నిజామాబాద్

ప్రధాని అనాలోచిత నిర్ణయంతో దేశంలో ఆర్థిక సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 7: ప్రధాని నరేంద్ర మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడిందని శాసన మండలి విపక్ష నేత మహ్మద్ షబ్బీర్‌అలీ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, అమర్త్యసేన్ వంటి ఎంతోమంది ప్రముఖ ఆర్థికవేత్తలు సైతం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టారని ఆయన గుర్తు చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీతో పాటు మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, జిల్లా పార్టీ ఇన్‌చార్జి నిరంజన్, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, ప్రధాని అహంకార భావంతో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో యావత్ దేశం క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుందని, జిడిపి రేటు పడిపోతూ ఎంతో పటిష్టంగా ఉండే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ప్రారంభమైందన్నారు. 86 శాతం చెలామణిలో ఉన్న పాత 1000, 500 రూపాయల కరెన్సీని రద్దు చేయడం వల్ల అడుగడుగునా సామాన్య ప్రజలు ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తోందని, నగదు కొరతను తీర్చేందుకు కనీసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన పాపాన కూడా పోలేదన్నారు. బ్యాంకులు, ఎటిఎంల ముందు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతూ ఇప్పటికే 150 మందికి పైగా మృతి చెందారని, పార్లమెంటులో కనీసం వారికి సంతాపం కూడా ప్రకటించకపోవడం మోదీ ప్రభుత్వానికి సామాన్యుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుతోందన్నారు. ఎవరినీ సంప్రదించకుండా పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో రిజర్వ్ బ్యాంకు ప్రతిష్ఠ కూడా మంటగలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో యాభై రోజుల వరకు ఇబ్బందులు ఉంటాయని గడువు కోరారని, ఆ గడువు ముగిసినా ఇప్పటికీ కరెన్సీ కష్టాలు మాత్రం దూరం కావడం లేదన్నారు. పైపెచ్చు రోజుకో నిబంధనను తెరపైకి తెస్తూ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నారని ఆక్షేపించారు. నల్లధనం, తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామంటూ 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన మోదీ సర్కార్, తీరా నాసిరకంగా 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టడం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను అనుమానాలు రేకెత్తేలా చేస్తోందన్నారు. కాగా, నోట్ల రద్దు ప్రకటన అనంతరం ప్రధాని నిర్ణయం పట్ల వారం రోజుల పాటు వౌనంగా ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్, అనంతరం ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసి వచ్చిన తరువాత ఆయనకు వంతపాడుతూ మోదీ భజన చేస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రతిపక్షాలు మాట్లాడకుండా కెసిఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు. తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రధాని మోదీకి కెసిఆర్ వత్తాసు పలుకుతున్నారని, మిషన్ భగీరథ నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకే నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారని షబ్బీర్‌అలీ ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని పెద్ద మోదీ అయితే, రాష్ట్రంలో కెసిఆర్ చిన్న మోడీగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నల్లధనం, తీవ్రవాద నిర్మూలన కోసమంటూ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం బెడిసికొట్టడంతో, ప్రస్తుతం నగదు రహిత లావాదేవీల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా నూటికి నూరు శాతం డిజిటల్ లావాదేవీలు లేవని, అలాంటిది 70 శాతానికే అక్షరాస్యత పరిమితమై ఉండి, 130 కోట్ల మంది జనాభా కలిగి ఉన్న భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు సంపూర్ణంగా ఎలా సాధ్యమవుతాయని షబ్బీర్‌అలీ ప్రశ్నించారు. అంబానీ, అదానిలకు ఇతోధికంగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకే ప్లాస్టిక్ కార్డుల వాడకాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు గడువు ముగిసినందున ఇప్పటివరకు ఆర్‌బిఐ పాత 1000, 500నోట్లు ఎంతమేరకు జమ అయ్యాయి, ఏ మేరకు నల్ల ధనాన్ని, నకిలీ కరెన్సీని గుర్తించారనే వివరాలను ప్రధాని మోదీ తక్షణమే వెల్లడించాలని, లేనిపక్షంలో ప్రధాని పదవి నుండి వైదొలగాలని షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ అధ్యక్షత వహించగా, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, అరుణతార, నాయకులు గడుగు గంగాధర్, రత్నాకర్, నగేష్‌రెడ్డి, సుమేర్ అహ్మద్, జావెద్ అక్రమ్, ఎడ్ల రాజిరెడ్డి, సురేందర్, కాసుల బాల్‌రాజ్, కైలాస్ శ్రీనివాస్, ప్రేమ్‌లతా అగర్వాల్, జమునారాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకునే వరకు పోరాటం
నిజాంసుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు

బోధన్, జనవరి 7: నిజాంసుగర్స్ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని నిజాంసుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ బ్రతుకులు బాగు పడతాయని కార్మికులు ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ప్రైవేటు యాజమాన్యాన్ని ఎదిరించి ఉద్యమాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇక్కడి కార్మికులకు కనీసం వేతనాలు కూడా లేకుండా పోయాయని విమర్శించారు. తెరాస అధికారంలోనికి వస్తే నిజాంసుగర్స్ కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని కానీ నేడు ఈ కర్మాగారం గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ కర్మాగారాన్ని సహకార రంగంలో నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగా సోమవారం బోధన్ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట రక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టనున్నామని ఆయన వివరించారు. ఫ్యాక్టరీ కోసం చేపట్టనున్న ఈ ధర్నా కార్యక్రమానికి చెరకు రైతులు, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. విలేఖరుల సమావేశంలో రక్షణ కమిటీ ప్రతినిధులు వరదయ్య, కుమారస్వామి, సుల్తాన్ సాయిలు, ప్రీతంగౌడ్, గౌతంకుమార్ తదితరులు పాల్గొన్నారు.