శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

‘నుడా’ సుడి ఎవరికో...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 28: నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నియామక ప్రక్రియలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. నుడా ఏర్పాటులో భాగంగా వైస్ చైర్మన్‌ను కూడా ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ ఓయస్డీగా ఉన్న చల్లా పెంచలరెడ్డిని నుడా వైస్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించగా శుక్రవారం ఆయన బాధ్యతలు తీసుకోవడం కూడా పూర్తయింది. ఇక చైర్మన్, ఇతర కార్యవర్గం ఎంపిక మాత్రమే మిగిలి ఉంది. ఈ పదవి కోసం నగరం నుంచి పలువురు ఆశావహులు బరిలో నిలిచారు. ఎలాగైనా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి తమ పేరు పరిశీలించాలని అధినేత చంద్రబాబునాయుడికి జిల్లా మంత్రులు, పార్టీ పెద్దల ద్వారా ప్రయత్నిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ పోటీలో నిన్నటిదాకా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది. అయితే తాజాగా కార్పొరేషన్ టిడిపి ఫ్లోర్ లీడర్ డాక్టర్ జెడ్.శివప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో టిడిపి మేయర్ అభ్యర్థిగా పోటీచేసి తాను గెలిచినప్పటికీ పార్టీకి ఎక్కువ స్థానాలు రాకపోవడంతో ఆయన మేయర్ కాలేకపోయారు. ఆర్థికంగానూ ఆ సమయంలో ఆయన ఎక్కువ నష్టపోయారు. దీంతో పార్టీ అధికారంలోకి రావడం, మేయర్ అబ్దుల్ అజీజ్ టిడిపిలో చేరడంతో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినప్పటికీ ఆయన ప్రాధాన్యత కార్పొరేషన్‌లో తగ్గిందనే చెప్పాలి. పార్టీలో మొదట్నుంచి ఉంటూ ఎంతో నమ్మకమైన కార్యకర్తగా పేరుండటం, ఆయనకు రాజకీయ గురువులాంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి రావడంతో తిరిగి శివప్రసాద్‌కు మంచి రోజులు వచ్చాయని, నుడా చైర్మన్ పదవి ఆయనకు రావచ్చనే గుసగుసలు ప్రస్తుతం పార్టీ ఆఫీసులోను వినిపిస్తున్నాయి. ఇదే స్థానం కోసం పార్టీలో సీనియర్ మహిళా నేత, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనూరాధ, టిడిపి నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు నియోజకవర్గ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డిలు కూడా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోటంరెడ్డికి బాలకృష్ణ ఆశీస్సులున్నాయని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నగరంలో ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఆయన సొంతమని, ఆయనకు తప్పక ప్రాధాన్యత ఇస్తారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. నందమూరి వంశ విధేయులైనప్పటికీ చంద్రబాబు వద్ద కూడా మంచి పేరు ఉన్న తాళ్లపాక అనూరాధకు కొన్ని పదవులు ఇచ్చినప్పటికీ ఆమె గతంలో తిరస్కరించడం జరిగింది. తనకు ప్రాధాన్యమున్న నుడా చైర్మన్ వంటి పోస్టు ఆమె కోరుతున్నారు. అదే విధంగా సోమిరెడ్డికి సన్నిహితుడిగా పేరున్న పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి కోవూరు కూడా నుడాలో కలిపి ఉండటంతో తన పేరు పరిశీలించాలని, గతంలో కోవూరు ఎమ్మెల్యే అవకాశాన్ని పార్టీ మాటకు శిరసావహించి తప్పుకున్న సంగతులను ఆయన గుర్తు చేస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన దారిలో వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు నేతల చుట్టూ తిరగడానికి మాత్రమే పరిమితం కాకుండా అమరావతిలోనూ తమకు పరిచయమున్న సీనియర్ నేతల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ పేరు చైర్మన్ పోస్టుపై ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. నుడా చైర్మన్ పదవిని మేనెల మొదటి వారంలో భర్తీ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను నిర్విరామంగా చేస్తుండడం విశేషం. చూడాలి మరి.. అధినేత నుడా చైర్మన్ వరమాల ఎవరి మెడలో వేస్తారో, ఎవరికి రిక్తహస్తం అందిస్తారో..

కేంద్ర మంత్రుల సహకారంతో దుగరాజపట్నం ఓడ రేవు నిర్మాణం
* మంత్రి సోమిరెడ్డి వెల్లడి
గూడూరు, ఏప్రిల్ 28: కేంద్రంలో ఉన్న వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిలతో గూడూరు ప్రాంతంలోని దుగరాజపట్నం ఓడ రేవు నిర్మాణానికి 17వేల కోట్ల రూపాయలను ప్రకటించిన నేపధ్యంలో దీని నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన గూడూరు శాసన సభ్యులు పాశం సునీల్‌కుమార్ నివాసానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ పులికాట్ ముఖద్వారం పూడిక తీత పనులకు సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. గతంలో ప్రభుత్వం అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా జిల్లాలో 29 మండలాలను కరవు మండలాలుగా గుర్తించడం జరిగిందని, ప్రస్తుతం దానిని 42 మండలాలుగా గుర్తించి కరవు సహాయ పనులను కరవు మండలాల్లో విస్తత్రంగా చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సోమశిల జలాశయం నుండి త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు ఆయన తెలిపారు. తాను గూడూరుకు రావడం తన పుట్టినింటికి వచ్చినట్టు ఉందని, అధికారంలో ఉన్నా లేకున్నా నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, ప్రస్తుతం అధికారంలో ఉన్నా తాను ఎల్లప్పుడు గూడూరు నియోజకవర్గానికి అండదండలు అందిస్తానని సోమిరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని తెలియచేస్తూ చిన్నతనం నుండి సునీల్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి ఎన్నో పోరాటాలు చేశారని, కొన్ని అనివార్య కారణాల పార్టీ మారి తిరిగి స్వంత గూటికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్టీ పూర్వవైభవానికి నియోజకవర్గ ప్రజల అండదండలతో తిరుగులేదని నిరూపించేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
మంత్రి పదవి స్వీకరించి తొలిసారి గూడూరు పట్టణానికి విచ్చేసిన మంత్రి సోమిరెడ్డికి గూడూరు పట్టణ టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆయన ఎమ్మెల్యే గజమాలతో ఘనస్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. అనంతరం పలువురు నేతలు సోమిరెడ్డికి పుష్పగుచ్ఛాలు, బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి, తానంకి నానాజి, వేమారెడ్డి కుమారస్వామి రెడ్డి, గూడూరు టౌన్, రూరల్ మండల పార్టీల అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వరరాజు, నెలబల్లి భాస్కరరెడ్డి, పిట్టునాగరాజులున్నారు.
టిడిపికి పూర్వవైభవం తీసుకొని వస్తా
గూడూరు నియోజకవర్గానికి తిరిగి పూర్వవైభవం తీసుకొని వచ్చేందుకు మంత్రి సోమిరెడ్డి, నియోజకవర్గ టిడిపి నాయకులతో కలసి కృషి చేస్తానని గూడూరు శాసన సభ్యులు పాశం సునీల్‌కుమార్ అన్నారు. మంత్రితో కలసి విలేఖర్లతో మాట్లాడిన ఎమ్మెల్యే ఈరోజు నిజంగా తన జన్మధన్యమైందని, మంత్రి తన ఇంటికి రావడం తనకెంతో సంతోషంగా ఉందని, తాను పార్టీ మారినా టిడిపికి రావడం తన స్వంత ఇంటికి వచ్చినట్టు భావించానన్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సోమిరెడ్డి తనను పరామర్శించారని, అదీ ఆయనకున్న రాజనీతి అని కొనియాడారు. మంత్రి అండదండలతో గూడూరు నియోజకవర్గంలో టిడిపిని బలోపేతం చేసేందుకు అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలుపుకొని పని చేస్తానని, స్థానికుడైన తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పారు.

వీడిన హత్య కేసు
* హత్యకు దారితీసిన అక్రమ సంబంధం
* ప్రియుడితో కలిసి భార్య పన్నాగం
* ఐదుగురు నిందితుల అరెస్ట్
నెల్లూరు, ఏప్రిల్ 28: అక్రమ సంబంధమనేది రక్త సంబంధాన్ని కూడా తెంచుకునేలా చేస్తూ చివరకు జీవిత చరమాంకం వరకూ తోడుండాల్సిన బంధాల్ని కూడా తృణప్రాయంలా భావిస్తూ ఒకరి చావును మరొకరు కోరుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదో కోవలో తాళి కట్టిన భర్త కంటే ప్రియుడే ముఖ్యమని భావించిన ఓ యువతి చివరకు తన భర్త చావుకు కూడా తానే కారణమైంది. దగదర్తి మండల కేంద్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇటీవల సంచలనం రేపిన హత్య, ఆటో దగ్ధం కేసులో నిందితులను దగదర్తి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మృతుడి భార్య ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగినట్లు వారి విచారణలో వెల్లడైంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని శుక్రవారం స్థానిక ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. నగర పరిధిలోని చింతారెడ్డిపాలెంకు చెందిన మృతుడు తీగలపూడి నాగార్జున భార్య కామేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన ఊటుకూరు వినోద్‌కుమార్ అలియాస్ బుల్లెట్ బాబుకు కొంతకాలంగా అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం చుట్టుపక్కల వారి ద్వారా నాగార్జునకు తెలియడంతో అతనికి, కామేశ్వరికి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. నాగార్జున ఇదే విషయంలో వినోద్ తల్లి రజనమ్మతోనూ ఓ సందర్భంలో గొడవ పెట్టుకున్నాడు. దీంతో నాగార్జున ఉన్నంత కాలం తాము కలిసుండలేమని, ఎలాగైనా అతన్ని అంతమొందించాలని కామేశ్వరి, వినోద్‌లు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వినోద్ తల్లి రజనమ్మ కూడా సమర్థించడంతో అందరూ కలిసి నాగార్జునను హత్య చేయించాలని సిద్ధమయ్యారు. ఇందు కోసం దగదర్తి గ్రామానికి చెందిన వినోద్‌కుమార్ స్నేహితులు విజయ్, నవీన్‌లతో పాటు మరో బాలుడి సహాయం తీసుకొని వారికి లక్ష నగదు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. తమ పథకంలో భాగంగా ఈనెల 13న వారు ముగ్గురు నాగార్జున ఆటోను బాడుగకు మాట్లాడుకొని దగదర్తి మండలం కొత్తపల్లి కౌరుగుంట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నాగార్జునను మారణాయుధాలతో కొట్టి చంపివేసి, సాక్ష్యాలు రూపుమాపేందుకు నాగార్జున మృతదేహాన్ని ఆటోలో ఉంచి ఆటోతో సహా కాల్చివేశారు. ఈ కేసును ఛేదించే క్రమంలో పోలీసులకు వినోద్‌కుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటాడనే విషయం కూడా వెల్లడైంది. వినోద్, నవీన్‌లు కలిసి దాచి ఉంచిన 14 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు కారకులైన ఆరుగురు నిందితులను నెల్లూరు రూరల్ డిఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో బుచ్చిరెడ్డిపాలెం సిఐ మాధవరావు, దగదర్తి ఎస్సై తమ సిబ్బందితో కలిసి దగదర్తి మండలం మూర్తిరాజుసంఘం సమీపంలో జాతీయ రహదారి పక్కన శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన దగదర్తి ఎస్సై పి.విజయశ్రీనివాస్, సిబ్బంది టి. ఆదినారాయణ, ఎస్.సుబ్బయ్య, ఎన్.మోహన్, పి.రవికాంత్, ఎన్.పిచ్చిరెడ్డి, బి.వి.సుబ్బయ్య, పి.గోవర్ధన్, ఏ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.