శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గ్రామస్థుల సంరక్షణలో జింక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, మార్చి 25: కుక్కల దాడి నుంచి ఓ జింకను కాపాడిన సంఘటన శనివారం కోట మండలం ఉత్తమనెల్లూరు పంచాయతీ పరిధిలోని తాటిగుంటచెరువు గ్రామంలో జరిగింది. గ్రామ సమీపంలో వున్న రొయ్యలగుంట వద్ద దాహార్తిని తీర్చుకునేందుకు ఒక జింక రాగా దానిని కుక్కలు వెంబడించాయి. దీంతో అటుగా వెళ్తున్న బ్రహ్మయ్య అనే వ్యక్తి కుక్కలను తరిమి జింక ప్రాణాలు రక్షించాడు. అంతేకాకుండా వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు జింకను తీసుకెళ్లారు.

సరిహద్దులో యువకుడి హత్య
భార్య కళ్లెదుటే దారుణం
తడ, మార్చి 25: ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పన్నంగాడు వద్ద శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తమిళనాడుకు చెందిన వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు ప్రాంతంలోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూండి తాలూకా ఎళావూరు వద్దనున్న తేరాపాలెం గ్రామానికి చెందిన ఎస్ పన్నీరు సెల్వం (35) భార్య రాజేశ్వరితో కలసి పన్నంగాడులోని ఆంజనేయస్వామి ఆలయానికి మోటార్‌సైకిల్‌పై వచ్చారు. అనంతరం వారు తిరిగి వెళుతుండగా ఆరుగురు యువకులు రెండు మోటార్‌బైక్‌లపై వచ్చి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో భార్యాభర్తలు కింద పడిపోగా వేటకొడవళ్లతో పన్నీరు సెల్వాన్ని తరిమితరిమి హత్య చేశారు. అతడి భార్య కళ్లెదుటే సెల్వంను నరికి చంపడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. పన్నీరు సెల్వం బంధువులు, ప్రజలు అధిక సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆంధ్రా, తమిళనాడుకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన భార్య రాజేశ్వరి వద్ద వివరాలు సేకరించి ఆమెను చికిత్స కోసం తమిళనాడులోని గుమ్మడిపూండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో కొద్దిసేపు హత్య జరిగిన ప్రదేశం ఏ ప్రాంతానికి చెందినదని సరిహద్దు సమస్య తలెత్తడంతో రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన ప్రదేశం ఆంధ్రా ప్రాంతానికి చెందిన పన్నంగాడుగా తహశీల్దార్ ఏడుకొండలు గుర్తించారు. ఈ ప్రదేశానికి గుమ్మడిపూండి డిఎస్పీ మాణిక్యవేలు, ఆరంబాకం సిఐ సుడలైమణి, ఎస్సై చంద్రశేఖర్, సూళ్లూరుపేట సిఐ విజయకృష్ణ, తడ ఎస్సై సురేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో దుండగులు ఉపయోగించిన వేటకొడవళ్లు పోలీసులకు లభ్యమయ్యాయి. ఒక్కసారిగా ఆరుగురు వ్యక్తులు మోటార్‌బైక్‌లపై వచ్చి భార్యాభర్తలను ఢీకొని నరికి చంపడం ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తింది.
పాతకక్షలే హత్యకు కారణమా?
ఈనెల 21న గుమ్మడిపూండికి చెందిన రౌడీషీటర్ దినకుమార్‌ను గుమ్మిడిపూండిలోని షిప్‌కార్ట్ పరిసర ప్రాంతాల్లో హత్య చేశారు. దినకుమార్ హత్యలో పన్నీరు సెల్వం హస్తమున్నట్టు అనుమానించి హత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ సంఘటనతో మరలా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని తమిళ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు సమాచారం.

టెన్త్ సైన్సు-1 ప్రశ్నాపత్రం లీకైనట్టు ప్రచారం
తడ, మార్చి 25: తడ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి సైన్సు-1 ప్రశ్నాపత్రం లీకైనట్టు మీడియా ద్వారా ప్రచారం జరగడంతో తడలో పెద్ద దుమారం రేగింది. ఈ సందర్భంగా తడలోని పాఠశాల వద్ద ప్రశ్నాపత్రం లీకైందన్న అనుమానంతో పోలీసులు, పాత్రికేయులు అక్కడకు చేరుకొన్నారు. తీరా అక్కడ అలాంటి సంఘటన ఏమీ జరగలేదంటూ ఇన్విజిలేటరు సిహెచ్ నరసింహన్ తెలిపారు. వాస్తవానికి ఇలాంటి సంఘటన జరగకపోయినా మీడియాలో ఈ వార్తలు రావడంతో తడలో హల్‌చల్ మొదలైంది. కడప జిల్లాలో ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. ఈనేపథ్యంలో తడ ఎస్సై కూడా దీనిపై విచారణ చేపడుతున్నట్టు సమాచారం.

పాస్ పుస్తకాలకు ఇక్కట్లు
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు
చేయి తడిపితే పది రోజుల్లోనే మంజూరు

నెల్లూరు మార్చి 25: జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులు రెవెన్యూ అధికారులు, మీసేవా కార్యాలయాల చుట్టూ పాస్ పుస్తకాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి వారం కనీసం 800 నుంచి వెయ్యి దరఖాస్తులు పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించినవే. వీటి పరిష్కారం వందకు 54 మాత్రమే ఉంటుంది. ఎక్కువగా పాస్ పుస్తకాల జారీలో క్షేత్రస్థాయిలో రెవిన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతుండడం పరిపాటైంది. భూమిపై హక్కు ఉండాలంటే రైతులకు పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరి. రుణం రావాలన్నా, లావాదేవీలు జరపాలన్నా, తమ హక్కు పొందాలన్నా పాసు పుస్తకం లేనిదే ఏ పనీ జరగదు. వీటిని మంజూరు చేయడంలో రెవెన్యూ అధికారులు రైతులను పదేపదే తిప్పుతున్నారు. సాంకేతిక సమస్యలు, అధికారులు అందుబాటులో లేకపోవడం, చేతివాటం ప్రదర్శిస్తుండడం వంటి కారణాలతో అడుగడుగునా ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. వాటిలో నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి, నాయుడుపేట డివిజన్‌ల వారీగా పరిశీలిస్తే ఆత్మకూరు డివిజన్‌లో అత్యధికంగా దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. మర్రిపాడు, ఉదయగిరి, అనంతసాగరం, ఎఎస్ పేట, ఆత్మకూరు మండలాల్లో అత్యధికంగా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. చిన్నపాటి కారణాలు చూపి తిరస్కరించడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. నెల్లూరు డివిజన్‌లోని నెల్లూరు, రూరల్, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ముత్తుకూరు, ప్రాంతాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. గూడూరు డివిజన్‌లో ఓజిలి, చిల్లకూరు తదితర మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కావలి డివిజన్ పరిధిలో పట్టాదారు పాసు పుస్తకాలు విషయంలో అనేక మండలాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దగదర్తి, అల్లూరు, కావలి రూరల్, వరికుంటపాడు, జలదంకి, బిట్రగుంట మండలాలు ఉన్నాయి. నాయుడుపేట డివిజన్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి మండలంలోను వారం వారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో వీటి కోసమే అధికంగా అర్జీలు వస్తున్నాయి. రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మంజూరు చేయాల్సి ఉండగా కొంత ధర నిర్ణయించుకొని ఎటువంటి పరిష్కారం లేకుండానే ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వలేని రైతుల దరఖాస్తులు ఏడాదైన ఆమోదం కావడంలేదు.
మంజూరులో ఇవి కీలక దశలు
పట్టాదారు పాసు పుస్తకం కావాలంటే రైతులు ముందుగా మీసేవా కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. పరిశీలన తరువాత 15 నుంచి 25 రోజుల్లో అందిస్తారు. దరఖాస్తు మొదటిగా మీసేవ నుంచి సంబంధిత విఆర్‌ఓకు, అక్కడి నుంచి తహశీల్దారు కార్యాలయానికి చేరుతుంది. తహశీల్దారు ప్రాథమిక ఆమోదం తరువాత మండల ఆర్‌ఐ స్థానిక విఆర్‌ఓలు బృందంగా భూమిని పరిశీలించి ఆమోదించాలి. అనంతరం ఈ దరఖాస్తు మరల తహశీల్దారు వద్దకు వస్తుంది. గతంలో తహశీల్దారు డిజిటల్ సంతకంతో పాసు పుస్తకం వచ్చేది. గడిచిన రెండు నెలలుగా తహశీల్దార్లు నేరుగా పరిశీలించి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు చూసుకొని సంతకం చేయాల్సి వస్తోంది. వారు ఇతర పనులను సాకుగా చూపి అనుమతిలో జాప్యం చేస్తున్నారు. ఇదే క్రమంలో భూమి పరిశీలన సమయంలో రైతులకు చిక్కులు తప్పడంలేదు. విఆర్‌ఓలు, ఆర్‌ఐలు పరిశీలనలో ఏవేవో సాకులు చూపుతూ తిరస్కరిస్తున్న ఉదంతాలు ఎక్కువగా ఉంటున్నాయి. పాస్ పుస్తకం మంజూరులో కీలకమైన ఈ దశను దాటడమే రైతులకు కష్టంగా మారింది. పెద్ద రైతులైతే అధికారులకు చేయి తడిపి పనులు చేయించుకొంటున్నారు. ఇచ్చుకోలేని రైతులకు పుస్తకాలు అందడంలేదు. తిరస్కరణకు గురైన వాటిలో 70 నుంచి 80 శాతం ఈ కారణంతోనే ఉంటున్నాయి. ఎకరానికి కొంత విలువ నిర్థారిస్తూ పాసు పుస్తకాలు మంజూరు చేస్తున్నారు. ఈ దశలోనే పలువురు ఎసిబికి చిక్కి జైలుపాలైన సంఘటనలు ఉన్నాయి.

అభివృద్ధి పేరుతో నిధులు
దుర్వినియోగం చేస్తారా?
వైకాపా కౌన్సిలర్ ఎల్లసిరి ధ్వజం
గూడూరు, మార్చి 25: అభివృద్థి పనుల పేరుతో పురపాలక సంఘానికి మంజూరైన నిధులను దుర్వినియోగం చేస్తారా అని వైకాపా కౌన్సిలర్ ఎల్లసిరి గోపాల్‌రెడ్డి నిలదీశారు. శనివారం పురపాలక సంఘ కార్యాలయంలో చైర్‌పర్సన్ పి దేవసేన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పట్టణంలో పలుచోట్ల మురుగుకాలువల నిర్మాణం చేపట్టి ఉండగా తాజాగా వాటిని పగులగొట్టి తిరిగి ఆదే స్థానంలో మురుగుకాలువలు నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులను నిలదీశారు. ఈ నిధులను మరో కార్యక్రమానికి వినియోగిస్తే సద్వినియోగపడేది కదా అని ఆయన అన్నారు. మున్సిపల్ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా ఇష్టారీతిన వ్యవహరించడం మంచిది కాదన్నారు.