నెల్లూరు

‘మెరుపు’ ప్రయోగం ఓ సాహసం! (సాహితీ సమాలోచన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక తరానికే పరిమితమైన తెలుగు సాహిత్యాన్ని యువతరానికి స్ఫూర్తి నిచ్చేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రభూమి చేస్తున్న ప్రయోగమే ‘మెరుపు’ ప్రత్యేక శీర్షిక. తెలుగు పత్రికా రంగంలో మెరుపు శీర్షిక నిర్వహణ ఒక పెద్ద సాహసం అని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మెరుపు రచయితలు, కవులు, కాలమిస్టులు, కార్టూనిస్టులతో విశాఖ ఆంధ్రభూమి కార్యాలయంలో గత బుధవారం (మార్చి 1వ తేదీ) ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంవిఆర్ శాస్ర్తి తన అభిప్రాయాలను, మనోభావాలను రచయితలు, కవులతో పంచుకున్నారు. ప్రస్తుతం జనజీవనానికి దూరమైన తెలుగు సాహిత్యాన్ని బతికించు కునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.
పాతతరం యువతపై నాటి సాహిత్యం కలిగించిన ప్రభావాన్ని ఈ కాలపు యువతపై నేటి తెలుగు సాహిత్యం తీసుకురాలేక పోయిందని అన్నారు. యువతరంలో సాహిత్యాలాభిషను పెంపొందించేందుకు నాటి తరం సాహిత్యాభిమానులు కృషి చేయాలని, అందుకు ఆంధ్రభూమి ‘మెరుపు’ వేదికగా నిలుస్తుందని అన్నారు. ఎన్నో కష్టానష్టాలకోర్చి సాహిత్యాభిమానుల కోసం ‘మెరుపు’ను నిర్వహిస్తున్నామని అన్నారు. రచయితలకు ప్రోత్సాహం ఇచ్చి వారి నుండి కొత్త రచనలు వచ్చే విధంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.
మూస కథలకు, కవితలకు పరిమితం కాకుండా ‘మెరుపు’ను సరికొత్త రీతిలో నిర్వహించేందుకు కూడా ఔత్సాహిక రచయితలు సహకరించాలని ఎంవిఆర్ శాస్ర్తి కోరారు. ముఖ్యంగా రచనల్లో కొత్తదనంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా కథలు, కథానికలు, సమీక్షలు తదితర అంశాలను పంపాలని సూచించారు.
‘మెరుపు’ ద్వారా సాహిత్యం పట్ల మక్కువ పెంపొందించడం, ఔత్సాహిక యువ రచయతలకు అవకాశం కల్పించి వారి ప్రతిభను సానబెట్టడం, వివిధ సాహితీ ప్రక్రియల్లో కొత్తతరం రచయితలను తయారు చేయడం ‘మెరుపు’ లక్ష్యమని శాస్ర్తీ పేర్కొన్నారు. రచయితలు వినూత్న ప్రక్రియలు, పోకడలను ఎంచుకుని తమలోని ప్రతిభా వ్యుత్పత్తులను చూపించాలన్నారు.
స్థానిక రచయతల సాహితీ వ్యాసంగాలు, జిల్లాస్థాయి సాహితీ సంస్థల కార్యకలాపాలకు ప్రాచుర్యం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా, ప్రాంతీయ స్థాయి రచయితలకు సమన్వయ వేదికగా ‘మెరుపు’ పేజీని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ‘మెరుపు’ ప్రయోగం విజయవంతం అయిం దని, ఉత్తరాంధ్ర రచయితల నుండి దీనికి మంచి స్పందన వస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, సాహితీ అభిమానులతో ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ప్రొఫెసర్ డి విశే్వశ్వరం మాట్లాడుతూ భాష పట్ల మక్కువ తగ్గుతోందనీ, భాషను బతికించుకోవడం ద్వారా సాహిత్యాన్ని పదిలం చేసుకోవాలని సూచించారు. అందుకు ఆంధ్రభూమి వంటి పత్రికలు తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. కేవలం భాషా దినోత్సవం రోజునో, గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు వేడుకల్లోనో భాష ఔన్నత్యంపై ప్రసంగించి మర్చిపోయే సంప్రదాయం పోవాలన్నారు.
సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ మాట్లాడుతూ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న రీతిలోనే నాటక రచనలకూ ప్రోత్సాహం అందించాలని సూచించారు. బాలల సాహిత్యం, హాస్య రచనలు పాఠకులను ఆకర్షిస్తాయని, వీటికి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఈ తరం పిల్లలను సాహిత్యం వైపు మళ్లించవచ్చని సూచించారు.
రచయిత ఎ సీతారామారావు మాట్లాడుతూ రచనా విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆంధ్రభూమి మెరుపు శీర్షిక ద్వారా రచనాభిమానులకు ప్రోత్సాహం లభిస్తోందని, ఇది శుభ పరిణామంగా పేర్కొన్నారు. సాహితీ అభిమానులు తరచు సమావేశమై ప్రస్తుత రచనా సరళిపై చర్చిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయన్నారు.
శేషాద్రి సోమయాజులు మాట్లాడుతూ పాఠకుల అభిరుచులు మారుతున్నాయని, వారి అభిరుచులకు అనుగుణంగా రచనా శైలిని మార్చుకుని చేరువ కావాల్సి ఉందన్నారు.
మాధవీ సనారా (సత్యనారాయణ) మాట్లాడుతూ ఆంధ్రభూమి ఆదివారం అనుబంధాన్ని టాబ్లాయిడ్ రూపంలో కాకుండా పుస్తక రూపంలో అందిస్తే అపురూపంగా భద్రపరచుకునేందుకు వీలవుతుందని సూచించారు.
రచయిత అనురాధ మాట్లాడుతూ కథలు, కవితలు రాసే ఔత్సాహికులకు మెరుపు ఒక వారధిగా పని చేస్తోందని కొనియాడారు. మిగిలిన పత్రికల్లో సాహితీ అంశాలు కనుమరుగవుతున్న తరుణంలో భాష, సాహిత్యానికి ఆంధ్రభూమి పెద్దపీట వేయడం హర్షించతగ్గ పరిణామమన్నారు.
‘మెరుపు’లో ప్రచుఠణకు స్వీకరించే కవితలు, కథలు, వ్యాసాలకు సంబంధించి ఆయా రచయతలకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలన్న రచయతల విజ్ఞప్తికి ఎంవిఆర్ శాస్ర్తి సానుకూలంగా స్పందించారు.
ఉత్తరాంధ్ర ‘మెరుపు’ సమన్వయకర్తలు బులుసు సరోజినీదేవి, దుర్గాప్రసాద్ సర్కార్ మాట్లాడుతూ రచనల నిడివికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా రచయతలకు కొన్ని సూచనలను అందించారు. కథలు వ్రాతప్రతిలో రెండు ఎ4 సైజు పేజీలకు మించరాదనీ, కవితలు పదిహేను నుండి ఇరవై పంక్తులలోపు ఉండాలని సూచించారు. అనంతరం మెరుపు శీర్షికకు రచనలు పంపే రచయితలు, కవులను ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రభూమి రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు కూడా పాల్గొన్నారు.
- ఆంధ్రభూమి బ్యూరో,
విశాఖపట్టణం
chitram....
1. విశాఖపట్టణంలో జరిగిన మెరుపు రచయతల ఆత్మీయ సమావేశం సందర్భంగా రచయిత్రి రాయవరపు సరస్వతితో మాట్లాడుతున్న
ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ. పక్కన వ్యంగ్య చిత్రకారిణి ఉప్పులూరి శ్రీదేవి వేసిన చిత్రాలను పరిశీలిస్తున్న దృశ్యం.

2. కార్యక్రమానికి హాజరైన ‘మెరుపు’ కవులు, రచయితలు

మతోన్మాద ఆగడాల్ని ఎండగట్టే ‘జ్ఞానగుళికలు’!

ఆధునిక తెలుగు సాహితీ రంగంలో అశోక్‌కుమార్‌లు చాలామంది కనిపిస్తారు. కానీ సింగంపల్లి అశోక్‌కుమార్ అంటే కొందరికి, ‘శ్రీశ్రీ అశోక్‌కుమార్’ అంటే అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. అంతటి శ్రీశ్రీ వీరాభిమాని అశోక్‌కుమార్. శ్రీశ్రీ స్ఫూర్తితో కలం పట్టి కవిత్వం రాస్తున్న వారిలో అశోక్‌కుమార్ ఒకరు. అలాగే ‘మినీ కవిత్వం’ ఉద్యమంలా మొదలైనప్పటి నుంచి నేటి వరకు ఆ ప్రక్రియలో కవిత్వం రాస్తున్నవారు, ప్రచారం చేస్తున్నవారు ఇద్దరే. వారిలో అశోక్‌కుమార్ ఒకరనే సంగతి విడమర్చి చెప్పనక్కర్లేదు. అశోక్‌కుమార్ ఇప్పటి వరకు హేతువాద దృక్పథంతో 11 కవితా సంపుటాలు వెలువరించి పాఠకుల మన్ననలు పొందారు. ఇప్పుడు తాజాగా 12వ సంపుటిగా ‘జ్ఞానగుళికలు’ అందిస్తున్నారు. ఇందులోని కవితలు 1970-2016 కాలాల మధ్య రాసినవి అయినప్పటికీ అవి ఇప్పటి కాలానికీ సరిగ్గా నప్పేవే! నానాటికీ మతోన్మాదం పేట్రేగిపోయి ప్రగతిశీల వాదులపై, ప్రశ్నించే వారిపై భౌతిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ పుస్తకం తేవటం సరైన సందర్భమని సాక్షాత్తూ కవి అశోక్‌కుమార్ పేర్కొని, ఆయా ధోరణులపై నిరసన వ్యక్తం చేయటం గమనార్హం. మొత్తం 60 హేతువాద మినీ కవితలున్న ఈ సంపుటిలో చాలా కవితలు పాఠకుల మనస్సులను సూటిగా తాకుతాయి. నిజాన్ని నిర్భయంగా తెలిపి, మసకబారుతున్న కళ్లను విదిలించి, పిడికిళ్లు బిగించి ఉద్యమించేలా ఉసిగొల్పుతాయి. ‘నీలోని నెత్తురు ఎరుపు/ నాలోని నెత్తురు ఎరుపు/ నువ్వూ, నేనూ వేరువేరని/ మతోన్మాదుల అరుపు’ అంటూ ‘మతహాసాన్ని’ సూటిగా చెప్పిన అశోక్‌కుమార్, ‘రాళ్లన్నీ మొక్కు/ దక్షిణలు కక్కు/ నెత్తిన నీకు/ శఠగోపం దక్కు’ అంటూ భక్తిపేరుతో కొందరు కుచ్చుటోపీ ఎలా పెడుతున్నారో వాస్తవాల్ని నిక్కచ్చిగా చెప్పటం పాఠకుడు ఇట్టే అర్థం చేసుకుంటాడు. అయితే గతంలో అశోక్‌కుమార్ రాసిన మినీ కవితలకు ఈ మినీ కవితలకు మధ్య కొంత తేడాను గమనించవచ్చు. సాధారణంగా మానవత్వాన్ని పెంపొందించేవి, మతోన్మాదంపై వ్యతిరేకత వ్యక్తం చేసే కవిత్వాన్ని అందరూ అర్థం చేసుకొని మారవచ్చు, మార్చవచ్చు. కానీ ఈ ‘జ్ఞానగుళికలు’లో కొన్ని వివాదాస్పదమైనవి కూడా చేరటం గమనించవచ్చు. ‘మంత్రాలకు’ శీర్షికలో ‘ప్రభు ప్రార్థనలతో/ మనిషి స్వస్థత ఐతే సరి/ ఇన్ని మిషనరీ ఆసుపత్రులు/ ఎవరికో, ఎందుకో మరి’ -ఇలాంటి మినీ కవితల్లో వాస్తవం వుండొచ్చు కానీ, అత్యధిక ప్రజానీకం మనస్సులు గాయపడేలా కాకుండా, మత ప్రస్తావన లేకుండా మతవ్ఢ్యౌన్ని మాత్రమే ఎండగట్టేలా వుంటే బాగుండేదనిపిస్తుంది. అశోక్‌కుమార్‌లో వచ్చిన ఈ కొత్త మార్పు మొదట్లో చెప్పుకున్నట్లు ఈ కాలంలో ప్రగతిశీల వాదులపై జరుగుతున్న మతోన్మాదుల దౌర్జన్యాలకు కలవరపడి రచయితల్లో ఇంతటి కోపానికి, ఆక్రోశానికి కారణమై వుండవచ్చని ఆలోచనాపరులు అర్థం చేసుకోగలరు.

- చలపాక ప్రకాష్,
చరవాణి : 9247475975

పుస్తక సమీక్ష

ఖండిత స్వప్నాలకు
కావ్యరూపం

సీనియర్ కవి డాక్టర్ కొండెపోగు లివింగ్‌స్టన్ రచించిన ‘ఖండిత స్వప్నాలు’ కవితా సంపుటికి రెండు తెలుగు రాష్ట్రాల కవులకు పెద్దదిక్కైన కె శివారెడ్డి ముందుమాట రాశారు. లివింగ్‌స్టన్ అన్ని ప్రక్రియల్లో చేయి తిరిగిన బహుముఖ ప్రజ్ఞావంతుడు. నవల, కథ, కవిత, వ్యాసాలు, ఏకపాత్రాభినయాలు అన్నీ కలిపి పది సంపుటాలు పాఠకులకు అందించాడు. వృత్తిరీత్యా లెక్చరర్, ప్రవృత్తిరీత్యా సాహిత్యకారుడు. పరిచయ వాక్యాలు అక్కరలేని కవి. బాగా వెనుకబాటుతనానికి గురైన ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతం నుండి వచ్చిన కవి కనుక సహజంగా, స్వతహాగా దుఃఖం వుంటుంది. పచ్చదనం అంతరించి బెట్టబోయి ఎడారిని తలపించే తన ప్రాంతంలో, ఓ వర్షం చుక్క కోసం నకనకలాడే ప్రజలు, రైతులు, రైతుకూలీలు, వలసలు లేకుండా నిశ్చింతగా జీవించాలంటే వర్షం కురవాల్సిందే అంటారు కవి. ‘వానకురిస్తే బాగుండు’ కవితలో, మధురంగా మట్టివాసన / గాలినిండా వాసనే / జిల్లుమనే జల్లు తెరల్లో / పులకలెత్తిన బాగుండు / చిటపట కురిస్తే చినుకుల్లో / పచ్చగ మెరిసే పచ్చికపై / గరికపూలు ముచ్చటగా / స్నానమాడితే బాగుండు. ఎంత గొప్ప భావుకత చిటపట చినుకులు పచ్చగా మెరిసే పచ్చికైతే ఎంత బాగుంటుంది. తన ప్రాంతం సస్యశ్యామలమవ్వాలని కోరుకుంటారు కవి. వర్షం గురించి అనేకమంది కవులు, గాయకులు, కథకులు తమ సాహిత్యం ద్వారా ఎలుగెత్తి చాటారు. వారిలో డాక్టర్ అందెశ్రీ, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ప్రజాగాయకుడు జయరాజు, బండి నారాయణస్వామి. వారి కోవలోకే వస్తాడు లివింగ్‌స్టన్. సహజంగా లబ్ధ ప్రతిష్ఠులైన కవులు నల్లని చీకటి అని గతంలో వాడారు. ఇక్కడ కవి ‘‘చల్లటి చీకటి’’ అని కొత్తప్రయోగాన్ని పాఠకులకు పరిచయం చేశారు.
మట్టి స్పృశించనిదే ఏ కవి కవిత్వం రాయలేడు. మట్టి మన చిరునామా. కవితలో మట్టిది వౌనభాష / మట్టిది నిత్యశ్వాస / ఈ మట్టే కదూ, నీటి చెలిమితో / కడుపుకింత బువ్వ పెడుతుంది / మట్టి నీటితో చేయబట్టేకదా మనకింత బువ్వ దొరుకుతుంది. మట్టికి, బువ్వకి, మట్టికి నీళ్లకి ఉన్న అవినాభావ సంబంధాన్ని రక్తి కట్టించారు కవి. మొత్తం కవితా ప్రస్తానంలో ఎక్కడ ఆంగ్ల ప్రయోగంగాని, సంస్కృతం గాని ప్రవేశించకుండా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాషలో ప్రకాశం పశ్చిమ ప్రాంతం నుడికారం విరివిగా ప్రయోగించారు. మహోద్రేకపు జెండా అంటూ మహాకవి శ్రీశ్రీ గురించి ప్రస్తావిస్తూ అతడి కర్మాగారంలో అక్షరాలు పదునెక్కాయి. పదాలు విస్ఫోటనానికి సిద్ధమయ్యాయి. మహోద్రేకాన్ని వాగ్దానపు ఎర్రజెండాగా ఎగురవేసింది అంటూ పదునైన బలమైన పదజాలంతో కవిని బట్టి చక్కని భాష వాడారు. అక్షరాలను పదునెక్కించారు. మహాకవిని తన భాషతో అభిషేకించిన తీరు ఎంతైనా ఎన్నదగింది. సాంఘిక సంక్షేమ వసతిగృహాల పనితీరును తూర్పారబట్టారు కవి. వాటిని సంస్కరిస్తున్నట్టు నటిస్తున్న నాయకులు, వసతిగృహాల్లో సహపంక్తి భోజనాలు చేయడం, రాత్రిపూట బసచేయడం ఇదంతా దగాకోరుతనమంటారు కవి. కంటితుడుపుగా ఏ రాత్రో వెళ్లి సకల లాంఛనాలతో నిద్ర చేయడం తప్ప వైట్ కాలర్ ఫోజుల్తో ఫోటోలకి ఫోజులివ్వడం తప్ప ప్రగతి లేదని కవి వివరణాత్మక సందేశమిచ్చాడు.
ఆకుపచ్చని శోకంలో కవి ప్రకృతిని కాపాడుకుంటే అది మానవాళిని కాపాడుతుంది. అభివృద్ధి అనున్నదంతా విధ్వంసమే. రోడ్ల విస్తరణ, పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టుల నిర్మాణం అనేక సందర్భాలలో నిర్దాక్షిణ్యంగా చెట్లను నరికి పర్యావరణానికి, ఓజోన్ పొరకి ముప్పుతెచ్చి మనం నుంచున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాము. ఇది భూమిపై నడుస్తున్న వర్తమాన విషాదం. సర్వే సర్వత్రా సాగిపోతున్న తంతు మనిషికి ఎప్పటికి తెలిసొచ్చేను చెట్టుమీద. ముందు మనిషికి చెట్టు విలువ తెలియాల్సి ఉంది. భవిష్యత్ తరాల కోసం ఓ చిటికెడు ప్రాణవాయువు మిగుల్చుదాం అంటారు కవి. జరిగిన ఘోరకలి చాలు. ఇప్పటికైనా మేల్కొందాం. పచ్చటి పరిసరాల్ని స్వచ్ఛమైన గాలిని ముందు తరాలకు వారసత్వంగా అందిద్దాం. అది మన లక్ష్యం మాత్రమే కాదు బాధ్యత కూడా అంటారు లివింగ్‌స్టన్. ఇది అందరూ చదవాల్సిన ఓ మంచి కావ్యం. సులభ శైలి. చక్కని విరుపు. సామాన్యులు, అతి సామాన్యులు కూడా చదవగలిగిన పుస్తకం. వీరుడైన కవి లివింగ్‌స్టన్ వారి సాహిత్యాన్ని పాఠక ప్రపంచంలోకి ఆహ్వానిద్దాం.

- దుగ్గినపల్లి ఎజ్రాశాస్ర్తీ
డోర్ నెం. 43-3-714, ఇందుర్తి నగర్, ఒంగోలు.
ఫోన్ - 8096225974

మనోగీతికలు

పరోపకారులెవరు
చెకుముకి రాయిలాంటి
చేతనత్వానికి
చెదబట్తుందంటే నమ్ముతారా!
చేదుకు విషం అంటుతుందంటే నమ్మగలరా!!
విజ్ఞతా వినీలాకాశంలో
విజయ కేతనం ఎగురవేయాల్సిన
విజయ సారథులు
విశృంఖల విషయవాంఛలకు
వినమ్రంగా ఆకర్షితులై
ధనార్జనే ధ్యేయంగా
ధర్మా, ధర్మాలను దగాపట్టిస్తున్నారంటే
నమ్ముతారా.. నమ్మశక్యంగాదంటారా!!
తనువులర్పించి
తలో చేయి వేసి తమనింతటి వారిగా
చూడాలనే చూడముచ్చటకై
తలపుల తాపడం పెట్టి
తదేకంగా తపస్సు చేసిన
తనా, మనాలను
తలవంచుకొనేటట్లు చేసి
తలక్రిందులుగా నడుస్తున్నారంటే
విశ్వసిస్తారా!... విడ్డూరమని నెట్టేస్తారా!!
ప్రతీ అనాగరిక కార్యకలాపంలో
పట్టుతప్పిన ప్రజ్ఞావంతులే కనబడుతున్నారు
పట్టా తిరిగి పడిపోబోతున్న
పదిమందికుపయోగపడే బోగీల్ని
పట్టాలెక్కించే ప్రాఙ్ఞులెవరు
పైకెదగాల్సిన ప్రాచుర్యాల్ని
పట్టుదప్పకుండా పట్టుకొని
పందిరెక్కించే పరోపకారులెవరు..

- పచ్చా పెంచలయ్య
చరవాణి : 9912822341

అనుభూతి
అలా...ఆకాశంలోకి చూస్తున్నప్పుడు
ఆకాశానికి నాకు
ఏదో అవినాభావ సంబంధమున్నట్లనిపిస్తుంది!
ఆ నల్లని మబ్బులు తెరలుతెరలుగా
నాలోని విషాదదృశ్యాలను
చిత్రీకరిస్తున్నట్టనిపిస్తుంది
ఆ నీలిమబ్బులు
చిర్నగవుతో నా మూగ వేదనని వీక్షిస్తున్నట్టు
ఆ తెల్లమబ్బులు
మనసుని చల్లగా నిమిరినట్టు
అదో అవ్యక్తానంద అనుభూతి
మనసు మసకబారినప్పుడు
ఆప్యాయతగా పలుకరించే
ఆకాశానికన్నా మంచి నేస్తం ఎవరున్నారు?

- గుర్రాల రమణయ్య
చరవాణి : 9963921943

ఇదీ ప్రజాస్వామ్యం..!
స్వాతంత్య్రానంతరం
సంకెళ్లు రూపాలు మారాయి
ఇప్పటి బానిసత్వం
కొత్త అర్థాల్లో జీవిస్తోంది
అవినీతి నిర్లక్ష్యమనే జోడు గుర్రాలపై
భరతజాతి పయనం
ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీరని
అవమానం
మేలుకుంటేనే ఈ దేశానికి మలుపు
కోలుకుంటేనే ఈ రుగ్మతలన్నింటికీ ఓ కుదుపు
పాలన హేళనగా మారి
ప్రజాస్వామ్యం
పరిహసింపబడుతున్న స్థితిలో
ఏలికల కొరకే ఎన్నికలేర్పడుతూ
పాలితులందరూ
పీడుతులౌతున్న దుస్థితిలో
అనైతిక ఏలుబడికి
చరమగీతం పాడాలి
రాజకీయవ్యవస్థపై రోజురోజుకు
ప్రజల విశ్వాసం సన్నగిల్లుతున్నది..!

- జోగి కార్తిక్,
కుప్పం

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net