జాతీయ వార్తలు

‘అగస్టా’ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఏప్రిల్ 30: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణంపై అధికార బిజెపి కాంగ్రెస్ పార్టీపై దాడిని మరింత తీవ్రం చేసింది. యుపిఏ హయాంలో ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని, అయితే ఎన్డీఏ దాన్ని ఎత్తివేసిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన ‘ఊహాజనితమైన కట్టుకథ’ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. హెలికాప్టర్ల ఒప్పందం వ్యవహారంలో ముడుపుల అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌లాండ్ ఫిన్‌మెకానికా కంపెనీని యుపిఏ ప్రభుత్వం బ్లాక్‌స్ట్‌లో పెట్టిందని, అయితే ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసిందని మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ చేసిన ప్రకటనలో ఏమాత్రం నిజంలేదని గతంలో రక్షణ మంత్రిగా కూడా ఉండిన జైట్లీ చెప్పారు. వచ్చే నెల 16న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలకోసం బిజెపి విజన్ డాక్యుమెంట్‌ను శనివారం ఇక్కడ విడుదల చేసిన తర్వాత జైట్లీ విలేఖరులతో మాట్లాడారు. కాంట్రాక్ట్‌ను ఆ కంపెనీకి ఇవ్వాలని అధికారులు తీసుకున్న నిర్ణయం లంచం కారణంగా ప్రభావితమైందని జైట్లీ అంటూ, లంచం ఇచ్చినవారిని శిక్షించడం జరిగిందని, లంచం తీసుకున్నదెవరనే విషయం తెలుసుకోవడం కోసమే తామంతా ప్రయత్నిస్తున్నామని అన్నారు. బహుశా లంచం తీసుకున్న వ్యక్తి ఒప్పందాన్ని ప్రభావితం చేసిన వారిలో ఉండి ఉండవచ్చని, ఎందుకంటే దారినపోయే వారికి లంచాలు ఇవ్వరని, ఒప్పందాన్ని ప్రభావితం చేసినవారికే లంచం ఇస్తారని జైట్లీ అన్నారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వం వద్ద ఏదయినా సాక్ష్యం ఉంటే లంచం ఇచ్చినవారు, తీసుకున్నవారు ఇద్దరిపైనా కఠిన చర్యలు తీసుకోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ప్రభుత్వాన్ని సవాలు చేశారు. ఈ ఒప్పందంలో లంచాలు ఇచ్చినందుకు అగస్టా వెస్ట్‌లాండ్ అధికారులను దోషులుగా ప్రకటించిన ఇటలీ కోర్టులో ఎవరి పేర్లూ వెల్లడి కాలేదని ఆయన స్పష్టం చేస్తూ అక్కడ కోర్టులో ప్రతి దశలోనూ తమ లాయరు ప్రాతినిధ్యం వహించాడని చెప్పారు. సాక్షులందరినీ లాయర్లు క్రాస్ ఎగ్జామ్ చేశారని, ఏ దశలోనూ ఎవరి పేర్లను వారు వెల్లడించలేదని ఆయన అన్నారు. ‘ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రెండూ ప్రస్తుత ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఏదయినా సాక్ష్యం తమవద్ద ఉంటే చర్య తీసుకోవడానికి జాప్యం ఎందుకు?’ అని ఆంటోనీ అన్నారు. అంతేకాదు, ముడుపులు ఇచ్చిన కంపెనీ ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో భాగస్వామి అని కూడా ఆయన అన్నారు. కేరళలో ఎన్నికల ప్రచారంకోసం వచ్చిన ఆంటోనీ తిరువనంతపురంలో విలేఖరులతో మాట్లాడారు.
యుపిఏ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
డెహ్రాడూన్: అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంలో ముడుపులు ఎవరికి అందాయో గత యుపిఏ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ‘125 కోట్ల ముడుపులుగా చెల్లించినట్లు ఇటలీ కోర్టు స్పష్టంగా చెప్పింది. కొంతమంది పేర్లను కూడా అది బైటపెట్టింది. అప్పుడు ఉండిన ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి’ అని శనివారం డెహ్రాడూన్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన పారికర్ విలేఖరులతో అన్నారు.
ఐఏఎఫ్ అధికారిని ప్రశ్నించిన సిబిఐ
న్యూఢిల్లీ: ఈ కుంభకోణానికి సంబంధించి సిబిఐ శనివారం భారత వైమానిక దళం మాజీ డిప్యూటీ చీఫ్ జెఎస్ గుజ్రాల్‌ను ప్రశ్నించింది. శనివారం గుజ్రాల్ ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బృందం ఎదుట హాజరయ్యారు. 2005లో ఈ హెలికాప్టర్ల కొనుగోలుకోసం ముఖ్యమైన స్పెసిఫికేషన్లలో మార్పులు చేయడానికి జరిగిన సమావేశంలో పాల్గొన్న పలువురు సీనియర్ అధికారుల్లో గుజ్రాల్ కూడా ఒకరని తెలుస్తోంది. ఈ కేసులో ప్రశ్నించడానికి సిబిఐ భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్‌పి త్యాగిని సోమవారం పిలిపిస్తోంది. ఈ ఇద్దరినీ సిబిఐ 2013లో సుదీర్ఘంగా ప్రశ్నించింది కానీ, ఈ నెల 7న ఇటలీ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి వీరిని ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడింది.

చిత్రం... తిరువనంతపురంలో శనివారం బిజెపి ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్న
కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజీవ్ ప్రతాప్ రూఢీ

తిరువనంతపురంలో శనివారం
విలేఖరులతో మాట్లాడుతున్న ఎ.కె.ఆంటోనీ