎంపై
కోర్టు ధిక్కరణ కేసు?
తృప్తి దేశాయ్ యోచన
పుణె, ఏప్రిల్ 3: మహారాష్టల్రోని సుప్రసిద్ధ శనిసింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నందుకు ఈ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేసే యోచనలో ఉన్నామని భూమాతా రణ్‌రాగిణి బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ పేర్కొన్నారు. ‘దేవాలయాల ప్రవేశం మహిళల ప్రాథమిక హక్కు’ అని పేర్కొన్న హైకోర్టు ఆదేశాల మేరకే తాము ఆలయానికి వెళ్లామని, అయితే స్థానిక అధికారులు తమని అడ్డుకున్నారని, కొందరు స్థానికులు తమపై చేయి చేసుకున్నారని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటనలపై కోర్టు ‘సుమోటా’గా కేసు నమోదు చేయవచ్చని, అలా జరగకుంటే తామే కేసు ఫైల్ చేస్తామని ఆమె వివరించారు. త్వరలో నాసికాత్రయంబకేశ్వర్ ఆలయంలోకి కూడా అడుగుపెడతామని తృప్తి తెలిపారు. తృప్తి దేశాయ్ ఆధ్వర్యంలో 25 మంది మహిళలు శనివారంనాడు శనిసింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తృప్తి దేశాయ్ శనిసింగపూర్‌లోని గర్భాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని, అందుకే అక్కడి అధికారులు అడ్డుకున్నారని మహారాష్ట్ర బిజెపి శాఖ తెలిపింది. ఇదంతా ఒక రాజకీయ డ్రామా అని, కేవలం పత్రికల్లో వార్తల కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించింది.

ఆసుపత్రి పాలైన రాహుల్‌సింగ్

రెండోరోజు విచారణలో ఛాతీనొప్పి ప్రత్యూష ఇంటిని సోదా చేసిన పోలీసులు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

ముంబై, ఏప్రిల్ 3: ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి ప్రత్యూష బెనర్జీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్‌కు ఛాతీనొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ఆదివారం ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా రాహుల్‌ను ప్రశ్నిస్తున్న సమయంలో అతనికి ఛాతీనొప్పి, ఊపిరాడక ఇబ్బంది పడుతుండటంతో కండివాలీలోని శ్రీసాయి ఆసుపత్రిలో చేర్పించారు. రాహుల్‌కు ఐసియులో చికిత్స జరుగుతోందని చెప్పిన అతని సన్నిహితుడు అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. మరోపక్క ప్రత్యూష ఇంట్లో ఆదివారం పోలీసులు సోదా జరిపారు. ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా వెల్లడి కాకపోగా, ఆమె ఇంతటి తీవ్ర నిర్ణయానికి ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా పోలీసులకు అంతుబట్టడం లేదు. కానీ, రాహుల్, ప్రత్యూష మధ్య కొంతకాలంగా విభేదాలు పొడసూపిన నేపథ్యంలో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్స్ అందరినీ విచారించేందుకు సమాయత్తమవుతున్నారు.
సాక్ష్యాధారాలకోసం గోరేగావ్‌లోని ప్రత్యూష ఇంటిని ఆదివారం సోదా చేసిన పోలీసులకు రెండు సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. రాహుల్, ప్రత్యూషకు చెందిన ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లను పరిశీలించాల్సి వుందని, వీరిద్దరి స్నేహితులను కూడా విచారిస్తే కొన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రత్యూష ఆత్మహత్యకు ఆర్థికపరమైన కారణాలు కావని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆమె ఆత్మహత్యకు రాహుల్ కారణమనేందుకు ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రత్యూష తల్లిదండ్రులు కూడా తమ ఫిర్యాదులో నేరుగా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. వారిద్దరి మధ్య విభేదాలు పొడసూపాయని, పలు సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ప్రత్యూష శరీరంలోని అంతర్భాగాలను పరీక్షల నిమిత్తం పంపించారు. ఆ నివేదిక వచ్చిన ఆమె ఎలా మరణించిందనే విషయం వెలుగుచూస్తుందని పోలీసులు భావిస్తున్నారు.