నెల్లూరు

పెట్టుపోతలు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణ, పవన్ భార్యాభర్తలు. ఇద్దరూ ప్రైవేట్ రంగంలో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కార్తీక్, నవ్య. వారివి చిన్న ఉద్యోగాలైనా పిల్లలిద్దరికీ మంచి చదువులు చెప్పించారు. కావ్యకి పెళ్లీడు వచ్చింది. కార్తీక్ ఫైనల్ ఇయర్ బిటెక్ చదువుతున్నాడు.
కావ్య చక్కగా ఉంటుంది. సంబంధాలు చూస్తున్నారు. కావ్య కూడా తల్లిదండ్రులకు ఏ రూల్స్ పెట్టలేదు. మీకు ఎవరు నచ్చితే వారినే నేను చేసుకుంటానని చెప్పింది. దాంతో పవన్ పెళ్లి సంబంధాలను కుదిర్చే క్రిష్ణకుమార్‌కు తన కూతురు వివరాలు ఇచ్చాడు.
వారంలోనే ఒక సంబంధాన్ని తీసుకొచ్చాడు. అబ్బాయి కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అబ్బాయి పెద్దకొడుకు. తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. కావ్య నచ్చడంతో వారు కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. కానీ పెళ్లిమాత్రం నీట్‌గా చేయాలని వచ్చిన వాళ్లని చక్కగా చూసుకుంటే చాలని కోరారు.
అరుణ, పవన్ చాలా సంతోషపడ్డారు. పెళ్లిచూపులకు ఏర్పాట్లు చేశారు. అరుణ ఆరోజు ఇంట్లోనే గులాబ్‌జాం మరియు గారెలు చేసింది. అబ్బాయి వాళ్లు వచ్చారు. అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు కాసేపు మాట్లాడుకోమని చెప్పారు.
కావ్య, నరేంద్ర ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. ‘‘నా తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లాయి అందరూ కలిసి వుంటున్నాము. రేపు మన పెళ్లయిన తర్వాత కూడా వాళ్లు మనతోనే ఉంటారు. మా తమ్ముడి చదువు చివరి సంవత్సరంలో ఉంది. మా చెల్లెలికి కూడా సంబంధాలు చూస్తున్నారని చెప్పింది’’ కావ్య. ‘‘మనిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాము. అల్లుడుగా నేనెప్పుడూ మీ వాళ్లని అదికావాలి, ఇది కావాలి అని పేచీలు పెట్టను. నువ్వు కూడా నా కుటుంబంలోకి వచ్చి నా బాధ్యతలను పంచుకుని నాకు తోడుగా ఉండగలవా?‘‘ అని అడిగాడు నరేంద్ర.
నవ్య చాలా సంతోషపడింది. అలాగే ఉంటానని హామీ కూడా ఇచ్చేసింది. పెళ్లికి ముహూర్తాలు పెట్టేశారు. మూడునెలల్లో ముహూర్తం కుదిరింది.
అరుణ, పవన్ ఇద్దరూ ఒక కాగితం తీసుకొని, ఖర్చులు, ఏమేమి పెట్టాలో రాసుకున్నారు. షాపింగ్ పద్ధతిగా చేసుకోవాలని అనుకున్నారు.
పవన్‌కి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. అరుణకు కూడా అక్క, తమ్ముడు ఉన్నారు. బంధువర్గం పెద్దదే ఉంది పిన్నులు, బాబాయిలు, మామయ్యలు, అత్తయ్యలు అందరూ ఉన్నారు.
ఏమండీ అమ్మాయి పెళ్లికి కట్నం అడగలేదు కాబట్టి పెళ్లిగ్రాండ్‌గా చేద్దామంది. వచ్చిన వాళ్లందరికీ వస్త్రాలు పెడదాం, మంచి భోజనాలు ఏర్పాటు చేద్దాం. సంబరపడి పోతోంది అరుణ. పవన్ కాదనలేకపోతున్నాడు. కానీ అందరికీ ఒకేరకంగా మర్యాదలు చేయగలమా అని భయపడుతున్నాడు. పైగా వాళ్లింట్లో జరిగే మొదటి కార్యం. ఇద్దరూ ఎవరెవరికి ఏమేంకొనాలో రాసుకున్నారు. షాపింగ్ మొదలుపెట్టి ఒక్కొక్కటి కొనుక్కురావడం ప్యాక్ చేసి వాటి మీద పేర్లు రాసి పెట్టుకున్నారు.
పెళ్లిరోజు రానే వచ్చింది. పవన్, అరుణ పీటల మీద ఉంటారు కాబట్టి అక్కాచెలెళ్లకు బాధ్యత అప్పగించారు. వచ్చిన వాళ్లను రిసీవ్ చేసుకోవడం, మర్యాదలు చేయడం, భోజనాలు దగ్గర చక్కగా అరెంజ్ చేశారు. వచ్చినవాళ్లని చక్కగా రిసీవ్ చేసుకొనేటట్లు చేసుకున్నారు. పెళ్లయిపోయింది. వధూవరులను ఆశీర్వదించి బంధువులు తాము తెచ్చిన బహుమతులను అందరూ చదివించారు.
భోజనాల కార్యక్రమం అయిపోగానే మేం వెళ్లాలి అని వచ్చిన బంధువులు ఒక్కక్కరే తొందరపెట్టసాగారు. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నా ఆ హడావుడిలో కొందరికి తాంబూలాలు మిస్ అయినాయి. కొంతమందికి వస్త్రాలు ఇవ్వలేకపోయారు.
పెద్దాడపడుచు వదినకి సహాయం చేస్తూ తనకు సెలక్ట్ చేసిపెట్టిన ప్యాకెట్ చూసింది. ఆసక్తిగా ఓపెన్ చేసి చూసింది. వాళ్ల అత్తగారికి, మామ గారికి, భర్తకు, పిల్లలకూ, తనకూ వస్త్రాలు ఒకే కవర్లో ప్యాక్ చేసి పేర్లు రాసి పెట్టి ఉన్నాయి. ఆ వస్త్రాలు చూడగానే వాటి రేటును చూసింది రత్న. అది చూడగానే ఆమె మొహం మాడిపోయింది. నాగుబాములా బుసకొట్టింది.
ఏంటి వదినా ఈ వస్త్రాలు. ఇంత చీప్‌గా ఉన్నాయి. ఇవి తీసుకొని నేను మా అత్తగారింటికి వెళ్లానంటే అందరూ నన్ను నీచంగా చూస్తారు. పెళ్లికి ఎగేసుకొని వెళ్లావు. ఖరీదైన బహుమతులు ఇచ్చావు. ఇదా నువ్వు తెచ్చుకొన్నదని ఈసడిస్తారు. అయినా ఎవరివి సెలక్ట్ చేసింది. ఛండాలంగా ఉంది అరుస్తూ అంది రత్న.
అరుణకు పరువు పోయినంత పనయ్యింది. రత్నా అరవొద్దు. ఆ చీర నీకు నచ్చకపోతే వేరేది సెలెక్ట్ చేసుకుందువులే అయినా నువ్వు కూడా తొందరపడితే ఎలా. కొంచెం హడావుడి తగ్గని అని శాంతపరిచింది. రత్న నసుక్కుంటూ వెళ్లిపోయింది. అరుణ అక్కచెల్లెళ్లు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అందరికీ ఒకేరకమైనవి పెట్టారని కుతకుతలాడిపోతున్నారు.
పెళ్లిరోజు సాయంత్రం అందరూ ఊరెళ్లగానే కొంచెం టైమ్ చిక్కింది. రత్న మళ్లీ వాదన పెట్టుకుంది.
ఏందన్నా ఈ చీరలు. మా అత్తగారు ఇంట్లో కట్టుకునే చీరలు కూడా నాలుగువేల రూపాయలకు తగ్గవు. మీరు పెట్టిన ఈ పసుపుకుంకాలు ఆమెకి ఇస్తే నన్ను చీప్‌గా చూస్తారు. ఒకళ్లకి పెట్టేటప్పుడు వారి హోదాకు సరిపోయేటట్లుగా పెట్టాలి. లేకపోతే పెట్టకుండా ఉంటేనే నయం తేల్చిపారేసింది రత్న.
అరుణకు మతిపోయింది. కానీ రత్నకు ఎలాగైనా మంచి చెప్పాలని అనిపించింది.
రత్నా నేను చెప్పేది విను. తరువాత నీ వాదన వినిపించు. నేను, మీ అన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పిల్లల చదువులకు ఎవరి సహాయం తీసుకోకుండా చెప్పించాము. కుటుంబ బాధ్యతలు కూడా ఏ రోజూ మర్చిపోలేదు. వచ్చిన వారికి మర్యాదలు చేస్తూనే ఉన్నాము.
ఆడపిల్ల పెళ్లంటే మాటలా చెప్పు. ఇంతపెద్ద కార్యక్రమంలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరగవచ్చు. నువ్వు అడగావచ్చు. కానీ నలుగురిలో గొడవ చేసుకోవడం బాగుందా?
మా తాహతుకు తగినట్లుగా మేము వచ్చినవాళ్లకి ఒకేరకంగా మర్యాదలు చేసాము. వచ్చిన వాళ్లకు వాళ్ల హోదాకు తగినట్లు పెట్టుపోతలు చేయాలంటే ఎవరికైనా కుదురుతుందా. ఫంక్షన్‌లో ఒకరిని ఒకరకంగా, ఇంకొకరిని ఒకరకంగా చూస్తే బాగుంటుందా. కార్యక్రమం నిర్వహించే వాళ్లకి ఖర్చులుంటాయి. అతిథులుగా వచ్చేవారు వారి తాహతుకు సరిపోయేటట్లు వారు ఖర్చు పెట్టవచ్చు. కానీ వారు ఖర్చుపెట్టిన స్థాయిలోనే పెట్టుపోతలు కూడా ఉండాలని ఆశించడం తప్పు. విలువైన బహుమతులు తెచ్చినవారికి ఘనంగా, తేలేని వారికి మామూలుగా మార్యదలు చేయలేం కదు. ఆహ్వానింపబడిన వారందరూ నా దృష్టిలో ఒకటే.
అయినా పసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు హెచ్చుతగ్గులేంటి. వాటికి విలువ కట్టడం కుదురుతుందా? ఎవరు ఏమిచ్చినా సంతోషంగా తీసుకోవాలి. ఇచ్చినవారికి సంతోషం కలిగించాలి. అప్పుడే ఆ కార్యక్రమానికి అందం ఉంటుంది. నువ్వు పదివేలు ఖర్చుపెట్టావని అంతకుమించి నీకు ఖర్చుపెట్టాలని భావించడం తప్పు. నీకు స్థోమత ఉంది కాబట్టి ఖర్చుపెట్టగలవు. నాకు అంత శక్తి లేదు కాబట్టి నేను ఖర్చు పెట్టలేను. నేను చెప్పిన దాంట్లో సూక్ష్మాన్ని గ్రహించు. నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. నువ్వు బాధపడితే నేను చూడలేను. దయచేసి పరిస్థితి అర్ధం చేసుకో. నువ్వు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కోడలుగా వెళ్లినదానివి మా పరువు వాళ్ల దగ్గర తీయకూడదు కదా అరుణ రత్నని బుజ్జగించింది.
రత్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వదినా నన్ను క్షమించు. నువ్వు చెప్పింది నాకు అర్ధమైంది. మా అత్తగారికి కూడా అదే చెప్తాను. ప్రతీ వాళ్లు పుట్టింటి వాళ్లు ఇచ్చే పసుపు కుంకుమలను సంతోషంగా తీసుకోవాలి. అంతేకానీ వాటి విలువని రూపాయల్లో లెక్క వేయకూడదు. నాకు శక్తి వుంటే నేను పెట్టేవారికి అది చూపాలి కానీ నాకు ఆ రేంజ్‌లో పెట్టాలని అనుకోకూడదు. నా అవివేకానికి మన్నించు వదినా అని నిజాయితీగా అనింది రత్న.
అప్పగింతల టైమ్ దగ్గర పడుతోంది పద రత్నా అని అనింది అరుణ. తేలికపడిన మనసులతో ఇద్దరూ పనులు పంచుకోవడానికి తయారయ్యారు.

- ఎ.రేవతి
, వెంకటాచలం
చరవాణి : 707452344

పుస్తక సమీక్ష

నీతి సుధలూరే శతకం

ప్రతులకు
బాలచంద్ర పప్పు, 8/569, యోగా నివాస్, రంగనాయకులపేట, నెల్లూరు.
చరవాణి : 9866140700

కవి తన మనస్సులోని భావాలను అక్షరీకరణ చేసే ప్రయత్నమే కవిత్వం. అది కవిత కావచ్చు. కథ కావచ్చు. కథానిక కావచ్చు. గేయం కావచ్చు. దానికి ఏపేరుపెట్టుకున్నా సరే అది కవి ఆలోచనలకు ప్రతిరూపం అనొచ్చు. పప్పు బాలచంద్రగారు తన మనస్సులో మెదిలిన ఆలోచనలతో సమాజానికి ఏదో చెప్పాలని తపన కన్పిస్తోంది. అది కూడా నీతి వాక్యాల్లా చెప్పే ప్రయత్నంలో విజయం సాధించారనే చెపొచ్చు. ఒక మకుటం చేరి రచించిన శతకమే నీతి సుధాశతకం. శతకం అంటే ఇందులో వంద పద్యాల్లాటివి ఉంటాయన్న మాట (పద్యాల్లాంటివి అని ఎందుకన్నానంటే పద్యాలకు చంధస్సు తప్పనిసరి కాని నీతిసుధా శతకంలోని రచయత ప్రయత్నానికి ఒక మకుటంతో చంధస్సులో బిగించబడని ఐదు పద సమూహాలు కాబట్టి వాటిని పద్యాల్లాంటివనే చెప్పాలి) ఈవిషయానే్న రచయిత ముందుమాటలో చెప్పుకున్నారు కూడా. మతి కలిగి మసలుకో మానవా అనే మకుటాన్ని జతచేసి ఐదు పంక్తులుంటేలా లోకంలో జరిగే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి చక్కని సందేశాన్ని తన రచన ద్వారా సులభ శైలిలో లోకానికి అందించారు బాలుగారు. రచయిత సమాజాన్ని చదివి తన మదనిలో భావాలకు చక్కటి రూపాన్ని ఇచ్చారు.
*** *** *** ***
వంద గీతాలున్నా దేనికి అదే ప్రత్యేకతతో కూడి ఉన్నాయి. అందులో ఆణిముత్యాల్లాంటివి కొన్ని చదవగానే మనస్సుకు హత్తుకునేవి కొన్ని ఉన్నాయి.
ఎగుడుదిగుడు లేని రహదారులుంటాయా/ కలిమిలేములు ఒకచోటే కలకాలం ఉంటాయా/ కష్టసుఖాలులేని కాపురాలుంటాయి
ఎండలతో కరవులు రావు/వానలతో కాటకాలు పోవు/ఎండయినా వానయినా సకాలంలో రావాలి/పిన్నలయినా పెద్దలయినా ప్రవర్తన బాగుండాలి
గెలుపు గర్వాన్నిస్తుంది/ఓటమి ఓరిమినిస్తుంది/ అహం అజ్ఞానాన్నిస్తుంది/ వినయం ప్రకాశిస్తుంది
కొండంత చదివినా గంపెడు విజ్ఞానం అబ్బదు/గంపెడు విజ్ఞానంతోనే గోరంత జ్ఞానం ఉదయించదు/సాధనతో మనస్సు మధించు, అజ్ఞాన తిమిరం అంతరించు

దొరకనిదాని కొరకు దేవులాడక
చెంతఉన్నదానితో సంతృప్తి చెందు
బయట ఎంతగాలి వీచినా
గుండెలోకి పీల్చుగాలే బ్రతికించేది

అనుమానించి చూస్తే అంతా అనుమానమే
నిదానించి చూస్తే అంతా నిజమే
రాళ్లలోనూ నీళ్లుంటాయి
రాతిగుండెలోనూ కన్నీళ్లుంటాయి
చూడగలిగే కన్నుండాలి అంతే
అంటూ హృదయాన్ని కదిలించారు.

నలుగురితో పంచుకోని ఆనందం ఎందుకు/నలుగురికి పంచలేని విజ్ఞానం ఎందుకు/నలుగురికి పెట్టలేని ఐశ్వర్యంఎందుకు/నలుగురినైనా సంపాదించుకోలనని బ్రతుకెందుకు

అడగందే చెప్పకు, కోరనిదే ఇవ్వకు/చెప్పనిదే చేయకు,పిలువనిదే వెళ్లకు/ అలుసవుతావు అభాసుపాలవుతావు
అని తెలిసిన విషయానే్న చక్కగా చెప్పారు.
నమ్మకం, ఆత్మవిశ్వాసం, అహంభావం అనే పదాలకు నిర్వచించే విధానం ఎంతో బాగుంది.
నీతి శతకం పుస్తకం పేజీ తిరగేయగానే వైద్య మిత్రులు నారాయణరావు, రాజారాం ఫొటోలు చూడగానే నాకు పాత జ్ఞాపకాలు కళ్లముందు కదలాడాయి. అది 1994లో అనుకుంటాను... శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ రాజమండ్రిలో నెల్లాళ్లపాటు గోదా ప్రవచనాలు చేస్తున్నప్పుడు ఆ సభ నిర్వహణ బాధ్యతను నలుగురు డాక్టర్లు భుజస్కందాలపై మోసి అభినందనీయులయ్యారు. ఆ సభ విశేషాలను ఎప్పటికప్పుడు ఆంధ్రభూమి ద్వారా పాఠకులకు అందించే అవకాశం నాకు కలిగింది. ఆనాటి జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు మెదిలేలా చేసిన రచయిత అభినందనీయుడు.
- గౌతమి
9347109377

స్పందన

కథ బాగుంది
గతవారం మెరుపులో ప్రచురించిన మన ఊరి బిచ్చగాడు కథ చాలా బాగుంది. కథను సాదాసీదాగా ప్రారంభించి చివర్లో అతను బిచ్చగాడు కాదు గొప్ప కోటీశ్వరుడు అనే ట్విస్టు బాగుంది. నిజంగా ప్రతి ఒక్క కోటిశ్వరుడు ఆరంబడాలకు పోకుండా ఒక్కొక్క ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తే అంతకంటే ఏం కావాలి. కానీ నేడు అర్ధరూపాయి చేసి వంద రూపాయల పబ్లిసిటీ ఇచ్చే వాళ్లే ఎక్కువగా వున్నారు. కథలో గొప్ప సందేశాన్ని చొప్పించిన రచయిత కటారి రామయ్య గారికి అభినందనలు.
- చెంచయ్య సగ్గు, ఆత్మకూరు
- సదానందంగౌడ్, చిత్తూరు

కరివేపనే కవిత సూపర్
కరివేపనే కవిత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ప్రతి పదం గొప్పగా వుంది. అప్పట్లో మహిళ.. ఇప్పట్లో మహిళ గురించి పోలిక బాగుంది. మహిళలకు మనం ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేం. వారి సేవకు వెలకట్టలేం. అయినా వారిని చిన్నచూపే చూస్తున్నాం అంటూ రచయిత ఉమామహేశ్వరశర్మ గారు గొప్ప కవితను అందించారు. ధన్యవాదములు.
- లలితాంబ హెబ్బాల్, తిరుచానూరు
- తాండ్ర లక్ష్మీబాయి, బొమ్మలసెంటర్, పర్చూరు
- అయితా అనితానాయుడు, రేబాల, బుచ్చి

మహిళా మేలుకొలుపు
మహిళా మేలుకొలుపు అంటూ మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ మన చట్టాలను మార్పు చేసి మహిళలకు అండగా నిలవాలనే సందేశంతో మంచి కవితను అందించిన రచయిత హస్తి మోహన్‌రాజు గారికి అభినందనలు.
- సుమలత, నెల్లూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...

నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

దేవుడికి ఒక ఉత్తరం
భగవంతుడా!
మనుషుల్ని నీ రెక్కలకిందనే ఉండనివ్వు
ధనంకన్నా బంగారంకన్నా ఎంతో
విలువయినదీ గొప్పదయినదీ
పరిమళించే మానవత్వమేనని
వాళ్లకి అర్ధమయ్యేటట్లు చేయి
పక్కవాడి కన్నీళ్లు తుడిచి తిన్నాడో లేదో అని
వాడి ఆకలిని గమనించగల్గిన దయని
వీళ్ల హృదయాల్లోకి ఒంపు
ఒకడిని జయించి బానిసని చేయడం కంటే
ప్రేమించి అక్కున చేర్చుకోవడమే
గొప్పతనమని తెలిసేటట్లు చేయి
భగవంతుడా!
దేశదేశాలకీ
ఈ సరిహద్దు గోడలెందుకు
బాంబులూ, రాకెట్లూ, గన్నులూ
మనిషికి పట్టెడన్నం పెట్టి
ప్రేమగా నిలబెట్టలేవని
ఆలోచించే శక్తిని వీళ్లబుర్రలకివ్వు

మనుషుల మనసులకి విశాల గుణమిచ్చి
అందులో ప్రేమబీజాలు నాటి
వాటిని మహావృక్షాలు చేయి
నిర్భయ చట్టాల అవసరమే లేని
రాజ్యాన్ని నిర్మించి స్ర్తిలందరినీ
దేవతల్ని చేసి నిలబెట్టేసెయ్

జైళ్లలో మగ్గుతున్న బందీలందర్నీ
నాగలిపట్టే రైతులుగా మార్చేసి
ఈ భూమినంతా పచ్చగా చేసేయ్
వెట్టిచాకిరీలో మగ్గుతున్న పిల్లల్ని
అద్దం ముందు నిలబెట్టి అలంకరించి
వాళ్లకొక అందమైన పాఠశాలనివ్వు

భగవంతుడా!
ప్రతిమనిషి వీపు మీద
అనురాగపు మూటల్ని కట్టి
బ్రతికినంతకాలం సహనంతో
మోయమని ఆజ్ఞాపించు
నీకు వీలయితే మరోసారి
నువ్వు కూడా
మనుషుల్లో ఒకడిగా జన్మించు.

- షారోన్‌బేగం
సోమశిల, చరవాణి : 8985963150

ప్రేమ..అసూయ..
ఏది నీ గమ్యం!
ప్రేమ - ఒక దివ్యభావం - అమృతమయం
ప్రేమ - మనసుకు, దేహానికి - అతీతం
ప్రేమ - హృదయంలో జనించి
హృదయ కుహరంలో నివసిస్తుంది
ఎందరో మహనీయుల ప్రేమపూర్వక
దృక్కులతో - ఈ ధరిత్రి - పులకించి
ప్రేమలోని పావనరుచిని - చవిచూడగలిగింది
అలాంటి ప్రేమను - అందరితో పంచుకో!
అది పదింతలై - నిను, ఆలింగనం చేసుకుంటుంది
ఐశ్వర్యం - ఆరోగ్యం - నీదరిజేరి
నీ జీవితాన్ని - నిత్య వసంతం చేస్తుంది
ప్రేమవలనే - కరుణ అనే సువాసనా
భరితపుష్పం వికసించి మానవత్వాన్ని
గుబాళింపజేస్తుంది
చైతన్య భావధార నుండి వెలువడిన
పుణ్యపుష్పం ప్రేమ - ఈ పువ్వు, ఎన్నడూ
వాడదు - దీని, చిరునవ్వు, ఎప్పుడూ చెరగదు
ఇక హృదయం చుట్టూ పీచులాగా పట్టిన
అసూయను, తొలగించుకో - లేకుంటే అది
మృత్యుపాశమై నీ మెడకు చుట్టుకుంటుంది
సుఖశాంతులను నశింపచేస్తుంది
నీ జీవితాన్ని - సర్వనాశనం చేస్తుంది
మహనీయులు - మహాత్ములు
ఇదే మనకు చెప్పిన వేదసూక్తి
ఇది గుర్తెరికి ప్రేమ వైపు అడుగులు వేసి
నీ జీవితాన్ని - అమృతమయం చేసుకో!
మానవత్వాన్ని - పెంచుకో!
ఆధ్యాత్మికతను - అలవరచుకో!
ఆదర్శమానవుడిగా - సంస్కారవంతుడవై
దేవుని ఆశీస్సులు - పొందు
నీ జన్మను - ధన్యం చేసుకో!

- కొడవలూరు ప్రసాదరావు, గూడూరు
చరవాణి : 8500757622

వెలకట్టలేనివి
పురివిప్పిన మయూరి
మన మనసుకు
కల్గించె ఆనందం
మినుక్కు మినుక్కుమంటుండే తారామండలం కాంతులు
పసుపు దుప్పటిపరచినట్లుండే
పూల సోయగం
హరితహారంలా కనువిందు చేసే వనవృక్షాల ఠీవి
శే్వతాంభరం ధరించినట్లుగా
తోచే పొగమంచు
నీలివర్ణపు హోయలు చిందించే సాగరాలు
ఇన్ని అనుభూతులు ఎన్నో
మరెన్నో ఇంకెన్నో
అన్నిటికి వెలకట్టలేము కదా!
ప్రకృతికి వందనం చేయడం తప్ప..!

- ఎస్.వి.సుబ్బారావు
చరవాణి : 9441685812

మెరుపు కవులకు ఆహ్వానం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 28న ఒంగోలులోని శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి నిర్వహించే ‘‘శ్రీ హేవళంబి ఉగాది కవితా మహోత్సవం’’లో పాల్గొనేందుకు మెరుపు కవులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు కుర్రా ప్రసాద్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే కవులు ఉగాది ప్రాశస్త్యం లేదా ఏదేని సామాజికాంశంపై తమ కలాలను పదునెక్కించి 30 పంక్తుల్లో రాసిన కవితలను ఈనెల 26వ తేదీలోగా కుర్రాప్రసాద్‌బాబు, అధ్యక్షులు, శ్రీకృష్ణదేవరాయ సాహిత్య, సాంస్కృతిక సేవాసమితి, జయరాం ధియేటర్ సెంటర్, ఒంగోలు అను చిరునామాకు పంపాలని కోరారు. మొదటగా వచ్చిన 100 కవితలను పరిగణలోకి తీసుకోనున్నట్లు చెప్పారు. దూరప్రాంత కవులకు భోజనవసతి సదుపాయం కల్పించారు. పూర్తి వివరాలకు 9440660988 నెంబరులో సంప్రదించవచ్చు.పాల్గొన్న కవులను శాలువా, మెమెంటో, ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్లు చెప్పారు.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net
email: merupunlr@andhrabhoomi.net

- ఎ.రేవతి , వెంకటాచలం