జాతీయ వార్తలు

రెండు నెలలు వేచి చూద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించిన తరువాత తెరాసలోకి ఫిరాయించి మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా మరికొంతమందిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవటానికి రెండునెలలు నిరీక్షించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ వ్యవధిలో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై తదుపరి చర్య తీసుకుంటామని సుప్రీం ప్రకటించింది. పార్టీ ఫిరాయింపుదారులపై చర్య తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలుగుదేళం నేత ఎర్రబెల్లి దయాకర రావు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఖలీఫుల్లాతో కూడిన బెంచి ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్నది. పిటిషనర్ పక్షాన కెకె వేణుగోపాల్ వాదించగా, తెరాస తరఫున హరీష్ సాల్వే వాదించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తలసాని పార్టీకి రాజీనామా చేయకుండా తెరాసలో చేరిపోయారని ఎర్రబెల్లి తన పిటిషన్‌లో ఆరోపించారు. ఫిరాయింపుదారులపై చర్య తీసుకోవాల్సిందిగా హైకోర్టు గత ఏడాది స్పీకర్‌ను ఆదేశించినా ఇప్పటివరకూ స్పీకర్ ఎలాంటి చర్యా తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని వేణుగోపాల్ బెంచి దృష్టికి తీసుకొచ్చారు. స్పీకర్ పాలక పక్షానికి చెందిన వారు కావటంతో ఫిరాయింపుదారులపై చర్య తీసుకోవటానికి జంకుతున్నారని న్యాయవాది చెప్పారు. విదేశాల్లో సభాధిపతిగా ఎన్నికైన వారు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే సంప్రదాయం మన దేశంలో లేనందున, స్పీకర్లు కఠినంగా వ్యవహరించలేక పోతున్నారని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఫిరాయింపుదారులపై చర్య తీసుకోకుండా ఏడాదిపాటు స్పీకర్ తాత్సారం చేయటం మంచిదికాదని న్యాయవాది వాదించారు. ఫిరాయింపుదారులపై చర్య తీసుకునే అధికారం న్యాయస్థానానికి లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని సమీక్షించే అధికారం తమకుందని స్పష్టం చేశారు. ఇప్పటికే చర్య తీసుకునే విసయంలో జాప్యం జరిగిన దృష్ట్యా న్యాయం చేయాలని పిటిషనర్లు కోరారు. చట్టసభల వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోవటం సాధ్యపడదని పునరుద్ఘాటిస్తూ, రెండు నెలల్లో స్పీకర్ ఎలాంటి చర్య తీసుకుంటారో చూసిన తరువాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి ప్రకటించారు.