జాతీయ వార్తలు

విద్యాసంస్థలకు ర్యాంకుల తీరుపై విమర్శల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల దేశంలోని విద్యాసంస్థలకు ఇచ్చిన ర్యాంకుల తీరును పలువురు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ఈ ర్యాంకుల జాబితా తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. అయితే యూనివర్శిటీలు సమర్పించిన డాటా ఆధారంగానే ర్యాంకులు కేటాయించినట్టు హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. ర్యాంకుల జాబితాలో ఐఐఎం కోజికోడ్, ఐఐఎం ఇండోర్‌లకన్నా పైన ఐఐఎం ఉదయ్‌పూర్ ఉండటం, జామియా మిలియా ఇస్లామియా (జెఎంఐ) 83వ ర్యాంకులో ఉండగా, జామియా హమ్‌దార్ద్ యూనివర్శిటీ 18వ ర్యాంకు పొందటం ఆశ్చర్యం కలిగిస్తోందని విమర్శకులు పేర్కొన్నారు. ‘అందరూ ఢిల్లీలోని ప్రసిద్ధి పొందిన విశ్వవిద్యాలయాలలో ఢిల్లీ యూనివర్శిటి (డియు), జెఎన్‌యు తరువాత మా వర్శిటీని పరిగణిస్తుండగా, మాకు 83వ ర్యాంకును కేటాయించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మా విశ్వవిద్యాలయంలో పరిమిత సీట్లుండగా, రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. వారు ఏ రకంగా మదింపు వేశారు?’ అని జెఎంఐ ప్రొఫెసర్ ఒకరు ప్రశ్నించారు. ర్యాంకుల కేటాయింపునకు పరిగణించిన ప్రాతిపదిక విడ్డూరంగా ఉందని, హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ తదుపరి ర్యాంకుల సమయంలో ఈ ప్రాతిపదికను సమీక్షించాలని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ఎస్.కె.సోపోరి అన్నారు. ప్రొఫార్మాలోని విజిటింగ్ స్కాలర్ల వివరాలలో ఒక కాలమ్‌లో పాన్ నెంబర్ అడిగారని, దానిని తాము ఖాళీగా వదలివేయాల్సి వచ్చిందని ఒక వార్తాసంస్థకు చెప్పారు.

కేంద్ర ఉద్యోగులకు
6శాతం డిఎ పెంపు
* జనవరి 1 నుంచి అమలు
* ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు మరోసారి కరవు భత్యాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి 1నుంచి అమలయ్యేలా 6శాతం కరవుభత్యం పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం మూలవేతనంపై 119 శాతం వస్తున్న డీ ఏ ఇకపై 125శాతానికి పెరగనుంది. పింఛనుదారుల కరవుభత్యం(డీ ఆర్)కు కూడా ఇది వర్తిస్తుంది. మార్చి 23న కేంద్ర మంత్రిమండలి నిర్ణయించిన మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఇందుకు సంబంధించిన మెమొరాండంను విడుదల చేసింది. ఈ పెంపు వల్ల కేంద్రంపై ఏటా డీ ఏ పై రూ.6796 కోట్లు, డీ ఆర్‌పై రూ.7929 కోట్లు భారం పడుతుంది. దీని వల్ల దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో
కోర్టుకు బ్యాలెన్స్‌షీట్
సమర్పించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఇండియన్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ 2010-11 బ్యాలెన్స్ షీట్‌ను శుక్రవారం సమర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌తో పాటు మరో అయిదుగురిపై అక్రమ ఆర్థిక లబ్ధి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో పాటు అసోసియేటెడ్ జర్నల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా తన బ్యాలెన్స్ షీట్‌ను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లలీన్‌కు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. అయితే తమ లాయర్ వాదనలు వినకుండా డాక్యుమెంట్లను తెరవరాదని కాంగ్రెస్, అసోసియేటెడ్ జర్నల్ రెండూ కూడా మెజిస్ట్రేట్‌కు విజ్ఞప్తి చేశాయి. కాంగ్రెస్ పార్టీ, అసోసియేటెడ్ జర్నల్స్‌కు ఇచ్చిన రూ.90.25కోట్ల రుణాలను నుంచి వసూలు చేసుకునే అధికారాన్ని కేవలం రూ.50 లక్షలకే సోనియా, రాహుల్ ప్రధాన వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించటంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సవాలు చేసిన సంగతి తెలిసిందే.
వృద్ధుల సమస్యలపై
సుప్రీం ముందడుగు
పరిష్కారానికి హెల్పేజి ఇండియా, నల్సాల సాయం కోరిన ధర్మాసనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: సీనియర్ సిటిజన్‌లు, వృద్ధుల హక్కుల పరిరక్షణ, న్యాయ సేవలకు సంబంధించిన అంశాలు, అంగీకారయోగ్యమైన పరిష్కారాలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్న జాతీయ న్యాయసేవా అథారిటీ (నల్సా), హెల్పేజి ఇండియాలు ఈ విషయంలో సహకరించాలని కోరింది. కేంద్ర సామాజిక న్యాయ శాఖకు దీనిపై నోటీసు కూడా జారీ చేసింది. ఈ విషయంలో వృద్ధులు, సీనియర్ సిటిజన్ల హక్కుల పరిరక్షణ, వారికోసం అమలు చేస్తున్న పథకాలు.. అందుకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్ నేత అశ్విన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ, ప్రస్తుతం ఉన్న చట్టాలు, విధానాల సరైన అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేయాలంటూ ధర్మాసనం నల్సాను కోరింది. దేశంలో చాలా మంది వృద్ధులు నిలువనీడలేని స్థితిలో దయనీయంగా బతుకుతున్నారని వారికి సరైన ఆహారం, బట్టలు కూడా దొరకటం లేదని.. వారి కోసం బడ్జెట్ కేటాయింపులు కూడా సరిగా లేవని కేంద్ర మాజీ న్యాయమంత్రి కూడా అయిన అశ్విన్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వీరి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ఉన్నప్పటికీ.. అవి అమలుకు నోచుకోవటం లేదని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు.
25నుంచి పార్లమెంటు
సమావేశాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ప్రోరోగ్ అయిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు తిరిగి ఏప్రిల్ 25న ప్రారంభమవుతాయని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సమావేశాలు మే 13 వరకు కొనసాగుతాయని తెలిపింది. రాజ్యసభ సమావేశాలు కూడా ఏప్రిల్ 25న ప్రారంభమవుతాయని వెల్లడించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అనూహ్య పరిణామాల మధ్య ప్రోరోగ్ అయిన విషయం విదితమే.

శాంతికి పాక్ వెన్నుపోటు

కాంగ్రెస్ విసుర్లు
మోదీ వైఖరిపై ధ్వజం
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: పాకిస్తాన్ ప్రభుత్వం భారత దేశంతో చర్చలను ఏకపక్షంగా నిలిపివేయడం ద్వారా శాంతి చర్చల ప్రక్రియకు వెన్నుపోటు పొడిచిందని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పాక్‌పై విమర్శలు గుప్పించడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వ్యూహం వల్లే ఏకాకిగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు పుంజుకోగలిగిందని సుర్జేవాల అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు నిర్మాణాత్మక చర్చలే పునాది అని, అయితే ఇప్పుడు ఆ పునాదులే కదులుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి వల్లే భారత్‌లో శాంతి చర్చలు నిలిపివేయాలన్న ఆకస్మిక నిర్ణయానికి పాక్ వచ్చిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. పాకిస్తాన్ విషయంలో మోదీ ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని సుర్జేవాలా ఆరోపించారు. ప్రధాని మోదీ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవటంపై దృష్టి కేంద్రీకరించడవల్లే ఈ పరిస్థితిని దాపురించిందని ఆయన విమర్శించారు. యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు దౌత్య, తదితర చర్యల ద్వారా పాకిస్తాన్‌ను ఏకాకిగా చేయటంలో విజయం సాధించినట్టు ఆయన చెప్పారు. పాకిస్తాన్ విషయంలో నరేంద్ర మోదీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలు దౌత్య సిబ్బందితో పాటు భద్రతా సిబ్బంది కూడా గందరగోళంలో పడిపోయారని సుర్జేవాలా అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ పాకిస్తాన్ వ్యూహం మొదటి నుంచీ గందరగోళంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రధాని అకస్మాత్తుగా లాహోర్ పర్యటన జరిపిన తరువాత పాకిస్తాన్ వైపు నుంచి దాడులు పెరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది.
కాల్పుల విరమణ ఉల్లంఘన నుంచి పఠాన్‌కోట్‌పై ఉగ్రవాదుల దాడితో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సుర్జేవాల ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంత జరిగిన తరువాత కూడా పాక్ దర్యాప్తు బృందాన్ని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో పర్యటనకు అనుమతించడం ఘోరమైన తప్పిదంగా కాంగ్రెస్ తెలిపింది. యుపిఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ విషయంలో చాలా గట్టిగా వ్యవహరించారని సుర్జేవాలా వివరించారు. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పాక్ విషయంలో ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు.

అమిత్ షా కొత్త టీం

కర్ణాటకకు మళ్లీ యెడ్యూరప్ప ఉత్తరప్రదేశ్‌కు కేపీ వౌర్య
పంజాబ్‌కు కేంద్రమంత్రి సాంప్లా క్రికెటర్ సిద్దూకు మొండిచెయ్యి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రాలకు కొత్త టీంలను ఏర్పాటు చేశారు. అవినీతి ఆరోపణలతో పక్కకు తప్పుకోవలసి వచ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ ఎస్ యెడ్యూరప్ప మళ్లీ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షపదవిని చేపట్టనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ శుక్రవారం రాష్ట్రాల్లో కొత్త టీంల వివరాలను వెల్లడించారు.
అక్రమమైనింగ్ ఆరోపణలపై సీ ఎం సీటును వదులుకున్న యెడ్యూరప్ప, అవినీతి నిరోధక కేసులో ఆయన్ను ప్రాసిక్యూట్ చేయటంపై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించటానికి సుప్రీం కోర్టు నిరాకరించటంతో ఆయన పునర్వైభవానికి మార్గం సుగమమైంది. యెడ్యూరప్ప ప్రస్తుతం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అధ్యక్షుడిగా ఫూల్‌పూర్ ఎంపీ కేశవ్ ప్రసాద్ వౌర్యను నియమించారు. ఈయన తొలిసారి ఎంపీగా ఎన్నికైన పార్టీ నేత. చిన్నతనంలో ఆయన వార్తా పత్రికలు వేయటం, చాయ్ అమ్మటం ద్వారా శ్రమకోడ్చి ఎదిగిన రాజకీయ నేత. ఇక పంజాబ్ బీజేపీ అధ్యక్ష పదవికి కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి విజయ్ సాంప్లాను నియమించారు. పంజాబ్‌లో క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్దూ ఈ పదవిని ఆశించినప్పటికీ, పలితం దక్కలేదు. ఈ రెండు రాష్ట్రాలకు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం గమనార్హం. ఈ ముగ్గురు కూడా పార్లమెంట్ సభ్యులే. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో పార్టీ శాఖ అధ్యక్ష పదవికి మాజీ ఎంపీ తపిర్ గావ్‌ను నియమించారు.

పనామా జాబితాలో ఉన్నవారి..

అక్రమాస్తులను జప్తు చేయండి

మోదీ సర్కారుకు సిపిఎం డిమాండ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భారతీయులు షెల్ కంపనీల వాటాలను సేకరించకుండా సంపూర్ణ నిషేధం విధించాలని సిపిఎం డిమాండ్ చేసింది. పనామా పేపర్స్ కేసులో ఎన్‌డిఎ ప్రభుత్వ ప్రతిపాదిత చర్యలను చూస్తుంటే అది పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుందని, పన్నులు తక్కువున్న దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి, నల్లధనాన్ని సృష్టించడానికి సంబంధించిన వ్యవస్థను కనీసం తాకడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని సిపిఎం ఆరోపించింది. మోదీ ప్రభుత్వానికి నల్లధనం, పన్నుల ఎగవేత, మనీలాండరింగ్‌ను అణచివేయాలనే చిత్తశుద్ధి ఉంటే, పనామా పేపర్స్ ద్వారా వెలుగుచూసిన వారి నల్లధనాన్ని, అక్రమాస్తులను జప్తు చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ఆ పార్టీ అధికార పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’ రానున్న సంచికలో రాసిన సంపాదకీయంలో డిమాండ్ చేశారు. అయితే ఇలాంటి చర్య తీసుకునే ధైర్యం ఎన్‌డిఎ ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు.
విస్తృతంగా వ్యాపించిన పన్నుల స్వర్గ్ధామం, షెల్ కంపనీల వ్యవస్థతో అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడికి సంబంధించిన మొత్తం వ్యవస్థ కలగలిసి పోయిందని, అందువల్ల చర్య తీసుకునే ధైర్యం మోదీ ప్రభుత్వానికి లేదని కారత్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక పెట్టుబడులకు ‘మారిషస్ మార్గాన్ని’ తెరిచిందే గత ఎన్‌డిఎ ప్రభుత్వమని ఆరోపిస్తూ, అదే మనీలాండరింగ్‌కు ప్రధాన మార్గంగా పరిణమించిందని కారత్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ పాలన తీరు, గత చరిత్రను పరిశీలిస్తే నల్లధనంపై ఉక్కుపాదం మోపుతారన్న విశ్వాసం కలగడం లేదని పేర్కొన్నారు.

‘పనామా’పై ఎందుకీ వౌనం?

మోదీపై రాహుల్ విమర్శ

కమ్లాపూర్, ఏప్రిల్ 8: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా వ్యవహారంలో ప్రధాని మోదీ ఎందుకు వౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ప్రశ్నించారు. పనామాలో పెద్ద ఎత్తున నల్లధనం దాచిన వాళ్లలో భారతీయుల జాబితా బయట పడినప్పటికీ మోదీ ఈ వ్యవహారంపై ఎందుకు పెదవి విప్పటం లేదని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామంటూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేసే మోదీ.. పనామా వ్యవహారంలో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ కుమారుడి పేరు బయటకు వచ్చినా విచారణకు ఎందుకు ఆదేశించలేదని రాహుల్ ప్రశ్నించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్‌మోదీ దేశం విడిచి పారిపోవటంపై తాను పార్లమెంట్‌లో మోదీని నిలదీసినప్పటికీ ఆయన ఒక్క మాట కూడా జవాబివ్వలేదని రాహుల్ అన్నారు. బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగవేసిన కింగ్‌ఫిషర్ యజమాని విజయ్‌మాల్యా దేశం విడిచి పారిపోయే ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారని రాహుల్ విమర్శించారు. బ్లాక్‌మనీ ఉన్నవారి గురించి మోదీ సర్కారు ఏమీ మాట్లాడటం లేదని.. పైగా వారికి మేలు చేసేందుకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొత్తగా ‘ఫెయిర్ అండ్ లలీ’ స్కీంను ప్రవేశపెట్టారన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి ఒక్క భారతీయుడి ఖాతాలో రూ.15లక్షలు జమచేస్తానని తప్పుడు వాగ్దానాలతో లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మోదీ.. ఏ ఒక్కరి ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని రాహుల్ ఆరోపించారు.

అసోంలోని నల్బరీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ