శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 3: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నగదు రహిత లావాదేవీలు నిర్వహించే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అధికారి గ్రామాలకు వెళ్లి యువతకు నగదు రహిత ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించాలన్నారు. మొబైల్ టు మొబైల్ లావాదేవీలపై కూడా అవగాహన కల్పించాలన్నారు. నగదు రహిత ఆర్థిక లావాదేవీల గురించి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబుకార్డులతో పాటు డిఆర్‌డిఎ, మహిళా గ్రూపులకు కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి శాఖాధికారి సంబంధిత శాఖ సిబ్బంది కూడా మొబైల్ టు మొబైల్ లావాదేవీలు నిర్వహించాలన్నారు. గ్రామంలో ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలు లేని వారికి బ్యాంకు ఖాతాలు తెరిపించి రూపే కార్డులు ఇప్పించాలన్నారు. ఈవిషయంలో గ్రామాల్లో అవగాహన కల్పించడానికి కరపత్రాలను కూడా ముద్రించి పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈసమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, సంయుక్తకలెక్టర్-2 ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్ చేయాలి:కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 3: బ్యాంకు రుణాలను రీ షెడ్యూల్ చేయడంతోపాటు వారికి కొత్త వ్యవసాయ రుణాలను అందించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ షెడ్యూల్ గురించి ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల్లో గత రుణాలను రీ షెడ్యూల్ చేసి కొత్త రుణాలను మంజూరు చేయాలన్నారు. ఆర్‌బిఐ నిబంధనలు మేరకు రుణాలు ఇచ్చే విధంగా చూడాలని అధికారులను కోరారు. వర్షాలు కురుస్తుంన్నందున వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయని, సంబంధిత శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

నగదు కోసం పాట్లు
* బ్యాంక్‌లు, ఎటిఎంల వద్ద
బారులుతీరిన జనం
* తోపులాటలు, పోలీసుల రంగప్రవేశం
ఆంధ్రభూమిబ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 3: పాత పెద్ద నోట్లు రద్దుతో ప్రజలు కష్టాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పాత కరెన్సీని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రజల అవసరాలకు సరిపడా నగదు సమకూర్చకపోవడంతో ప్రజలు నానాపాట్లు పడుతూనే ఉన్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు సైతం పనులు మానుకుని నగదు కోసం బ్యాంకులు, ఎటిఎం కేంద్రాల వద్ద పడిగాపులు కాయక తప్పడంలేదు. పెద్దనోట్లు రద్దు చేసి మూడు వారాలు దాటినా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పరిష్కారం చూపకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
బ్యాంకుల వద్ద ఎగబడ్డ జనం
గత కొద్ది రోజులుగా ప్రజలు బ్యాంకుల వద్ద పడుతున్న కష్టాలు ఎట్టకేలకు తీరాయనుకున్నారు. శనివారం జిల్లాకు రూ.160కోట్లు కరెన్సీని ఆర్‌బిఐ అధికారులు విడుదల చేశారు. దీంతో శనివారం ప్రజలు బ్యాంకుల వద్దకు ఎగబడ్డారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల వద్ద బారులు తీరారు. బ్యాంకులకు నగదు వచ్చిందని తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా భారీ సంఖ్యలో బ్యాంకులకు చేరుకోవడంతో బ్యాంకుల వద్ద రద్దీ వాతావరణం నెలకొంది. అయితే నగరంలోని పలు బ్యాంకుల్లో ఉంచిన నగదు 12 గంటలకే అయిపోవడంతో ప్రజలు ఉసూరుమంటూ వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. నెల్లూరు నగరంలో బారకాసు సెంటరులో ఉన్న స్టేట్‌బ్యాంకు వద్ద వందల సంఖ్యలో ప్రజలు చేరుకోవడంతో బ్యాంకు సిబ్బంది అదుపు చేయలేకపోయారు. స్థానిక పోలీసులు బ్యాంకుల వద్దకు చేరుకొని ప్రజలను వరుస క్రమంలో లోపలకు పంపారు. బ్యాంకు నుంచి దాదాపు కలెక్టర్ కార్యాలయం వరకు బారులు తీరడంతో కొంతమేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
నగదు ఉన్నా అందే పరిస్థితి లేదు
బ్యాంకులో నగదు ఉంచినా ప్రజలకు అందడం లేదని పలువురు వాపోతున్నారు. జిల్లా యంత్రాంగం బ్యాంకుల్లో నగదు ఉంచి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఓపక్క చెబుతున్నా బ్యాంకుల్లో నగదు అందే పరిస్థితి కనపించడం లేదు. బ్యాంకు తెరచిన సమయం నుంచి క్యూలైనులో ఉన్న వారు కౌంటర్ వద్దకు వెళ్లేసరికి నగదు అయిపోయిందని చెబుతుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. పొద్దున ఉంచిన నగదు ఏమవుతుందని బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు బ్యాంకు అధికారులే నగదు మార్పిడికి పాల్పడుతున్నారని దాంతో తమకు నగదు అందడం లేదని విమర్శిస్తున్నారు. ఎటిఎం సెంటర్లలో తీసుకుందామంటే నగరంలో ఉన్న అన్ని ఏటిఎంలు పనిచేయడంలేదు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారు వారి బ్యాంకుల్లో నగదు లేదు అని బోర్డు పెడుతుండడంతో ఇతర బ్యాంకులను ఆశ్రయిస్తున్నా అక్కడ కూడా వారికి నగదు అందడం లేదు. వృద్ధులకు తప్పని తిప్పలు
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లు డిసెంబరు నెల నుంచి బ్యాంకుల వద్ద తీసుకోవాలని చెప్పడంతో పింఛనుదారులు చేసేదిలేక బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. అయితే నగదు కోసం ప్రజలు బారులుతీరి ఉండడంతో వారితో సమానంగా క్యూలలో నిలబడి గంటలపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పలువురు వృద్థులు క్యూలలో నిలబడలేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం బ్యాంకుల వద్దకు రెండురోజులుగా వస్తున్నా తమకు నగదు అందడం లేదని పింఛనుదారులు వాపోతున్నారు. జిల్లా అధికారులు చొరవ తీసుకొని పింఛనుదారులకు నగదు అందేలా చూడాలని వారు కోరుతున్నారు.

కార్పొరేషన్‌కు 60 కోట్లు విడుదల
మేయర్ అబ్దుల్ అజీజ్ వెల్లడి
నెల్లూరుసిటీ, డిసెంబర్ 3: నెల్లూరు నగరపాలక సంస్థకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మరో 60 కోట్ల రూపాయలను మంత్రి నారాయణ విడుదల చేసినట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇంత పెద్దఎత్తున ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను విడుదల చేయలేదన్నారు. ఇప్పటికే 40 కోట్ల రూపాయల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను మంత్రి నారాయణ విడుదల చేశారన్నారు. మళ్ళీ మరో 60 కోట్ల రూపాయల విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందులో 50 కోట్ల రూపాయలు ఎస్సీ కాలనీలో, 10కోట్ల రూపాయలను ఎస్టీ కాలనీలో ఖర్చు చేస్తామన్నారు. గతంలో కార్పొరేషన్ పరిస్థితి అత్యంత దీనంగా పీకల్లోతు అప్పుల ఊబిలో ఉండేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఉన్న కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి కార్పొరేషన్‌ను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టామన్నారు. అయితే ప్రతిపక్షాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక మంత్రిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజల సొమ్ము ఒక్కపైసా కూడా వృథా కాకుండా కాపాడుతున్నామని పేర్కొన్నారు. నగరంలో ఉన్న అన్ని పార్కులను కూడా అభివృద్ధి చేసేందుకు చర్యిలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దొడ్డపనేని రాజానాయుడు, పెంచలయ్యనాయుడు, టిడిపి నాయకులు పావళ్ళ ప్రసాద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

‘దివ్యాంగ విద్యార్థులకు త్వరలో మధ్యాహ్న భోజనం’
కోవూరు, డిసెంబర్ 3: హైకోర్టు ఆదేశాల మేరకు వికలాంగుల దినోత్సవాన్ని దివ్యాంగ విద్యార్థుల మధ్యలో జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా వారందరితో మమేకం కావడం చాలా సంతోషకరమని కోవూరు కోర్జు సీనియర్ సివిల్ జడ్జి జి గీత పేర్కొన్నారు. శనివారం కోవూరు గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న దివ్యాంగుల ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించి వారికి మిఠాయిలు, బిస్కెట్లు పంచిపెట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు పాఠశాల ప్రాంగణంలో మధ్యాహ్న భోజన వసతి లేనందున వారు ఇంటికి వెళ్లి భోజనం చేసి తిరిగి రావాల్సి వస్తోందని వారి పరిస్థితిలో భోజనానికి ఇంటివరకు వెళ్లి రావడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన ప్రయత్నాలు చేసి దివ్యాంగ విద్యార్థులకు పాఠశాల ఆవరణలో ఉచిత మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈసమావేశంలో పాల్గొన్న మేజిస్ట్రేట్ రాధారాణి మాట్లాడుతూ గర్భిణులు గర్భందాల్చిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పుట్టిన పాపాయికి ఏ సమయంలో ఇవ్వాల్సిన టీకాలు, మందులు ఆసమయంలో అందిస్తే పిల్లలు వికలాంగులుగా మారే అవకాశాలు తగ్గుతాయని తెలిపారు. మేనరిక వివాహాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. శాస్ర్తియంగా మేనరిక వివాహాలవల్ల పిల్లలు వికలాంగులుగా పుట్టే అవకాశం ఉందని నిరూపణ అయిందని, అటువంటి వివాహాలను ప్రోత్సహించరాదని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో కోవూరు కోర్టు సీనియర్ జడ్జ్ జి గీత, జూనియర్ సివిల్ జడ్జ్ బాలకృష్ణయ్య, మేజిస్ట్రేట్ రాధారాణి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

దొంగల దండు అరెస్టు
రూ. 14 లక్షల సొత్తు స్వాధీనం
నెల్లూరు, డిసెంబర్ 3: తాళం వేసిన ఇళ్లు, కాపలాలేని దేవాలయాల్లోని హుండీలను లక్ష్యంగా చేసుకుని నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠా సభ్యులను కావలి పోలీసులు అరెస్టుచేసి వారి వద్దనుంచి భారీస్థాయిలో బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈకేసుకు సంబంధించిన విరాలను జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని శనివారం స్థానిక ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు కావలికి చెందిన పాత నేరస్తులు సాలేటి వెంకటేశ్వర్లు ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని నెల్లూరు జిల్లా జలదంకి, కావలి, వింజమూరు, చెన్నరాయునిపాళెం, ముసునూరు, ప్రకాశం జిల్లా కందుకూరు, గుడ్లూరు, పామూరు, టంగుటూరు తదితర ప్రాంతాల్లో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడేవాడు. ఆయాప్రాంతాల్లోని దినపత్రికల డెలివరీ బాయ్స్, స్నేహితుల సహకారంతో తాళాలు వేసిన ఇళ్ల సమాచారం తెలుసుకుని దొంగతనాలకు పాల్పడేవారు. వెంకటేశ్వర్లుతోపాటు ఐదుగురు సభ్యులు గల ఈ ముఠా ఇళ్లతోపాటు జలదంకి మండలం, ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని పలు దేవాలయాల్లో బంగారం, హుండీలను పగులగొట్టి నగదును చోరీ చేశారు. ఈముఠాను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాలతో కావలి డిఎస్పీ రాఘవరావు ఆధ్వర్యంలో కావలి రూరల్ సిఐ పి ఆశోక్‌వర్ధన్, కావలి ఒన్ టౌన్ సిఐ ఎన్ వెంకటరావు, కందుకూరు సిఐ నరసింహారావు, ఎస్సైలు, పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈక్రమంలో కావలి సమీపంలో మద్దూరుపాడు వద్ద జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా తిరుగుతున్న కావలి పట్టణానికి చెందిన కె లక్ష్మణ, యద్దలపూడి సురేంద్ర, ప్రళయకావేరి పోలయ్య, పఠాన్‌కాలేషా, బోగోలు మండలం చెన్నరాయులపాలెంకు చెందిన ఎ శేషయ్యలను ప్రత్యేక బృందంలోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వీరు సాలేటి వెంకటేశ్వర్లుతో కలసి సుమారు 21చోట్ల తాము చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. వారివద్ద నుంచి 12 లక్షల రూపాయల విలువగల బంగారు నగలు, రెండు లక్షల రూపాయలు విలువగల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలు తెలియజేసిన ఎస్పీ విశాల్‌గున్ని ప్రత్యేక బృందంలోని సిఐలతోపాటు ఎస్సైలు గిరిబాబు, పుల్లారావు, సుబ్బారావు, ఎం ఆంజనేయులు, ఎఎసై గౌస్‌బాషా, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులరెడ్డి, కానిస్టేబుళ్లు మాధవ్, శ్రీనివాసులరెడ్డి, మస్తానయ్య, అయోథ్యకుమార్, హరి, రాజేష్, ఫెర్నాండేజ్, మీరాబాషా, హోంగార్డులు కోటేశ్వరరావు, మాల్యాద్రి, అనిల్, వెంకటరావు, ఏఆర్‌పిసి టి చైతన్యలను ప్రత్యేకంగా అభినందించారు.

నేటి నుంచి అవినీతి వ్యతిరేక వారోత్సవాలు
నెల్లూరు, డిసెంబర్ 3: అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నుంచి అవినీతి నిరోధకశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వారంరోజుల పాటు అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏసిబి డిఎస్పీ తోట ప్రభాకర్ తెలిపారు. శనివారం నగరంలోని తమ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు అందులోనూ ముఖ్యంగా విద్యార్థులు, యువత అవినీతి వ్యతిరేక దిశగా పయనించేందుకు వారిని ప్రోత్సహించే కార్యక్రమాలను ఈవారోత్సవాల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆదివారం కృష్ణచైతన్య కళాశాలలో విద్యార్థులతో సెమినార్ నిర్వహిస్తున్నామని తెలిపారు.