నెల్లూరు

తెలుగు భాషకు వెలుగునిచ్చిన స్వర్ణోత్సవాలు (సాహితీ వేదిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వంలో ఎర్రన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రకాశం జిల్లా ఎందరో కవులకు జన్మనిచ్చిన తల్లి ఒడి. ఎందరెందరో మహనీయులు ఓనమాలు దిద్దుకున్న తొలి ఒడి. పలు జిల్లాలు, రాష్ట్రాల కవులు, రచయితలంతా ఆత్మీయంగా కలుసుకున్న అరుదైన వేదిక ప్రకాశం జిల్లా రచయిత సంఘం స్వర్ణోత్సవ వేడుక. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఒంగోలులో జరిగిన ఈ స్వర్ణోత్సవ సంబరాలు తెలుగుకు వెలుగునిచ్చాయి.
టిటిడి కల్యాణ మండపంలో జరిగిన స్వర్ణోత్సవాలు తెలుగుకు సాహిత్య సంస్థలకు భవిష్యత్ కార్యాచరణను సూచించాయి. మూడురోజులూ స్వర్ణోత్సవ వేదిక విలువైన ప్రసంగాలతో ప్రేక్షకులను వివేచింప చేసిం ది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో పాటు, రాష్ట్రేతర ప్రాంతాల నుండి వచ్చిన 1200 కవులు, రచయితలు, భాషాభిమానులు, ప్రతినిధుల పలకరింపులతో ప్రాంగణం పులకరించింది. ‘‘నిరతాన్నదాత’ బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ దంపతుల ఆతిథ్యం షడ్రుచులకు మారుపేరై మూడురోజులు అందరి ఆకల్ని తీర్చింది.. ఆనందం పంచింది.
8వ తేదీ శుక్రవారం సాయింవేళ రచయితల సంఘం స్వర్ణోత్సవ పతాకాన్ని జిల్లా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆవిష్కరించి స్వర్ణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభ సభలో జ్యోతిప్రజ్వలన చేసి, వేడుకలకు కొత్త శోభనిచ్చిని ఒంగోలు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, ‘‘నిరతాన్న దాతలు’’ బూచేపల్లి సుబ్బారెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, గ్రానైట్ అధినేత శిద్దా వెంకటేశ్వరరావు, బిజెపి నేత బత్తిన నరసింహారావు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఐ.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణోత్సవ సభలను ప్రారంభించి ప్రారంభోపన్యాసం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు పట్ల మక్కువ పెంచుకొని, డాలర్ల మోజు తగ్గించుకునేలా యువతరాన్ని కవులు, రచయితలు తమ రచనల ద్వారా కృషి చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగువారి భాషా సమస్యలను ప్రభుత్వం, సాహిత్య సంస్థలు చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు.
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా రచయిత సంఘం ప్రతిష్టాత్మకంగా ప్రచురించిన 1050 పేజీల స్వర్ణోత్సవ సంచిక ‘తెలుగులోగిలి’ని ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు ఆవిష్కరించారు. ఇది పదికాలాల పాటు దాచుకోదగిన రిఫరెన్స్ పుస్తకం అన్నారు.
ఈ సందర్భంగా తెలుగు భాషా వికాసానికి ఇతర రాష్ట్రాలలో విశేష సేవలందించిన ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు (బెంగళూరు), డాక్టర్ పుల్లూరి ఉమ (చెన్నై), ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (కడప), డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి (బరంపురం), డాక్టర్ రామచంద్రవౌళి (వరంగల్), రవీంద్ర (ముంబయి) మరియు కె.అనిల్‌కుమార్‌రెడ్డి (చెన్నై)ను స్వర్ణోత్సవ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం జరిగిన గజల్ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గజల్ గానవిభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
9వ తేది శనివారం ఉదయం ప్రధమ సాహిత్య సదస్సులో ‘సమకాలీన సామాజకి కవిత్వధోరణులు’’ అంశంపై ప్రముఖ కవి కె.శివారెడ్డి ప్రసంగించారు. ప్రఖ్యాత సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ‘‘ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలు - పునుర్మూల్యాంకనం’ అంశంపై ప్రసంగించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు ‘ప్రబంధ సాహిత్యం-సామాజిక ప్రభోదం’ అంశంపై సోదాహరణ ప్రసంగం చేశారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ‘అమ్మ నుడి’ పత్రికాసంపాదకులు డాక్టర్ సామల రమేష్‌బాబు జివో నెంబరు 86 ప్రకారం తెలుగుభాషా పరిరక్షణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. విద్యా సంస్థల్లో తెలుగును విధిగా బోధించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రజలు భాషలో రచనలు రావాల్సిన అవసరాన్ని కవులు, రచయితలు గుర్తించాలన్నారు.
9వ తేదీ సాయంత్రం జరిగిన ద్వితీయ సదస్సుకు ప్రముఖ కధా విశే్లషకులు వాసిరెడ్డి నవీన అధ్యక్షత వహించారు. సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య మాతృభాషా పరిరక్షణ అవసరంపై మాట్లాడారు. ప్రముఖ సాహితీ విమర్శకులు కవి డాక్టర్ పాపినేని శివశింకర్ ‘తెలుగు సాహిత్య విమర్శ’ అంశంపై ప్రసంగించారు. ‘తెలుగు రుబాయిలు’ అంశంపై ప్రముఖ కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడారు. ప్రముఖ సాహితీవేత్త, వక్త డాక్టర్ మొవ్వా వృషాద్రిపతి ‘‘ ఆధునిక పద్య కావ్యాలు’’ గురించి రసప్రవాహంలా ప్రసంగించింది. నళినీప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ ఒంగోలు వారి బాల బాలికల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
10వ తేది ఉదయం జరిగిన తెలుగుజాతీయ కవి సమ్మేళనం ప్రాంగణంలో ఆశీనులైన ప్రేక్షకులకు కవిత్వం పండుగ చేసింది. వివిధ ప్రాంతాల నుండి 20మంది కవులు కవితాగానం చేశారు. కె.శివారెడ్డి అధ్యక్షత వహించగా డాక్టర్ రాధేయ, పెరుగు రామకృష్ణ, శ్రీనివాస వాసుదేవ్ (బెంగళూరు), డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి (బరంపురం), విజయచంద్ర (బరంపురం), రసరాజు (తణుకు), అడిగోపుల వెంకటరత్నం (తిరుపతి), ఎంవి రామిరెడ్డి (గుంటూరు), యస్. ఆర్. భల్లం (తాడేపల్లిగూడెం), ఎంబిడి శ్యామల (తెనాలి), పి.లక్ష్మణరావు (విజయనగరం), పివి సుబ్బారావు (చిలకలూరిపేట) తదితరులు కవితాగానం చేశారు.
ఈ సందర్భంగా తెలుగుభాషా, సాహిత్య వికాసాలకు విశేష కృషి చేసిన ప్రకాశం సీనియర్ కవులు ఈమని దయానంద, నాగళ్ల ఏలియా, పెద్దిబొట్ల సుబ్బారామయ్య, కమ్మశెట్టి వేంకటేశ్వరరావు, నరాల చిన చెన్నారెడ్డి, మండువ నరసింహారావు, గాడేపల్లి సీతారామమూర్తిలను స్వర్ణోత్సవ వేదికపై ఘనంగా సత్కరించారు.
అనంతరం జరిగిన ముగింపు ఉత్సవాలకు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి.హనుమారెడ్డి అధ్యక్షత వహించారు. స్వర్ణోత్సవాలను నిర్వహించడం ద్వారా ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షునిగా తమ జన్మధన్యమైందన్నారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన అధికార భాషా సంఘం అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ మాట్లాడుతూ తెలుగును పరిపాలనా భాషగా, ప్రజల భాషగా, ప్రయోజన భాషగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.
అనంతరం మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు మహోపన్యాసం ప్రేక్షకులను ఆలోచింపచేసింది. చమత్కారాలతో అలరించిన ప్రకాశం జిల్లా రచయిత సంఘం కార్యదర్శి పొన్నూరి వెంకట శ్రీనివాసులును, సభలు విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన రచయిత సంఘం కోశాధికారి వై కొండారెడ్డిని, కార్యవర్గ సభ్యులను అందరూ అభినందించారు.
అనంతరం కార్యవర్గ సభ్యులనూ, ప్రతినిధులనూ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సంక్రాంతికి ముందే సాహితీ సంక్రాంతిని నిర్వహించి, స్వర్ణోత్సవాలతో ప్రకాశం జిల్లా ప్రతిష్టతను, గౌరవాన్ని పెంచిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం సారధి బి.హనుమారెడ్డి కృషిని ముక్తకంఠంతో అందరూ అభినందించారు.

- పురిణి విజయభాస్కర్‌రెడ్డి, ఒంగోలు

ప్రకాశం జిల్లా రచయిత సంఘం స్వర్ణోత్సవాలను ప్రారంభించిన మాగుంట శ్రీనివాసులురెడ్డి,
శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తదితరులు

ప్రకాశం జిల్లా రచయతల సంఘం స్వర్ణోత్సవాల వేదికపై విరబూసిన కవితలు

ఆభరణం
సమూహంలో ఉన్నా
సామాజిక బంధాలకు బందీ అయినా
వ్యక్తిత్వమే కదా విలువైన ఆభరణం!
మనిషిలోని అంతః సౌందర్యాన్ని
సమాజానికి అద్దంలా చూపి
ఋజుమార్గంలో నడిపే దిక్సూచి!!
వజ్ర సంకల్పం ఉన్న వ్యక్తికి
గమ్యమూ, గమనమూ ముఖ్యమే
ఆకాశమంత ఎదిగినా
అనంత విశ్వాన్ని జయించినా
వటవృక్షంలా విస్తరించినా
వ్యక్తిత్వమే కదా కీర్తికిరీటమై నిలిచేది!
ఏ మనిషి జీవితానికైనా...
పరమార్ధం ఏముంటుంది?
సూర్యునిలా వెలుగును నింపుతూ
చందమామలా వెనె్నలను పంచుతూ
నలుగురికి స్ఫూర్తినివ్వడమే కదా..!
బ్రతికినంత కాలం
స్నేహ పరిమళాలను వెదజల్లడమే కదా..!!
తన చుట్టూ విరబూసే నవ్వుల్లో
తన నవ్వును చూసుకోవడమే కదా..!!!

--- బండికల్లు జమదగ్ని, 9848264742
గుంటూరు

స్నేహం
మనుగడ ప్రశ్నార్థకమై
మనుగడ అచేతనమైనప్పుడు
అనుబంధాల వాకిలి తెరిచి
ఆత్మీయతను ఒడుపుగా అల్లి
మనోవేదనలను మరిపించి
మమతలను కురిపిస్తుంది స్నేహం.
కులమత కుడ్యాలను కూల్చి
అపోహల కంటకాలను చీల్చి
బ్రతుకు గాయాలకు లేపనమద్ది
తమస్సు నుండి ఉషస్సుకు మరల్చి
పరిమళాల పారిజాతమై
పలుకు పుప్పొడులను చిందిస్తూ
అమృతఝరులను అందించును స్నేహం.
యాసభాషలు వేరైనా
మదురోహలను ముందు నిలిపి
తడబడినా తట్టి నిలుపుతుంది
అధైర్యాన్ని ఆమడదూరం నెట్టుతుంది
కలిమిలేములే కాదు,
చావు బ్రతుకులలోన
తోడునీడై నిలిచేసి స్నేహం
ధాత్రిన మైత్రియే మిన్న.
యుగాలు మారినా, తరాలు మారినా
హార్థిక బంధం, ఆర్థిక బంధమైనా
వనె్న తరగనిది వెన్నంటి నిలిచేది స్నేహం
ఒక పలకరింపు, ఒక స్పర్శ
అణువణువున అనురాగం
అంతరంగపు అవ్యక్తానుభూతి
నవరసాల రాగ విపంచి,
ఎదపై పూచిన హరివిల్లు,
చెరగని చిరునగవుకు చిరునామా,
ఇగరని గంధం నిత్యనూతనం
ఆకుపచ్చని జ్ఞాపకాల దొంతర
హృదయవాకిలిపై చెరగని సంతకం
అనంతకాలపు పెన్నిధే కదా స్నేహం.

- బండి ఉష, ఖమ్మం
చరవాణి : 9676377462

స్పందన

నవ్వించిన పిడికెడు
బూడిద - అడ్డగాడిద
గతవారం మెరుపులో మోపూరు పెంచల నరసింహం, ఘాలి లలిత గార్లు సంయుక్తంగా రాసిన పిడికెడు బూడిద అడ్డగాడిద కథ ఆధ్యంతరం హాస్యభరితంగా సాగింది. కథలోని పాత్రలను ఎన్నుకోవడమే కథకు అందాన్ని తెచ్చింది. పైగా కథకు తగ్గట్లుగా ఆ పాత్రలకు కామెడీ పేర్లు పెట్టి, ఆ పాత్రలకు చక్కటి హాస్యభరిత సంభాషణలతో ప్రాణంపోశారు. అలాగే ఈ కథలో ప్రస్తుతం స్వామీజీల తీరుతెన్నులు, వారి మాయలీలలను ఎండగట్టిన తీరు బాగుంది. కోటిలింగం, జంబులింగం, డింగ్ డాంగ్ ఆశ్రమం, గోచిగూడ అనే పదాల వాడుక బాగుంది. అయితే కథలో మరికొన్ని పాత్రలను చొప్పించి కథను ఇంకొంత నిడివి పొడించి ఉంటే ఇంకా హాస్యం పొంగిపొర్లేది సుమా.
- జి. శ్రీనివాస్, కాకుటూరు
- హేమప్రియ, జవహర్‌భారతి, కావలి
- హరిణి వేల్పుల, పామూరు

అశ్రుతర్పణం నిజంగా
రంగనాథ్‌కు అక్షర నివాళి
గత వారం మెరుపులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటుడు రంగనాథ్‌పై ఒంగోలు నుంచి శింగరాజు శ్రీనివాసరావు గారు రాసిన అశ్రుతర్పణం కవిత నిజంగా కన్నీరు పెట్టించింది. కవితలో వాడిన వాక్యనిర్మాణం ఆధ్యంతం రంగనాథ్ వ్యక్తిత్వాన్ని కళ్లకు చూపింది. ఒక్కొక్క వాక్యంలో రంగనాథ్‌ను ప్రశ్నించిన తీరు, పదాల పోలిక అన్నీ అలా కుదిరాయంతే. ఆరడుగుల అందం, చెట్టంత మనిషి, ఆరేళ్లు ఒంటరి తనం అనుభవించిన నీవు అరక్షణం ఆలోచించలేవా? వంటి పదాలు గుండెల్ని పిండేశాయి. రచయిత రాజు గారితో మాట్లాడాలని ఆ రోజు ప్రయత్నించి విఫలమై ఈ లేఖ ద్వారా స్పందన తెలియజేస్తున్నాను.
- కోసూరి సుబ్రహ్మణ్యం, రచయిత, నెల్లూరు
- అమంత గాయత్రి, మార్కాపురం

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే
గత వారం మెరుపులో రచయిత్రి రాహేలు గారు రాసిన అమ్మ కవిత ఆధ్యంతం బాగుంది. నిజంగా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. కవిత మొదటి నుంచి చివరి వరకు అమ్మ గొప్పతనాన్ని వర్ణించిన తీరు కొత్తగా ఉంది.
- పొత్తూరు రాధమ్మ, సంతపేట, నెల్లూరు
- రావి గుడిపాలరాజు, చిత్తూరు

వాట్ ఏ యాప్ కవిత సూపర్
గతవారం మెరుపులో రాసిన వాట్ ఏ యాప్ కవిత నిజంగా ప్రస్తుత సమాజంలో వాట్సాప్ తీరుతెన్నులను కళ్లకు కట్టినట్లు చూపింది. శ్రీనివాస్ గుండారపు గారు సరికొత్త పంథాలో కవితను రాశారు. వాట్ ఏ యాప్ నీకు హేట్సాప్ అంటూ కవితలో పొగిడినట్లే పొగిడి చివరికి నీవల్ల కుటుంబ సంబంధాలు దూరమయ్యాయి, పెళ్లాం పక్కలో వుంటే నీవు మాత్రం గుండెల్లో వుంటావు అంటూ కవితలో వాడిన వాక్యాలు సూపర్. ఏదైనా టెక్నాలజీని మంచిగా వాడుకుంటే మంచిది..చెడుగా వాడుకుంటే చెడ్డదే అనే సందేశాన్ని అంతర్గతంగా ఇచ్చిన తీరు బాగుంది.
- రావి స్వర్ణలత, కనిగిరి
- అనంతబాబు, వెంకటగిరి

మనోగీతికలు

మకరందపు పూత
మాటల బాణాలను
గురి చూసి వదలగల నేర్పరులు
తేనే మనసులపై
చేదు చారికలనద్దగల సమర్థులు
మాటలతో కోటలను కట్టి
అట్ట సింహాసనాలనందులో అమర్చగలరు
కొన్నిసార్లు
దాయాదుల మధ్యలో
బురిడీ మాటల దారాలను
విడదియ్యలేనంత చిక్కుని
చక్కగా అల్లేస్తూ...
రక్త సంబంధీకుల్లో
రణరంగాలను ఉసిగొల్పి
రక్తదాహాన్ని తీర్చేసుకుంటారు
లేనిది ఉన్నట్టు
ఉన్నది లేనట్టు
ఎండమావుల ఆలోచనలతో
నిజాలకు నిజంగానే ఉరేస్తూంటారు
వీళ్లు చిలుక పలుకుల
నాలుకనమర్చుకొని
తేనె పూసిన కత్తులను
జనాలపైకి విసురుతూ
పచ్చని పైర్లు లాంటి స్నేహంపై
మాటల మందుని స్ప్రే చేసి చంపేస్తారు
ఆర్థిక వెంపర్లాటల్లో
మాతృమూర్తిని సైతం
మాటల శరాఘాతాలతో
విగతజీవిని చేసి వికృతానందులవుతారు
సొంత మనుషుల మధ్య చిచ్చురేపి
మనసు తెరపై చదరంగపు ఆటను
అలవోకగా ఆడేస్తూంటారు
వీళ్లుపనే్న పన్నాగపు ఉచ్చుతాళ్లు
ఒక్కోసారి ఉరితాళ్లుగా మారుతుంటాయి
మకరందపు పూతతో మాటువేసి
కాలకూటాన్ని చిమ్మగలరు! జాగ్రత్త సుమా..!

- జడపల్లె మాధవాస్సుధ
నాయుడుపేట,
చరవాణి : 9492935005

ఓటు విశిష్ట వరం
అవినీతిపరుల్ని అడ్డుకుని
ఆపద్బాంధవుల్లాంటి
నీతి గల నేతలకు
అధికారాన్ని అందజేసేది.. ఓటు!
ప్రజాస్వామ్యానికి విలువిచ్చి
సత్ప్రరిపాలనకు చొటిచ్చి
పదికాలాల పాటు ప్రజలందరికి
పదిలమైన జీవితాన్ని
ప్రసాదించేది.. ఓటు!
అరాచకవాదుల్ని ప్రశ్నించి
నిరంకుశత్వాన్ని నిరోధించి
స్వేచ్ఛ, సమానత్వాలకు
జన మనోభావాలకు
ప్రతీకగా నిలిచేది ఓటు!
మేధావుల ముందుచూపుతో
రూపుదిద్దుకున్న ఆయుధంగా
విశ్వమానవ సౌభాగ్యానికి
విశిష్టవరమై విరాజిల్లేది.. ఓటు!
లోభాలకు లొంగిపోయి
బెదిరింపులకు బెదిరిపోయి
విచక్షణ మరిచి వినియోగిస్తే
గురి తప్పేది ఓటు!
విషపుకాటయ్యేది... ఓటు!!!

- కొండూరు వెంకటేశ్వరరాజు, గూడూరు
చరవాణి : 9492311048

తెలుసుకోండి!
ఎన్నో చూస్తుంటాం
మరెన్నో చేస్తుంటాం
దొరకనివి మరెన్ని?

కొన్నా దొరికేవి యెన్ని?
కొనకున్నా దొరికేవి యెన్ని?
దేవుడు యిచ్చినవి యెన్ని?
మనిషికి వచ్చినవి యెన్ని?

అందరికి దొరికేవి
కొందరికే దక్కేవి,
కోరుకున్నా దొరకనివి
కావాలనుకున్నా దరిరానివి..
అమ్మ ప్రేమ దొరకాలన్నా
అదృష్టం వరించాలి
ఆలి ప్రేమ కావాలన్నా
ప్రేమించే గుణం కావాలన్నా.

అమ్మ ప్రేమలో స్వార్థం లేదు
నాన్న ప్రేమలో స్వార్థం ఉండదు
మనిషి మనిషిలో ప్రేమ వున్నా
అవసరానికి అది అందదు..!
మనిషికి దొరికేవి రెండు కనబడే అమ్మ - కనబడని దేవుని కృప. అమ్మప్రేమ - దైవభక్తి - ఎల్లప్పుడూ ఆచంద్రార్కములు.

- డా॥ ఎ. ఆర్.చౌదరి, చరవాణి : 9490477086

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- పురిణి విజయభాస్కర్‌రెడ్డి