శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నల్లబజారులో నీలి కిరోసిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 29: ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి కోసం అందించే రాయితీ పథకాలు అనర్హుల పళ్లాల్లో ఫలాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం ఎంతో సదుద్దేశ్యంతో నిరుపేదలను ఆదుకునేందుకు తెల్లరేషన్ కార్డుల ద్వారా అందిస్తున్న రాయితీ సరకులు పక్కదారి పట్టి నల్లబజారులో ప్రత్యక్షమవుతున్నాయి. రేషన్ షాపుల్లో మాత్రమే దొరికే నీలి కిరోసిన్ ప్రస్తుతం నెల్లూరు నగరంలోని ఆటోనగర్‌లో యేథేచ్ఛగా అమ్మకాలు సాగుతోంది. జిల్లాలో సుమారు 7.14 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి కార్డుకు ఒక లీటరు వంతున కిరోసిన్ అందజేయాల్సి ఉంటుంది. అయితే వాస్తవంగా డీలర్ దగ్గర కిరోసిన్ తీసుకుంటున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలోనే ఉంటోంది. కొన్నిచోట్ల డీలర్లే కిరోసిన్ లేదంటూ కార్డుదారులకు ముక్తసరిగా సమాధానమిచ్చే పరిస్థితి. అయితే ప్రభుత్వం పక్కదారి పడుతున్న రాయితీ సరకుల్ని నియంత్రించే చర్యల్లో భాగంగా తీసుకొచ్చిన ఈ-పాస్ పద్ధతిని కూడా డీలర్లు తమకనుకూలంగా మలుచుకుంటుండడం విశేషం. కార్డుదారులు తమకవసరమైన సరుకులను మాత్రమే డీలర్ల వద్ద తీసుకుంటుంటారు. వాటిలో బియ్యం, పంచదార వంటివి ఎక్కువగా ఉంటుంటాయి. కిరోసిన్‌ను ప్రతి నెలా తీసుకెళ్లేవారు బహు అరుదు. ఇలా ప్రతి డీలర్ దగ్గర భారీగానే కిరోసిన్ నిల్వలు పేరుకుంటున్నాయి. దీన్ని బ్లాక్ మార్కెట్‌దార్లకు డీలర్లు విక్రయిస్తున్నారు. నేరుగా డీలర్ దుకాణాల వద్దకు వచ్చి తమ వాహనాల్లో కిరోసిన్ డ్రమ్ములను బ్లాక్ మార్కెట్‌దార్లు తీసుకెళ్తున్నారు.
ఆటోనగర్‌లో విచ్చలవిడి విక్రయాలు
జిల్లావ్యాప్తంగా డీలర్ల వద్ద కొనుగోలు చేసిన నీలి కిరోసిన్‌ను కొందరు జాతీయ రహదారిపై చాటుమాటుగా లారీ డ్రైవర్లకు విక్రయిస్తుండగా, ఎక్కువ మంది ఆటోనగర్‌లో విక్రయాలు జరుపుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు ఆటోనగర్‌లో ఈవిధంగా నీలి కిరోసిన్‌ను బహిరంగంగా విక్రయించే దుకాణాలు 6 వరకు ఉన్నాయి. వీరంతా నెల్లూరు నగరం, చుట్టుపక్కల మండలాల నుంచి కిరోసిన్‌ను సేకరించి ఇక్కడ విక్రయిస్తున్నారు. రూ.15 వంతున కార్డుదారులకు అందాల్సిన కిరోసిన్‌ను డీలర్ల వద్ద లీటర్ రూ.26కు కొనుగోలు చేసి ఆటోనగర్‌లో రూ.40 నుండి 45 వరకు అమ్ముతున్నారు. ఇంజిన్ తదితర వాహన విడిభాగాలను శుభ్రం చేసేందుకు కిరోసిన్ వాడకం తప్పనిసరి కావడంతో ఆటోనగర్‌లో ఈ నీలి కిరోసిన్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఈ కిరోసిన్ అమ్మకాల్లో ఇద్దరు బ్లాక్‌మార్కెట్‌దారుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. అధికారులకు, పోలీసులకు ఈ విషయం తెలియంది కాదు. అయినా నిమ్మకు నీరెత్తినట్లు వారు వ్యవహరించడం వెనుక కారణాలను ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. ఇకనైనా జాయింట్ కలెక్టర్ పక్కదారి పడుతున్న ఈ నీలి కిరోసిన్ అర్హులకు మాత్రమే అందేలా, బ్లాక్‌మార్కెట్ విక్రయాలపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉంది.

పింఛన్లు అర్హులకు అందేనా?
మెప్మాలో చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగి
జన్మభూమి అర్జీలు బుట్టదాఖలు
నెల్లూరుసిటీ, జనవరి 29: ఎంతో ఆశగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు లబ్ధి చేకూరేనా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. పింఛన్ల మంజూరులో అవకతవకలకు పాల్పడితే సహించమని ప్రతిపక్ష నేతలు హెచ్చరికలను చూస్తే అర్హులకు న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నగరపాలక సంస్థలోని ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి సస్పెండ్ అయి గుట్టుచప్పుడు కాకుండా తిరిగి పోస్టింగ్ తెచ్చుకుని మెప్మా విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. పేదలకు అందించే ఏ పథకం అయినా ఈ విభాగం నుండి అందాల్సిందే. అలాంటి సెక్షన్‌లో ఆ ఉద్యోగి పేదలకు అందాల్సిన పథకాలను అందించకుండా అంతా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిరుపేదలకు అన్యాయం చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో ఎంతో కీలకమైన మెప్మా విభాగం అవినీతికి చిరునామాగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల మంది సామాజిక పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అయితే నెల్లూరు కార్పొరేషన్‌లో డిసెంబర్ 27వ తేదీ వరకు 4200 మంది పింఛన్ల కోసం దాఖలు చేసిన జాబితాను ప్రజాప్రతినిధులకు అధికారికంగా పంపారు. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ కోసం ఆన్‌లైన్ చేసుకున్న ప్రతిఒక్కరికి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో మాజీ ఇన్‌చార్జ్ కమిషనర్ ఇక ఆన్‌లైన్ చేయడం తాత్కాలికంగా నిలుపుదల చేయాలని చెప్పడం జరిగింది. దీనిని అసరాగా తీసుకుని మెప్మాలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ అర్హులైన పేదలు వచ్చి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్ పనిచేయడం లేదని చెబుతూ రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రం రహస్యంగా పింఛన్లను ఆన్‌లైన్ చేశారు. దీంతో పింఛన్లు 4200 నుండి సుమారుగా 5 వేలకు పైగా చేరాయి. రహస్యంగా ఆన్‌లైన్ చేసిన జాబితా వల్ల పాత జాబితా ప్రకారం పింఛన్లు వస్తాయో లేదోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. అయితే మెప్మా సెక్షన్‌లో ఏ పని అయినా జూనియర్ అసిస్టెంట్ కనుసన్నలలోనే జరుగుతుంది. పాత జాబితా ప్రకారం పింఛన్ వస్తుందని ఇప్పటిదాకా కలలుకంటున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మరిచిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. డిసెంబర్ 27వ తేదీ నుండి వందలాది పింఛన్లను రాత్రి రాత్రికే ఆన్‌లైన్ చేశారు. ఈ ఆన్‌లైన్ చేసిన జాబితాలో పాత జాబితా ఉన్న కొంతమంది పేర్లను కూడా తొలగించినట్లు సమాచారం. ఇదిలావుంటే తన సొంత వ్యక్తుల కోసం, కొంతమంది ప్రజాప్రతినిధుల కోసం రహస్యంగా తయారుచేసిన జాబితా వల్ల పాత జాబితాలో ఉన్న ప్రకారం పింఛన్లు వస్తాయో లేదో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీలను ఇప్పటిదాక ఆన్‌లైన్ చేసిన దాఖలాలు కన్పించడంలేదు. ఎంతో మంది పేదలు జన్మభూమిలో అర్జీ ఇస్తే అది పరిష్కారం అవుతుందని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న పేదలకు ఒక్క పింఛన్ కూడా వచ్చే పరిస్థితి కన్పించడంలేదు.
పింఛన్ల మంజూరులో రాజకీయాలు సహించం:రూరల్ ఎమ్మెల్యే
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి పింఛన్ల అవకతవకలపై తీవ్ర స్థాయిలో అధికారులపై మండిపడ్డారు. పేదలకు ఇచ్చే పింఛన్లపై రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మెప్మా అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. తానెప్పుడూ కూడా పేదలకిచ్చే పింఛన్లపై రాజకీయాలకు పాల్పడలేదని, అర్హులైన పేదలకు సీనియార్టీ ప్రకారం ఇవ్వాల్సిందేనన్నారు. తొలి విడతగా మంజూరు చేసిన జాబితా ప్రకారం పింఛన్లు మంజూరు చేయకుండా కొత్తగా దరఖాస్తు చేసిన వారికి ఇచ్చినట్లు తెలిస్తే సహించేది లేదన్నారు. ఇదిలావుండగా దీనిపై కార్పొరేటర్లు కూడా అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఒక కళాశాలలో కూర్చుని అర్హులైన వారి పేర్లు తొలగించి తమ ఇష్టానుసారంగా పింఛన్లు మంజూరు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అంతేకాక ఒక వర్గానికి చెందిన పింఛన్లు మాత్రం మంజూరు చేయడం సరికాదన్నారు.

మోదీతోనే మైనార్టీల సంక్షేమం
* మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ స్పష్టం
నెల్లూరు కలెక్టరేట్, జనవరి 29: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారి అన్నారు. నెల్లూరులో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మైనార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అరవై ఏళ్లు పాలించిన గత ప్రభుత్వాలు మైనార్టీలను కేవలం ఓటుబ్యాంక్ శ్రేణులుగానే పరిగణించాయే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ మైనార్టీ అనే పదం లేకుండానే అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. భేటీ బచావో, భేటీ బడావో పేరుతో మైనార్టీల పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. మైనార్టీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత మార్పులన్ని చట్టరూపం పొందితే వారి సంక్షేమానికి తిరుగులేదన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా మైనార్టీలు ప్రభుత్వానికి సానుకూల మద్దతు తెలియజేయాలన్నారు. మైనార్టీలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు కేంద్రం ఆర్థిక ప్రణాళికలు రూపొందించి వారి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మహిళ దారుణ హత్య
సంఘటనాస్థలిని పరిశీలించిన ఆత్మకూరు డిఎస్పీ
అనుమసముద్రంపేట, జనవరి 29: పొనుగోడుకు చెందిన కోటకొండ శేషమ్మ (35) అనే వివాహిత మహిళ ఆదివారం దారుణహత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. ఆమె కుమార్తె అస్మిత ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తల్లి, కుమార్తె ఇద్దరు ఉదయానే్న ఆత్మకూరుకు వెళ్లి ఇంటికి సంబంధించిన సామగ్రి తీసుకుని 11గంటల సమయంలో గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు వంట చేయాలని కుమార్తెకు చెప్పి, అప్పుడే వస్తానంటూ వెళ్లిందని కుమార్తె అస్మిత చెబుతోంది. మధ్యాహ్నానికి ఆమె మృతి చెంది ఉండటాన్ని గ్రామస్థులు కుమార్తెకు తెలిపారు. ఆ కుమార్తె అక్కడ చూసిన అనంతరం పోలీసులకు సమాచారం తెలియజేసింది. మృతురాలు శేషమ్మ తలపై మోది ఉండటాన్ని గుర్తించారు. రెండు కాళ్లు కట్టివేసిన వైనాన్ని కూడా గుర్తించారు. గ్రామానికి తూర్పు వైపున ఉన్న పొలాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈమెకు గత కొన్ని సంవత్సరాలుగా భర్తతో సంబంధాలు లేవు. పెద్ద కుమార్తె అస్మితకు ఇటీవల వివాహమైంది. రెండో కుమార్తె అనిత ఏఎస్‌పేటలోని పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటోంది. గ్రామంలో కూలీ పనికి వెళ్తుండేది. సంఘటనాస్థలిని ఆత్మకూరు డిఎస్పీ కెఎస్‌ఎస్‌వి సుబ్బారెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో ఈమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం వద్ద ఉన్న మోదిన రాళ్లను, చెప్పులు, ఇతర వస్తువులను పోలీసులు సేకరించారు. అయితే ఆమె వద్ద ఉండాల్సిన సెల్‌ఫోన్ మాత్రం మాయమైంది.

రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ప్యాకేజీకి సమ్మతం
* ముఖ్యమంత్రిపై నమ్మకంతోనే పెట్టుబడులు
* ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం
నెల్లూరు, జనవరి 29: రాష్ట్ర ప్రజలు, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించామని ఎమ్మెల్సీ, టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా పేరుతో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి రిపబ్లిక్ డే నాడు ఎంతో రాద్ధాంతం సృష్టించారని, అయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉన్న నమ్మకంతో ఎన్నో పరిశ్రమలు రూ.10లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నారని గుర్తు చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉందన్నారు. సమర్థవంతుడైన ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తోందని చెప్పేందుకు ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుందని ప్రశ్నించారు. వైజాగ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి అలజడి సృష్టించాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రజల నుంచి కూడా సహకారం లభించలేదని ఎద్దేవా చేశారు. ప్రజల్ని రెచ్చగొట్టే చర్యలకు ఇకనైనా పుల్‌స్టాప్ పెట్టాలని ఆయన జగన్‌కు హితవు పలికారు. వై ఎస్ హయాంతో పాటు గత కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పరిపాలనలో ఉమ్మడిరాష్ట్రంలో నిత్యం విద్యుత్‌కోతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారని, ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అందించగలిగే స్థితికి రాష్ట్రం చేరుకుందని, ఈ ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని స్పష్టం చేశారు. సోనియాగాంధీ మొదలు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వరకు ఎందరో కాంగ్రెస్ నేతలు చంద్రబాబునాయుడిపై 25 వరకు పలు కేసులు పెట్టారని, అయినా వాటిలో ఏవి కూడా రుజువు కాలేదని గుర్తు చేశారు. ఎన్నోసార్లు తమ నేత ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిశారనే విషయాన్ని ప్రతిపక్ష నేత గుర్తుంచుకోవాలన్నారు. ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకు రాయితీ కల్పించాలని చట్టంలో లేదని, అయితే ప్రత్యేక హోదా కంటే ప్యాకేజిలో ఎన్నో వేల కోట్ల లాభం రాష్ట్రానికి ఒనగూరనుందన్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇకపై ఆ హోదాను కొనసాగించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసిందని, అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజియే రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టిడిపి నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, టిడిపి నాయకులు కొండూరు పాలిశెట్టి, హరిబాబుయాదవ్, చాన్‌బాష్, మేకల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీరామ పట్ట్భాషేక మహోత్సవం
నెల్లూరు, జనవరి 29: శ్రీరామ మహాసామ్రాజ్య పట్ట్భాషేక మహోత్సవ కార్యక్రమం స్థానిక దర్గామిట్టలోని స్వర్ణవేదిక కల్యాణ మండపంలో ఆదివారం ఎంతో వేడుకగా జరిగింది. శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠాధిపతి రామానందభారతి మహాస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో రమణీయంగా, వైభవోపేతంగా సాగింది. శ్రీరాములవారి పట్ట్భాషేకాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. కార్యక్రమ అనంతరం మహాస్వామి మాట్లాడుతూ ధర్మ పరిరక్షణలో బాంధవ్యాలకు చోటులేదని చాటిచెప్పిన మహనీయుడు శ్రీరాముడని కొనియాడారు. ఆయన అడుగుజాడలు మార్గదర్శనీయమని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతిఒక్కరూ ఆచరించాల్సిన ధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన శ్రీరాముడు పరమపూజ్యనీయుడని అన్నారు.

పోలియో రహిత సమాజానికి కృషి చేద్దాం
మేయర్ అబ్దుల్ అజీజ్ పిలుపు
నెల్లూరుసిటీ, జనవరి 29: జిల్లాను పోలియో రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రతిఒక్కరి కృషి అవసరమని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆదివారం 3వ డివిజన్‌లోని కొండయ్యతోపు ప్రాంతంలోని గిరిజనవాడలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు వయస్సు గల తమ పిల్లలను పోలియో కేంద్రాల వద్దకు తీసుకొచ్చి పోలియో చుక్కలను వేయించాలని కోరారు. ప్రతిఒక్కరు పోలియో వ్యాధిపై అవగాహన పెంచుకుని చిన్నారులకు ఆ వ్యాధి సోకకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కామిల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని మేయర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ చెత్తను సేకరించే వృత్తివారు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పౌష్టికాహారం అందించి, విద్యాబుద్దులను నేర్పించే అంగన్‌వాడీ పాఠశాలను స్థానికంగా నిర్మిస్తామని చెప్పారు. త్వరలో చెత్తనుంచి విద్యుత్ తయారుచేసే విధానాన్ని నగరంలో నిర్మిస్తామన్నారు. ఉపాధి కోల్పోబోయే చెత్త సేకరించే వృత్తి కార్మికులకు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. స్థానికుల కోసం కమ్యూనిటీ మరుగుదొడ్లను నిర్మించి బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. వైద్యశిబిరాలను ఏర్పాటుచేసి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్న కామిల్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు అధికారి చిరంజీవి, వైద్యులు దొరస్వామినాయుడు, ఎంఎస్ రెడ్డి సంస్థ ప్రతినిధులు ఈశ్వరమ్మ, ప్రసాద్, కార్పొరేటర్లు పొత్తూరి శైలజ, అంచూరి జానకి, టిడిపి నాయకులు ననే్నసాహెబ్, షంషుద్దీన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పిల్లల ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి
పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆరు వారాల నుంచి 5ఏళ్ళ లోపు ఉన్న చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలను వేయాలని 36వ డివిజన్ కార్పొరేటర్ వహీద తెలిపారు. ఆదివారం 36వ డివిజన్ పరిధిలో గల అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశంలో 1995లో పోలియో వ్యాక్సిన్ ప్రారంభించేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏటా 35 వేలు ఉన్న సంఖ్య 2002కు 1600కు చేరిందన్నారు. పోలియో నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. 2018కల్లా పోలియో రహిత ప్రపంచంలో భారతదేశాన్ని చూడాలనే ఆకాంక్షతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.