శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆశావహులు.. ఛలో అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 20: అతి త్వరలో తెలుగుదేశం పార్టీ తొలి జాబితా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేయబోతున్నారనే సంకేతాలు వెలువడడంతో జిల్లాలోని టికెట్ ఆశావహులంతా అమరావతికి ప్రయాణం కడుతున్నారు. జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరం, రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాలు మాత్రమే ఖరారయ్యాయి. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రచారం చేసుకోమని ముఖ్యమంత్రి చెప్పడం, సర్వేపల్లికి సంబంధించి మంత్రి సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగిపోయింది. దీంతో తొలి జాబితాలో ఎలాగూ ఈ మూడు నియోజకవర్గాల పేర్లు ఉంటాయనేది నిర్వివాదాంశం. నగరం నుండి నారాయణ, రూరల్ నుండి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థులుగా ఖరారయ్యారు. ఇక జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈనెల 23న జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షుడితో ముఖ్యమంత్రి అమరావతిలో సమావేశం కానున్నారు. ఇప్పటికే తరచూ అమరావతిని దర్శించుకుంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నేతలకు కొదవలేదు. జిల్లాలో ఒకటీ రెండు నియోజకవర్గాలు మినహాయించి మిగతా ప్రతీచోటా ఇద్దరు ముగ్గురు నాయకులు టిక్కెట్లు ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి నేతలందరి భవితవ్యం 23వ తేదీన తేలనుంది. ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి జిల్లా నేతలకు సమాచారం అందింది. పార్టీ పేర్కొన్న కొందరు నాయకులు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యేలా దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలిసింది. అయితే ఈ సమావేశంలో పూర్తిస్థాయి నిర్ణయాలు వెలువడే అవకాశాలు తక్కువేనని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకటికి మించి పోటీదారులు ఉండడం, అందరూ సమర్థులు కావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయగిరి, కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల విషయంలో నిర్ణయం వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆత్మకూరుకు బొల్లినేని కృష్ణయ్య, కావలికి బీద మస్తాన్‌రావు, గూడూరుకు పాశం సునీల్‌కుమార్ ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉదయగిరి విషయంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు పోటీగా కావ్య కృష్ణారెడ్డి టిక్కెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పలు ఇంటెలిజెన్స్ సర్వేల్లోనూ స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత వ్యక్తమయిందని, దీంతో ఇక్కడ అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈ దఫా నెల్లూరు జిల్లాలో రెడ్లకు టిక్కెట్లపరంగా ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కోవూరు విషయంలోనూ సస్పెన్స్ కొనసాగే అవకాశాలున్నాయి. ఇక్కడ అభ్యర్థి ఎంపికకు సంబంధించి అన్ని వివరాలను సేకరించేందుకు వీలుగా త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి నియమించినట్లు సమాచారం. మంత్రి సోమిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆదాల ఈ కమిటీలో ఉన్నారు. అయితే ఈ కమిటీ విషయం అధికారికంగా వెల్లడి చేయనప్పటికీ అంతర్గతంగా ఈ కమిటీని నియోజకవర్గ వ్యవహారాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. ఇక సూళ్లూరుపేట విషయంలోనూ 23వ తేదిన ఒక నిర్ణయానికి వచ్చే వీలు కనిపించడం లేదు. ఇక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న పరసా రత్నంకు స్థానిక నేతల నుండి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన్ను తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. తిరుపతి లోక్‌సభ స్థానం నుండి పరసాతో పాటు మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాదరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నెల్లూరు ఎంపీ స్థానానికి సంబంధించి డీసీసీబీ అధ్యక్షుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిలలో ఒకరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 23న జిల్లాలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే విషయంలో పూర్తిస్థాయిలో కాకపోయినా ఒకటీ రెండు నియోజకవర్గాలు మినహాయించి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.