శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గూడూరు రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జూలై 24: జంక్షన్ కేంద్రమైన గూడూరు రైల్వేస్టేషన్‌లో పలు ఆధునీకరణ పనులకు ఆదివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు నెల్లూరు నుండి వీడియో లింకేజ్ ద్వారా ప్రారంభించారు. అంతకుముందు గూడూరు రైల్వేస్టేషన్‌లో జరిగిన సమావేశంలో స్థానిక శాసనసభ్యులు పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ దేశంలోనే గూడూరు రైల్వేస్టేషన్ ఓ ప్రత్యేకత సంతరించుకుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల-తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండే కాక, విదేశాల నుండి వచ్చే యాత్రికులు సైతం గూడూరు రైల్వేస్టేషన్‌లో దిగి ఇక్కడ నుండి రోడ్డు మార్గం మీదుగా తిరుమలకు వెళుతుంటారని అన్నారు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన ఈ స్టేషన్‌లో ప్రయాణికులకు సరైన వసతి సౌకర్యాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జిల్లా కేంద్రంలో ఆగని రైళ్లు గూడూరులో ఆగేవని, ఇక్కడనుండి జిల్లా ఉన్నతాధికారులు తమతమ గమ్యస్థానాలకు వెళ్లేవారని, అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రైల్వేస్టేషన్‌లో కనీసం ప్రయాణికుల విశ్రాంతికి అవసరమైన గదులు లేవని అన్నారు. ఈ జంక్షన్ కేంద్రం మీదుగా ఇటు చెన్నై, రేణిగుంటకు నిత్యం వందలాది రైళ్లు, గూడ్సు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని అన్నారు. అదేవిధంగా తూర్పుగూడూరు అంతా పడమర గూడూరు విస్తరించి ఉన్న నేపథ్యంలో ఈ రెండు పట్టణాలకు అవరోధంగా ఉన్న రైలు పట్టాల కారణంగా రెండు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ 4వ నంబర్ ప్లాట్‌ఫారం, రైల్వేయార్డు ఆధునీకరణ పనులను దాదాపు 18.50 కోట్ల రూపాయలతో చేపట్టడం సంతోషించతగ్గ విషయమన్నారు. నాల్గవ ప్లాట్‌ఫారం నిర్మాణం వల్ల లూప్‌లైన్లకు చెందిన క్లియర్ స్టాండింగ్ రూమ్ కల్పించే విధంగా యార్డు ఆధునీకరణ చేయడం సంతోషించతగ్గ పరిణామమని అన్నారు. యార్డు ఆధునీకరణ వల్ల అన్ని వైపులకు వచ్చిపోయే ప్రయాణికులు, సరకు రవాణా వాహనాల రాకపోకలకు మార్గం సుగమం అవుతుందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పి దేవసేన మాట్లాడుతూ గూడూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి ప్రధాని, రైల్వేమంత్రి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. ప్రయాణికులకు రైల్వేశాఖ మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రఖ్యాతిగాంచిన గూడూరు రైల్వేస్టేషన్‌లో ఉన్న వసతిగృహాలు ప్రయాణికులకు సౌకర్యవంతంగా లేవని అన్నారు. రైల్వేస్టేషన్ ఆవరణలో గ్రీనరీ పెంచాలన్నారు. అలాగే అన్ని ప్లాట్‌ఫారాల్లో ప్రయాణికులకు అవసరమైన కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. టిడిపి పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ గూడూరు రైల్వేస్టేషన్ నుండి నిత్యం ఉత్తరాది రాష్ట్రాలకు నిమ్మకాయలను ఎగుమతి చేస్తున్నామని, కానీ వారికి సరైన సౌకర్యాలు లేవని అన్నారు. కౌన్సిలర్ వాటంబేటి శివకుమార్ మాట్లాడుతూ గూడూరు రైల్వేస్టేషన్‌కు దక్షిణం బాగా విస్తరించినందున సౌత్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు సోమిశెట్టి చెంచురామయ్య మాట్లాడుతూ గతంలో గూడూరుకు అంతర్జాతీయ పేరు ఉండేదన్నారు. ప్రధానంగా మైకా, నిమ్మ, ఆక్వా పంటలకు ప్రసిద్ధిగాంచిన గూడూరును రాజకీయ నాయకులు చిన్నచూపు చూడటం వల్ల ఆశించిన మేర అభివృద్ధి జరగలేదన్నారు. గూడూరు రైల్వేస్టేషన్‌లో ఎటిఎం, మందుల దుకాణాలు లేవని వాటిని ఏర్పాటు చేయాలని ప్రజలు ఎడిఆర్‌ఎం వేణుగోపాలరావు దృష్టికి తీసుకొచ్చారు. వీటి ఏర్పాటుకు బ్యాంకు శాఖలు ముందుకు వస్తే తప్పకుండా వీటిని స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే స్టేషన్ ఆవరణలో గ్లీనరీ ఏర్పాటుకు లక్ష్మీ పిఎం రావు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంకా జడ్పీటిసి బి పద్మ, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.