శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వినడానికే విన్నపాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌కు పోటెత్తుతున్న అర్జీదారులు
* స్పందన అనూహ్యం.. ప్రతిస్పందన శూన్యం
నెల్లూరు, డిసెంబర్ 13: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం వారి వద్దకే వెళ్లి నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ డేలను నిర్వహిస్తోంది. గతంలో ఉన్న ప్రజల వద్దకు పాలన, జన్మభూమి తరహాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు భారీఎత్తున హాజరవుతూ తమ సమస్యలు పరిష్కరించి, అవసరాలు తీర్చాలని కోరుతూ దరఖాస్తులు అందజేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం కేవలం ఏదో ప్రజల వినతిపత్రాలు స్వీకరించి, ఏదో కాస్త ఊకదంపుడు ఉపన్యాసం ప్రజాప్రతినిధుల చేత ఇప్పించి మమ అనిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత నెల 18న కావలిలో ప్రారంభమైన ఈ ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమం ఇప్పటికీ జిల్లాలో పలు ప్రాంతాల్లోనూ, నెల్లూరు నగరంలోనూ కొనసాగుతోంది. అయితే వాస్తవంగా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లోనూ, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ ఈ విజ్ఞప్తుల దినం జరుగుతున్నప్పటికీ, ఈ ప్రత్యేక విజ్ఞప్తుల కార్యక్రమానికి కూడా ప్రజల తండోపతండాలుగా వస్తుండడం విశేషం. అయితే మండల అధికారులకు సోమవారం ఇస్తున్న అర్జీలకు పరిష్కారం దొరకకనే ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి అదే విజ్ఞప్తిని వారికి వినతిపత్రం రూపంలో అందిస్తుండడం గమనార్హం. కుప్పలుకుప్పలుగా అధికారులకు వినతిపత్రాలు అందుతున్నాయంటే ప్రజల సమస్యలు సోమవారం పరిష్కారానికి నోచుకోకపోవటమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎక్కువగా రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, పింఛన్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే రేషన్‌కార్డులను అక్కడికక్కడే మంజూరు చేసి ఆర్‌సి నెంబర్ ఇస్తామని తొలుత ప్రకటించిన జిల్లా యంత్రాంగం ప్రస్తుతం నెట్ సరిగా లేదంటూ, ఇతరత్రా కారణాలతో వాయిదా వేస్తోందని పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం పరిష్కరించక ఇలా ఎపుడో ఒకసారి జరిగే ప్రత్యేక కార్యక్రమంలోనూ పరిష్కరించకపోతే ప్రజలకు సమాధానం ఎలా చెప్పగలమని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వికలాంగుల సర్ట్ఫికేట్ల కోసం దరఖాస్తులు తీసుకుని మంగళవారం హెడ్‌క్వార్టర్ ఆసుపత్రికి రావాలని చెబుతున్నారని, అది ఎలాగూ ప్రతి వారం జరిగే కార్యక్రమమే కదా ఇక్కడ మాకు ఒరిగిందేమిటని దివ్యాంగులు అడిగే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం ఉండడం లేదు. అధికార పార్టీ ప్రభుత్వ ప్రచార వేదికగా ఈ ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌ను ఉపయోగించుకుంటున్నారని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఉపన్యాసాల తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించడం లేదని, కౌంటర్ల వద్ద దరఖాస్తుదారుల తిప్పలు పట్టించుకునే నాధుడే ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. మంత్రుల రాక కోసం హడావుడి చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ముత్తుకూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేతులమీదుగా నివేశన స్థల పట్టాలు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి అదే పట్టాలను లబ్ధిదారులకు అందచేసినట్లు వెలుగులోకి రావడంతో అధికారులు జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలను విన్నవించుకునే ఓపిక, శక్తి లేని వారి కోసం ఎంతో ఉన్నత ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విజ్ఞప్తుల కార్యక్రమాలు అర్హుల అవసరాలను తీర్చినపుడే వాటి ఏర్పాటు వెనక ఉన్న సదుద్దేశ్యం సత్ఫలితాలు ఇచ్చినట్లవుతుందనేది జిల్లావాసుల ఉవాచ.

జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు
* ఆర్‌జేడీ పరంధామయ్య వెల్లడి
వేదాయపాళెం, డిసెంబర్ 13: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో డిసెంబర్ నెలాఖరుకల్లా ఇంటర్‌బోర్డు సమన్వయంతో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్జేడీ పరంధామయ్య తెలిపారు. బుధవారం నగరంలోని జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి కార్యాలయంలో డీవీఈఓ భీమా వెంకయ్య ఆధ్యక్షతన జరిగిన ప్రిన్సిపాల్ సమావేశానికి ఆర్జేడీ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరంధామయ్య మాట్లాడుతూ అడకమిక్ క్యాలెండర్ ప్రకారం సకాలంలో సిలబస్ పూర్తిచేయాలన్నారు. త్రైమాసిక ఆర్థిక సంవత్సర పరీక్షలలో వెనుకబడి ఉన్న విద్యార్థులపై దృష్టిసారించి మార్చి నెలలో జరగబోవు పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టేవిధంగా కృషి చేయాలని ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. ఆర్‌ఐఓ బాబుజాకబ్ మాట్లాడుతూ జన్మభూమి పోర్టల్‌లో విద్యార్థుల ఆధార్ నెంబర్లను తప్పులు దొర్లకుండా నమోదు చేయాలని, ఉపకారవేతనాలు ప్రతి విద్యార్థి పొందేలా ప్రిన్సిపాల్స్ శ్రద్ధ వహించాలని సూచించారు. డీవీఈఓ భీమా వెంకయ్య మాట్లాడుతూ సీఎఫ్‌ఎంఎస్, నెంబర్ స్టేట్‌మెంట్‌లలోనూ కాంట్రాక్ట్ అధ్యాపకుల వివరాలను నమోదు చేయడంలో ప్రిన్సిపాల్స్ శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఉప వృత్తివిద్యాశాకాధికారి వివి శేషయ్య, జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి
* ఇన్‌చార్జ్ కలెక్టర్ ఇంతియాజ్ పిలుపు
వేదాయపాళెం, డిసెంబర్ 13: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పిలుపునిచ్చారు. బుధవారం జేసి ఛాంబర్‌లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా 50 భారీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన వౌలికసదుపాయాలు, అనుమతులు, భూమి సేకరణ త్వరగతిన సేకరించి పరిశ్రమలు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో వచ్చిన పరిశ్రమలకు సబ్సిడీలు మంజూరు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పారిశ్రామికవేత్తలు రవాణాకు సంబంధించిన వాహనాలకు దరఖాస్తు చేసుకొని రాయితీలు పొందారన్నారు. జిల్లాలో ఈనెల 15 నుంచి జనవరి 15 వరకు నియోజకవర్గ స్థాయిలో పారిశ్రామిక అవగాహన సదస్సులు జరపాలని ఈ సమావేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వివిధశాఖల అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ పారిశ్రామికవేత్తలు కొత్తగా ప్రారంభిస్తున్న వివిధ పరిశ్రమలకు అవసరమైన అనుమతులకు చేసుకున్న దరఖాస్తులను ఆయన సమీక్షించారు. వివిధ పారిశ్రామికవేత్తలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్న వానికి భూమి కేటాయించారు. ఆర్‌కె పాలిమర్సు, శ్రీ అమర్‌నాధ్ ఆగ్రోఫుడ్ ప్రాజెక్టులు, అనంతవరం గ్లోబర్ ఎలాయిస్ క్యాస్టింగ్స్, కెఎస్‌ఆర్ మాన్యుఫ్యాక్చర్స్, నాయుడుపేట, సిరామిక్ లైఫ్ సైనె్సస్, బొడ్డువారిపాళెం, కొడవలూరు మండలం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కొత్తగా ప్రారంభించినవి 10 మంది పారిశ్రామికవేత్తలకు ఎంఓయు అందచేశారు. దీనివల్ల దాదాపు రూ.46 కోట్లు పెట్టుబడి, 400 మందికి ఉపాధి లభించనున్నదని తెలిపారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు, ఏడి మురళి, వాణిజ్య పన్నుల అధికారి కృష్ణమోహన్‌రెడ్డి, ఏపీఎన్‌ఎఫ్‌సీ బీఎం శ్రీనివాసరావు, ఏపీపీసీబీ ఇఇ ప్రమోద్‌కుమార్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీహరి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ వి.సతీష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే ప్రజా విజ్ఞప్తుల దినం
* ఆర్డీవో శీనానాయక్ స్పష్టం
తడ, డిసెంబర్ 13: ప్రజా సమస్యల పరిష్కారానికే అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినానికి శ్రీకారం చుట్టారని నాయుడుపేట ఆర్డీవో వికె శీనానాయక్ అన్నారు. బుధవారం తడలో జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకొని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు కార్యాలయాలు చుట్టు తిరగకుండా అధికారులే మీ వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగమన్నారు. కొత్త రేషన్‌కార్డులు, అర్హులైన వారికి పింఛన్లు, దీపం పథకం కింద గ్యాస్‌లు అందజేసేందుకు ప్రత్యేక కౌంటర్లు పెట్టి వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరించామన్నారు. అర్జీలు అందజేసిన వారందరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈనెల 20వ తేదీలోగా అన్ని అర్జీలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి అర్హులైన వారందరికీ జనవరిలో రేషన్‌కార్డులు, పింఛన్లు, దీపం పథకం అందజేస్తామన్నారు. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు. తడ మండలంలో మొత్తం 1884 అర్జీలు ప్రజల నుంచి వచ్చాయన్నారు. ఇందులో కొత్త రేషన్‌కార్డులకు 711, దీపం కనెక్షన్లకు 56, రేషన్‌కార్డుల్లో చేర్పులకు 606, పింఛన్లకు 611 వచ్చాయన్నారు. డివిజన్ స్థాయిలో మొత్తం దాదాపు 10వేలు అర్జీలు వచ్చాయన్నారు. అనంతరం ప్రత్యేక కౌంటర్ల వద్ద ఆయన పరిశీలించి అక్కడున్న ప్రజలతో కాసేపు మాట్లాడి వారి సమస్యలడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఏడుకొండలు, ఎంపిడివో రమణయ్య, జడ్పీటిసి బొమ్మన్ శ్రీ్ధర్, టీడీపీ జిల్లా నాయకులు వేనాటి పరంధామరెడ్డి, కామిరెడ్డి మురళిరెడ్డి, కుదిరి రామకృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

నేదురుమల్లి ఇంట్లో మోటార్‌బైక్ చోరీ
వెంకటగిరి, డిసెంబర్ 13: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి నివాసంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు ప్రహరీగోడ దూకి లోపలికి ప్రవేశించారు. మీటింగ్ హాల్లో ఉన్న కుర్చీలను ఇంటి గోడ పక్కన ఎత్తుగా వేసుకొని పైకి ఎక్కి పైన ఉన్న గ్లాస్‌డోర్‌ను తీసేందుకు ప్రయత్నించారు. అది తెరుచుకోకపోవడంతో అర్థంకాని దొంగలు మళ్లీ కిందికి దిగారు. వచ్చిన దొంగలు ఖాళీ చేతులతో వెళ్లకుండా లోపల పార్కింగ్ చేసిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పీఏకి చెందిన మోటార్‌బైక్‌ను అపహరించారు. ఉదయం లేచిన రామ్‌కుమార్‌రెడ్డి పీఏ మోటార్‌బైక్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల చూడగా, బయట గేటుకు వేసిన తాళాలు పగలగొట్టి అక్కడే పడవేసి ఉండటాన్ని బట్టి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కొండపనాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని దొంగలు సంచరించిన తీరుని పరిశీలించారు. మధ్యాహ్నం నెల్లూరు నుంచి క్లూస్‌టీమ్ కూడా విచ్చేసి నేదురుమల్లి నివాసంలో దొంగలు సంచరించిన ప్రాంతంలో వేలిముద్రలు సేకరించారు. ఎస్‌ఐ కొండపనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే 29 సంవత్సరాలుగా నేదురుమల్లి నివాసంలో చిన్న కర్రపుల్ల కూడా పోలేదని, ఇప్పుడు అక్కడ ఉన్న మోటార్‌బైక్‌ను తీసుకెళ్లడం దారుణమని బీజేపీ నాయకులు ఎల్ కోటేశ్వరరావు అన్నారు.

డిపాజిట్‌దార్ల ఒత్తిడి
* ఆగిన అగ్రిగోల్డ్ ఏజెంట్ గుండె
మరణానికి దారితీసిన మనోవేదన
ఆత్మకూరు, డిసెంబర్ 13: ఆత్మకూరు పట్టణం బీసీ కాలనీ ప్రాంతానికి చెందిన వల్లెపువెంకట రమణయ్య (47) అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాకంతో మృతిచెందాడు. ఇతను ఆ సంస్థ తరపున ఏజెంట్‌గా చేరి స్థానికుల నుంచి పొదుపు మొత్తాలను సేకరించాడు. గడచిన మూడేళ్ల క్రితం మూతపడిన అగ్రిగోల్డ్ సంస్థతో ఇతని జీవితం గడ్డు పరిస్థితుల్లోకి చుట్టుముట్టింది. అప్పటివరకు ఎంతో సన్నిహితంగా మెలిగిన వారు సైతం నిన్ను చూసి, నువ్వు అడిగితేనే డబ్బు చెల్లించామంటూ సూటిపోటి మాటలతో ఒత్తిడి అధికం చేస్తూ వచ్చారు. అతనికి పరిచయస్తులందరి కుటుంబాల స్థితిగతులు ఎరిగిన వాడే కావడంతో ఒకరింట అత్యవసరానికి తన వ్యక్తిగత పైకాన్ని అప్పగించి అగ్రిగోల్డ్ నుంచి రాగానే తిరిగి తాను స్వీకరించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. సరిగ్గా ఇక్కడ చూపిన అతని ఔదార్యమే తన జీవితాన్ని మరణ మృదంగంలోకి నెట్టిందని చెప్పాలి. ఇలా ఒకర్ని చూసి మరొకరు పోటాపోటీగా తమ అవసరాలు చెప్తూ సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేయసాగారు. మొత్తం రూ.2 కోట్ల వరకు అతను డిపాజిట్లు చేయించి ఉండటంతో తన ఇల్లు, పొలం కూడా అమ్ముకుని అందరికీ చెల్లిస్తూ వచ్చినా ఆ మొత్తం అంతా ఏ మూలకూ సరిపోలేదు. దీంతో మిగిలిన డిపాజిటర్లు నిలదీస్తుండటంతో ఈక్రమంలో తీవ్ర మానసిక వేదనతో అనారోగ్యానికి దారితీసింది. స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందిన స్వస్థత చేకూరక చెన్నై నగరం వరకు వెళ్లారు. గత కొన్నాళ్లగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రమణయ్య దుర్మరణం పాలయ్యాడు. ఈవిధంగా ఎందరో అభాగ్యుల మరణాలకు కారణమైన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల్ని స్వాధీనపరచుకుని బాధితులకు నిష్పత్తి అనుసరించి పంపిణీ చేయడంలో న్యాయపరమైన అడ్డంకులు, పాలకుల మీనమేషాలు కొనసాగుతూనే ఉండటం బాధాకరమైన పరిణామం.

గూడూరును కమ్మేసిన పొగమంచు
గూడూరు, డిసెంబర్ 13: బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు గూడూరును కమ్మేయడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 9 గంటల సమయం వరకు కనీసం ఎదురెదురు వచ్చి పోయే వాహనాలు కనిపించకపోవడంతో వాహన చోదకులు సైతం పగటి పూట హెడ్‌లైట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే గూడూరు రైల్వే స్టేషన్‌లో కూడా దట్టమైన పొగమంచు కప్పేయడంతో పలు రైళ్ల వేగానికి కళ్లెం పడినట్లయింది. రైళ్లు సైతం లైట్లు వేసుకొని నడవాల్సిన పరిస్థితి నెలకొంది. తుపానులు వస్తాయి, తమ ఆశలు ఫలిస్తాయన్న ఆశతో ఉన్న డివిజన్ రైతాంగానికి బుధవారం కురిసిన మంచుతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే నారుమళ్లను సిద్ధం చేసుకొని దుక్కులు దున్ని నారేతలు వేస్తున్న రైతులకు ఇక వర్షాలు లేవని తెలిసి ఈ సారి పంటలు ఎలా దక్కించుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు.

‘విద్యార్థులకు మంచి ఆరోగ్య అలవాట్లు నేర్పించాలి’
మనుబోలు, డిసెంబర్ 13 : ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులకు మంచి ఆరోగ్య అలవాట్లను నేర్పించాలని రాష్ట్ర హైజన్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రైమరీ ప్రోగ్రాం అధికారి బద్రి నారాయణ ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక మండల వనరుల కేంద్రంలో మనుబోలు, వెంకటాచలం మండలాల్లోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మంచి ఆరోగ్య అలవాట్లను సులభరీతిలో అర్థం కావడానికి ఆటల రూపంలో విద్యాబోధన చేస్తారని తెలిపారు. చిన్నతనంలోనే మంచి ఆరోగ్య అలవాట్లు తీసుకుని రావడం వల్ల మంచి పౌరులుగా ఎదుగుతారన్నారు. చిన్నారులు మలవిసర్జనకు వెళ్లి వచ్చిన అనంతరం చేతులను సబ్బుతో కడగాలని సూచించారు. ఆహారం తీసుకునే సమయంలో తప్పనిసరిగా చేతులను శుభ్రపరచుకోవాలన్నారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల 80 శాతం వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పలు సర్వేలలో తేలిందన్నారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాలలో వెయ్యి ప్రాథమిక పాఠశాలలకు సీఎస్‌ఆర్ నిధులతో ప్రాథమిక పాఠశాలల్లో ఆరోగ్య విజ్ఞానానికి సంబంధించిన కిట్లను అందిస్తారని తెలిపారు. మనుబోలు మండలంలో 12 పాఠశాలలకు, వెంకటాచలం మండలంలో నాలుగు పాఠశాలలకు కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంఈఓ కొండయ్య, పలు ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు ఉన్నారు.

సైన్స్ అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం
* జిల్లా విద్యాశాఖాధికారి శ్యామ్యూల్ వెల్లడి
గూడూరు, డిసెంబర్ 13: దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ప్రధానంగా సైన్స్ బాగా అభివృద్ధి చెందాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ అన్నారు. బుధవారం గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా వైజ్ఞానిక సదస్సుకు ఆయన హాజరై సైన్స్‌ఫేర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గూడూరులో రెండురోజుల పాటు నిర్వహించే సైన్స్ ఫేర్, వచ్చే నెలలో జిల్లాలో రాష్టస్థ్రాయి సైన్స్ ఫేర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గడచిన 50 సంవత్సరాల కాలంలో అనేక సాంకేతిక విప్లవాల ద్వారా సైన్స్ అభివృద్ధి సాధించిందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యావ్యవస్థలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తి ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలు ఎంతైనా అవసరమన్నారు. సర్వశిక్షా అభియాన్ అధికారి విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు వారివారి ఆలోచనల ద్వారా వారు ప్రదర్శించే నమూనాలను భావితరాల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. జిల్లా సైన్స్‌ఫేర్ అధికారి రాధారాణి మాట్లాడుతూ సైన్స్ అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. అందువల్ల ప్రతి విద్యార్థి తాను సొంతంగా ఆలోచించి నూతన పరికరాలను, వస్తువులను కనిపెట్టి దేశానికి మార్గదర్శకం కావాలని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, మేధాశక్తి ఇటువంటి కార్యక్రమంలో బయటపడుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అనేక రకాల ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. వారు తయారు చేసిన నమూనాల గురించి విద్యార్థులు సందర్శకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి ఖాజా రహంతుల్లా, మున్సిపల్ కౌన్సిలర్లు పులిమి శ్రీనివాసులు, వాటంబేటి శివకుమార్, బిల్లు చెంచురామయ్య, మస్తానమ్మలతో పాటు కనుమూరు హరిచంద్రారెడ్డి, బి దశరథరామిరెడ్డి, కె మునిగిరీష్, పాఠశాల హెడ్మాస్టర్ రవూఫ్, మమత, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.