శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కార్యకర్తల సూచనతో అభ్యర్థిని ఎంపిక చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, నవంబర్ 18: నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తాము సూచించిన వ్యక్తిని ఎంపిక చేస్తే నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్ష కార్యక్రమం విజయవంతం చేయాలనే క్రమంలో రూరల్ నియోజకవర్గ టీడీపీ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కిలారి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎంతో బలంగా ఉందన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి కొత్తగా వచ్చిన వారితో పాటు పాతవారిని కూడా కలుపుకుపోవాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న వారిని పక్కన పెడుతున్నారనే ఆరోపణలున్నాయని, ఇది మంచి సంకేతం కాదన్నారు. అలాగే బీద రవిచంద్రను రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించాలని, ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి జిల్లా నాయకులు తీసుకెళ్లాలని కోరారు. ఆయన అభ్యర్థి అయితే గెలుపు సుసాధ్యమన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆదాల స్పందిస్తూ తాను కూడా బీద అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తానని హామీనిచ్చారు. సమావేశంలో కిలారి కాస్త భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారడం గమనార్హం.

సీఎం జిల్లా పర్యటన ఖరారు
* ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు * నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
నెల్లూరు, నవంబర్ 18: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. నగర శివార్లలోని ఎస్‌విజిఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభాస్థలి వద్ద ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అన్ని శాఖల అధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లను పటిష్ఠంగా నిర్వహించాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం బయల్దేరి వెళతారని, మరో 15, 20 రోజుల్లో తిరిగి జిల్లా పర్యటనకు విచ్చేసి సిజెఎఫ్‌ఎస్ భూముల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 50వేల మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన హెలిప్యాడ్, బహిరంగ సభకు సంబంధించిన వేదిక, అవసరమైన సౌకర్యాలను ప్రణాళికాబద్ధంగా ఎలాంటి సమస్యలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేదిక వద్దకు ప్రజలు క్రమపద్ధతిలో చేరుకునేందుకు అవసరమైన బారికేడ్లు, కుర్చీల ఏర్పాటు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. అలాగే ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున వారికి ప్రొటోకాల్ ప్రకారం అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చూడాలని సూచించారు. బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించే సమయంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలతో జాగ్రత్తగా ఉండాలని ట్రాన్స్‌కో అధికారులకు తెలిపారు. 20,21,22 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున రహదారుల్లో డ్రెయిన్స్ లేకుండా చూడాలని, ఒక్కరోజులో రాత్రిపూట ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గోతులు లేకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో కూడా దుకాణాలు తెరిచే ఉంచాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. శాఖలవారీగా అవసరమైన ఇష్యూల డేటాను సిద్ధంగా ఉంచుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద షామియానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఎక్కువగా వాటర్ బాటిల్స్‌తో పాటు ఆహారాన్ని సిద్ధంగా ఉంచాలన్నారు. 108 వాహనంలో ప్రొటోకాల్‌ను అనుసరించి కార్డియాలజీ డాక్టర్, వైద్యసిబ్బంది, రక్తాన్ని సిద్ధంగా ఉంచాలన్నారు. ఆర్ అండ్ బి, పినాకిని అతిథిగృహాలను సిద్ధం చేయాలని, జిల్లాలో ఉన్న సమస్యలపై రైతులు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్-2 కమలకుమారి, అదనపు ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, డిఆర్‌ఓ నాగేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర డిఎస్పీ మురళీకృష్ణ, ట్రాఫిక్ డిఎస్పీ పి.మల్లికార్జునరావు తెలిపారు. ఆదివారం నగర డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 20వ తేది ఎన్‌టీఆర్ నగర్ సమీపంలోని ఎస్‌విజిఎస్ కళాశాల ప్రాంగణంలో జరిగే ధర్మపోరాట దీక్షకు ముఖ్యమంత్రి హాజరవుతారని తెలిపారు. ఈ దీక్షకు కావలి, కోవూరు వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు ఎన్‌టీఆర్ నగర్ ఎదురుగా ఉన్న పద్మావతి గ్రీన్‌సిటీలో పార్క్ చేసుకోవాలన్నారు. కార్లు, జీపులు, ఆటోలు ఎన్‌టీఆర్ నగర్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న కంచర్ల లే అవుట్‌లో పార్క్ చేయాలన్నారు. గూడూరు వైపు వాహనాలు చింతారెడ్డిపాలెం వద్ద ఉన్న నారాయణ జూనియర్ కళాశాల వద్ద, నెల్లూరు నగరం నుండి వచ్చే కార్లు, బైక్‌లు, ఆటోలు దీక్షాస్థలి సమీపంలోని శ్రావణి ఆక్వానీడ్స్, జిఎస్‌ఆర్ కల్యాణ మండపాల వద్ద పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి పక్కనే ఉన్నందున రహదారిపై వచ్చే వాహనాలను 20వ తేదీన దారి మళ్లిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. చెన్నై వైపు నుండి వచ్చే వాహనాలను నగరంలోని మినీ బైపాస్ గుండా కోవూరు ఆర్టీసీ వర్క్‌షాపు సమీపంలో జాతీయ రహదారిపైకి చేరుకునేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేశామన్నారు. విజయవాడ నుండి వచ్చే వాహనాలను పడుగుపాడు జంక్షన్ నుండి పెన్నా వంతెన, ఆత్మకూరు బస్టాండ్‌ల మీదుగా మినీబైపాస్ రోడ్డులో అయ్యప్పగుడి వద్ద జాతీయ రహదారిలోకి చేరుకుంటాయన్నారు. 20వ తేదీ రాత్రి వరకూ ఈ మార్పు కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.