శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో నేడు ధర్మపోరాట దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 19: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ అధికార టీడీపీ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నగరంలో ధర్మపోరాట దీక్ష జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నగరానికి విచ్చేస్తున్నారు. ఆయన రాక సందర్భంగా జిల్లా అధికారగణం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. ఆయా శాఖలు పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఇప్పటికే పలుసార్లు వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ముఖ్యమంత్రి అక్కడ్నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా స్థానిక పోలీసు కవాతు మైదానానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి వాహనంలో నగర శివార్లలోని ఎన్‌టీఆర్ నగర్ సమీపంలో ఉన్న ఎస్‌విజిఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ధర్మపోరాట దీక్ష కొనసాగనుంది. దీక్షకు హాజరైన వారినుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. కార్యక్రమం అయిన వెంటనే తిరిగి రేణిగుంట ద్వారా అమరావతికి తిరుగు పయనమవుతారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమం అయినప్పటికీ ముఖ్యమంత్రి హాజరవుతుండడంతో జిల్లా అధికారగణం ప్రొటోకాల్ మేరకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధమయ్యారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పార్టీ నేతలందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. సుమారు లక్ష మందికి పైగా ప్రజలు ఈ దీక్షకు హాజరవుతారని భావిస్తున్న నేపథ్యంలో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వర్షం కురిసినా ఎటువంటి అవాంతరం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా టీడీపీ నేత ఒకరు స్పష్టం చేశారు. 20, 21 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ వర్షం వచ్చి కార్యక్రమానికి అంతరాయం జరగడం, ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణానికి వీలులేని పక్షంలో ఆయనతో పాటు విచ్చేసిన ప్రముఖులు బస చేసేందుకు పినాకిని, ఆర్ అండ్ బి అతిథిగృహాలను సిద్ధం చేశారు.
నగరంలో భారీ బందోబస్తు
ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ నేతృత్వంలో ఇద్దరు ఏఎస్పీలు, 11 మంది డిఎస్పీలు, 35 మంది సిఐలు, 101 మంది ఎస్సైలు, 241 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 683 మంది కానిస్టేబుళ్లు, 84 మంది మహిళా కానిస్టేబుళ్లు, 325 మంది హోంగార్డులతో పాటు ఏఆర్ ఏఎస్పీ, ఒక ఏఆర్ డిఎస్పీ, ఇద్దరు ఆర్‌ఐలు, ముగ్గురు ఆర్‌ఎస్సైలు, 16 మంది ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, 107 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, 132 మంది స్పెషల్ పార్టీ పోలీసులు మొత్తం 1744 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు సభాస్థలి జాతీయ రహదారికి సమీపంలో ఉండడంతో విజయవాడ, చెన్నై వైపుల నుండి వచ్చే ట్రాఫిక్‌ను నగరంలోని మినీబైపాస్ రోడ్డు మీదుగా మళ్లించారు.
ఏర్పాట్లు పరిశీలించిన నాయకులు
ధర్మపోరాట దీక్ష జరగనున్న సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా తగు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని మంత్రులు పార్టీ నేతలకు, అధికారులకు సూచించారు. అలాగే సభాస్థలి వద్ద వాలంటీర్ బాధ్యతలను టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలకు అప్పగించారు.