శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కలహం వీడి కలుస్తున్న నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 25: ఇంతకాలం ఒకరిపై ఒకరు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాలు నెరపిన జిల్లా సీనియర్ టీడీపీ నాయకులు ఎట్టకేలకు ఐక్యతారాగం ఆలపించడం ప్రారంభించారు. ఈ పరిణామంతో పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న సంతోషం అంతా ఇంతా కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం కచ్చితంగా వస్తుందనే ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముగ్గురూ కలిసి రూరల్ మండలం కోడూరుపాడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సంఘటన జిల్లా తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీ కార్యక్రమాల్లో తరచూ కలుసుకుంటున్నప్పటికీ ఈ ముగ్గురు నేతల మధ్య సరైన సఖ్యత లేదంటూ ఇటీవలి కాలంలో పుకార్లు షికారు చేశాయి. ముగ్గురు నేతలు కూడా కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు కూడా తక్కువనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే ఆదాల ప్రభాకర్‌రెడ్డి పరోక్షంగా మంత్రి పేరు ప్రస్తావించకుండా విమర్శలు సైతం చేశారు. మంత్రి బహిరంగంగా విమర్శలు చేయకపోయినా సన్నిహితుల వద్ద మాత్రం తనకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించడంపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన అనుచరులే చెబుతున్నారు. దీంతో ఆదాల, సోమిరెడ్డిల నడుమ సఖ్యత కొరవడిందని, ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు అప్పట్లో వినిపించాయి. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర కూడా వీరిద్దరితోనూ కార్యక్రమాల్లో కనిపిస్తున్నప్పటికీ గతంలో మాదిరి సన్నిహితంగా మాత్రం మెలగలేకపోయారు. కారణాలు ఏమైనా ముగ్గురు నాయకుల మధ్య సఖ్యత దూరమైపోయింది. ఎన్నికల గడువు దగ్గరపడుతున్నా జిల్లా టీడీపీలో ఇంకా అసంతృప్తి, అసమ్మతి చల్లారలేదని, దీని ప్రభావం ఎన్నికల్లో తప్పక ఉంటుందని, పార్టీ మరోసారి ఘోరవైఫల్యం చెందినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతూ వచ్చారు. కానీ కోడూరుపాడులో కలహం వీడి కలిసిన తమ నాయకులను చూసిన కార్యకర్తల్లో ఎనలేని ధైర్యం వచ్చి చేరింది. వీరు ముగ్గురూ ఇలానే ముందుండి జిల్లావ్యాప్తంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తే తిరుగుండదని కార్యకర్తలు ఆశిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో పరస్పర సహకారం చేసుకుంటే ఇంకా మంచిదనే భావన వ్యక్తమవుతోంది. గతంలో సర్వేపల్లిలో పోటీ చేసిన ఆదాలకు ఇప్పటికీ అక్కడ అభిమానులు, అనుచరులు ఉన్నారు. వారిని సోమిరెడ్డి గెలుపునకు కృషి చేసేలా ప్రోత్సహించడం, నెల్లూరు రూరల్ సోమిరెడ్డి సొంత ప్రాంతం కావడం, ఆయనకు ఇక్కడ అనుచరుల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. వీరు రూరల్‌లో ఆదాల గెలుపునకు సహకరించేలా ఇద్దరు నేతలు కూర్చొని మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే రెండుచోట్లా టీడీపీ గెలుస్తుందనే నమ్మకంతో కార్యకర్తలు ఉన్నారు. కోడూరుపాడు నుండి ప్రారంభమైన సఖ్యత ఎన్నికల వరకూ కొనసాగాలని వారు కోరుకుంటుండడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలో ఇప్పటి వరకూ కారాలు మిరియాలు నూరుకున్న నేతలంతా పార్టీ గెలుపే పరమావధిగా భావించి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఆ పార్టీకి అనుకూలించే అంశమేనని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.