నిజామాబాద్

రేణుకాఎల్లమ్మ ఆలయంలో ఎంపి, ఎమ్మెల్యే పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, ఫిబ్రవరి 12: నందిపేట మండలం కుద్వాన్‌పూర్ ఎల్లమ్మగుట్టపై గల రేణుకాఎల్లమ్మ ఆలయంలో ఆదివారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే 111 మేకలు, గొర్రెలతో మొక్కులు తీర్చుకుంటానని మొక్కుకోవడం వల్ల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆదివారం గుట్టపై పండుగ నిర్వహించి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఎంపి కవిత ఆధ్వర్యంలో పండుగ సందడి కొనసాగింది. ఎంపి కవితకు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నవీన్‌గౌడ్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు, బ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రేణుకామాత గర్భగుడిలో ఎంపి కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలు తమతమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి వస్త్రాలు, బోనాలు సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్, బోధన్, బాల్కొండ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు గణేష్‌గుప్తా, షకీల్, ప్రశాంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు విజి.గౌడ్, డాక్టర్ భూపతిరెడ్డి, మేయర్ ఆకుల సుజాత, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డిలతో పాటు నిజామాబాద్, జగిత్యాల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుండి టిఆర్‌ఎస్, జాగృతి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 12వేల మంది కార్యకర్తలకు, నాయకులకు విందు ఏర్పాటు చేశారు.

బడాబాబుల చెరలో అసైన్డ్ భూములు
అధికారుల ఉదాసీన వైఖరితో అన్యాక్రాంతం అయిన సర్కారీ స్థలాలు
పక్కాగా సర్వే జరిపితే బయటపడనున్న భూ భాగోతాలు

నిజామాబాద్, ఫిబ్రవరి 12: నిరుపేద కుటుంబాలకు అసైన్డ్ భూములను అందించి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు మిగులు స్థలాలను అందించగా, వాటిలో సగానికి పైగా భూములు బడాబాబుల కబంద హస్తాల్లోకి చేరిపోయాయి. లబ్ధిదారులుగా గుర్తించి భూములు అందించిన వారి జాడ కనుమరుగైంది. పేదలకు ప్రభుత్వపరంగా దక్కిన స్థలాలను కొంతమంది పలుకుబడి గల పెద్దలు తమ అధికార దర్పాన్ని ప్రయోగించి హస్తగతం చేసుకోగా, మరికొందరు కారుచౌక ధరకు అసైన్డ్ భూములను దక్కించుకున్నారని తెలిసింది. ఇదివరకు పంపిణీ చేసిన అసైన్డ్ భూముల వివరాలను పూర్తిగా సేకరించాలని ప్రభుత్వం ఆదేశించిన దరిమిలా జిల్లా యంత్రాంగం రెవెన్యూ వర్గాలతో సర్వే జరిపిస్తోంది. ఏయే ప్రాంతాల్లో ఎంతమంది లబ్ధిదారులకు ఎన్ని ఎకరాల భూములు అందించారు, ప్రస్తుతం అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, సదరు భూముల్లో పంటలను సాగు చేస్తున్నారా? లేదా? తదితర సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని గత వారం రోజుల క్రితమే కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అనేక చోట్ల అసైన్డ్ భూముల్లో అసలు లబ్ధిదారులకు బదులుగా బినామీలు తిష్టవేసి కూర్చున్నట్టు సర్వే సందర్భంగా వెల్లడవుతోంది. అధికారులు రికార్డులకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి పక్కాగా పరిశీలన జరిపితే ఈ భూ భాగోతానికి సంబంధించి మరిన్ని వివరాలు బయటపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి జీవనాధారం కోసం ప్రభుత్వం అందించిన భూములను లబ్ధిదారుల నుండి కొనుగోలు చేసేందుకు వీలుండదని నిబంధనలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ అనేక మంది కారుచౌక ధర చెల్లించి లబ్ధిదారుల నుండి అసైన్డ్ భూములను దక్కించుకోవడం, ఆ స్థలాలను ఏకంగా తమ పేర్లతో పట్టాలు తయారు చేసుకోవడం అధికారుల నిస్తేజం, నిఘా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు ఎనిమిది విడతలుగా సుమారు 90వేల ఎకరాల వరకు అసైన్డ్ భూములను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిజానికి గత ఆరవ విడత భూ పంపిణీ సమయంలోనే ప్రభుత్వ మిగులు భూములు జిల్లాలో మచ్చుకైనా మిగల్లేవని రెవెన్యూ వర్గాలు ప్రకటించాయి. కనీసం నిరుపేదలకు అప్పటికే అందించిన స్థలాలనైనా వారికే చెందేలా చూసే విషయంలో అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో అవి బడాబాబులకు ధారాదత్తం అయ్యాయి. దీంతో పేదలకు జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం కొసరంతే సిద్ధించింది. మరోవైపు అక్కడక్కడా అరకొరగా మిగిలి ఉన్న ప్రభుత్వ మిగులు భూములను పరిరక్షించడంలో పకడ్బందీగా వ్యవహరించని పర్యవసానంగా ప్రస్తుతం ప్రభుత్వ అవసరాలకు కూడా జానెడు జాగా అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. పలుకుబడి కలిగిన పెద్దలు రాజకీయ అండదండలతో విచ్చలవిడిగా కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు. సాక్షాత్తూ జిల్లా కేంద్రమైన నిజామాబాద్ శివారు ప్రాంతాలతో పాటు డిచ్‌పల్లి, ఆర్మూర్ రోడ్ ఏరియాలలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా కోరల్లో చిక్కుకుని ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. సదరు ఆక్రమణదారులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ, మరికొంతమంది దొడ్డిదారిన పట్టాలు సృష్టించుకుని తామే అసలు హక్కుదారులమని చెలామణి అవుతున్నారు. ప్రస్తుతం ఆయా మండలాల్లో మోడల్ స్కూళ్లు, ఇతరాత్ర అభివృద్ధి పనుల నిర్మాణాలు జరిపేందుకు కూడా స్థలం కొరత ఇబ్బందికరంగా పరిణమించింది. కనీసం ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములను కొనుగోలు చేద్దామన్నా, ప్రభుత్వం అందించే అరకొర ధరకు స్థలాలు అప్పగించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎనిమిది విడతలుగా చేపట్టిన భూ పంపిణీ ప్రక్రియలోనూ ఇప్పటికీ 30శాతానికి పైగా లబ్ధిదారులకు స్థలాలను చూపించకుండా పట్టాల పంపిణీతోనే సరిపెట్టుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు క్షేత్ర స్థాయిలో పక్కాగా సర్వే జరిపితే, దొడ్డిదారిన అసైన్డ్ భూములను, ప్రభుత్వ మిగులు స్థలాలను కైంకర్యం చేసిన కబ్జాదారుల చెర నుండి వాటిని విడిపించేందుకు ఆస్కారం ఉంటుంది. తద్వారా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హులైన నిరుపేద కుటుంబాల వారికి వాటిని పంపిణీ చేయవచ్చు. ఈ దిశగా జిల్లా యంత్రాంగం సర్వే పకడ్బందీగా జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రూ.4.50 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం
ఐదుగురి అరెస్టు
పరారీలో మెదక్ వ్యాపారి
డిఎస్పీ ప్రసన్నరాణి

కామారెడ్డి, ఫిబ్రవరి 12: మెదక్ జిల్లా నుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి గుట్కాను తరలిస్తుండగా పట్టుకున్నట్లు డిఎస్పీ ప్రసన్నరాణి తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలను విలేఖరులకు వెల్లడించారు. మెదక్ జిల్లా కేంద్రానికి చెంది ఎం.డి బాబా, ఆటోడ్రైవర్ రహమత్ ట్రాలీ ఆటో ఎపి 23యు 6525లో గుట్కాలను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు దాడి చేయగా సుమారు 4.50లక్షల విలువ గుట్కా లభించినట్లు తెలిపారు. రహమత్‌ను అదుపులోకి తీసుకోని విచారించగా మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన సాయిదీప్ సూపర్‌స్టోర్ యాజమాని రమేశ్ వద్ద పనిచేస్తున్నట్లు తెలిందన్నారు. ప్రతిరోజు రమేశ్ దుకాణం నుండి గుట్కా సంచులను ఇతర ప్రాంతాలకు వీరు దిగుమతి చేస్తారని దానిలో భాగంగా కామారెడ్డికి తీసుకువచ్చి కొంతమంది వ్యాపారులకు అందించారు. కామారెడ్డికి చెందిన శ్రీనివాస్, సందీప్, కిరణ్‌లతో పాటు మెదక్ జిల్లాకు చెందిన బాబా, రహమత్‌లను అరెస్టు చేయడం జరిగిందన్నారు. మెదక్ పట్టణానికి చెందిన వ్యాపారి రమేశ్‌ను త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు. సుమారు 20కి పైగా గుట్కా సంచులు, కాటన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సిఐ శ్రీధర్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.

పుష్కర కాలానికి కుదిరిన ముహూర్తం
నేడు మంత్రి హరీష్‌రావుచే ఎత్తిపోతల ప్రారంభం
మోర్తాడ్, ఫిబ్రవరి 12: సరిగ్గా 12సంవత్సరాల 3మాసాల 2రోజులకు చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకానికి ముహూర్తం కుదిరింది. పుష్కర కాలం క్రితం మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాలకు సాగునీటిని అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మోర్తాడ్‌లో చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కేవలం చెరువులపైనే ఆధారపడి ఎలాంటి సాగునీటి వసతి లేని మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల్ఘ్లోని 17 గ్రామాల్లో 10వేల ఎకరాల భూములకు సాగునీటిని అందించేందుకై శెట్పల్లి ఊరచెరువుపై చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి పథకానికి శ్రీకారం చుట్టారు. 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకై మూడు పంప్‌హౌస్‌లను, నాలుగు సిస్టర్న్‌లను నిర్మించారు. దాదాపు 56 కిలోమీటర్ల పొడవున పైప్‌లైన్ నిర్మాణం చేపట్టి, దానికి అనుగుణంగా అవసరమైన 39 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్‌లను కూడా ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్‌లో డెలివరీ సిస్టర్న్-1కు గాను 1000 మిల్లీమీటర్లు, కమ్మర్‌పల్లి డిసి-2 900 మిల్లీమీటర్లు, ఒడ్యాట్ డిసి-3కి 1400 మిల్లీమీటర్లు, చౌడ్‌పల్లి డిసి-4కు 1100మిల్లీమీటర్ల వ్యాసార్థం ఉన్న పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మోర్తాడ్ సిస్టర్న్‌కే అధిక నీటిని విడుదల సామర్థ్యాన్ని కల్పించి చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకం పుష్కర కాలంగా పనులకు నోచుకుంటునే ఉంది. రెండున్నర సంవత్సరాల కాలవ్యవధిలో పూర్తికావాల్సిన ఈ పథకం అనేక సాంకేతిక కారణాల వల్ల కొన‘సాగుతూ’నే వచ్చి, ఇంకా ముక్తాయింపునకు నోచుకోలేదు. ప్రతిసారి ఖరీఫ్, రబీ సీజన్లలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మికాల్వ ద్వారా వచ్చే నీటిని నాలుగు పైప్‌లైన్ల ద్వారా ట్రాయల్న్‌ల్రు చేపడుతునే ఉన్నా, లీకేజీ సమస్యలు ఏర్పడుతూ వచ్చాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండు బడ్జెట్‌లలో నిధులు కేటాయించడంతో పనులు వేగం పుంజుకుని, దాదాపుగా పనులు పూర్తికానున్నాయి. ఆరు సంవత్సరాల క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఆనాటి ప్రభుత్వం చొరవ చూపినా, పనులు పూర్తికాకపోవడంతో చివరి క్షణంలో నిలిచిపోయింది. తాజాగా, హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రభుత్వం ముహూర్థాన్ని ఖరారు చేసింది. సోమవారం మధ్యాహ్నం 2గంటలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శెట్పల్లి పంప్‌హౌజ్‌లో స్విచ్ ఆన్ చేసి ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు.
నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే
రెండు మండలాల్లోని 10వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇక నుండి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిర్వహించనుంది. పథకం శంకుస్థాపన జరిగినప్పుడు ఉన్న నిబంధనల్లో భాగంగా నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం జరిగాక రెండు సంవత్సరాల పాటు కాంట్రాక్టరే దీనిని నిర్వహించాలని, ఆ తర్వాత రైతుల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసిన దానికే బాధ్యతలు అప్పగించాలేలా నిబంధనలు ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. అయితే నిర్వాహణ ఖర్చు భారీగా ఉండటంతో ప్రస్తుతం దీనిని ప్రభుత్వమే నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం కోసం ప్రత్యేకంగా సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. 24గంటల పాటు విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసిన అధికారులు, ఇప్పట వరకు దానికి పూర్తిస్థాయి విద్యుత్‌ను అందించడంలో సఫలీకృతులు కాలేకపోయారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిన కారణంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకే అందించి, తర్వాత దానిని 16గంటలకు పొడగించారు. పూర్తి పథకం నిర్వాహణకు గాను దాదాపు 524మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం అవుతుందని నిర్ణయించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో లక్ష్మికాల్వ పనులు పూర్తయితే తప్ప, హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకానికి పూర్తిస్థాయిలో నీరందదని, పనులు వేగంగా జరిగేలా మంత్రి దృష్టి సారించి ఎత్తిపోతల జలాలు నిర్వీగ్నంగా అందేలా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

మండల అభివృద్ధికి పాటుపడతా
ఎమ్మెల్సీ ఆకుల లలిత
మాక్లూర్, ఫిబ్రవరి 12: మాక్లూర్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేర్కొన్నారు. తన కోటా నిధుల నుండి ఇప్పటికే మండలంలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేసినట్టు ఆమె గుర్తు చేశారు. మండలంలోని వల్బాపూర్ గ్రామంలో గల గిరిజనవాడలో 4లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సి.సి రోడ్డు, లక్ష రూపాయలతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణం పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరిస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇబ్బడిముబ్బడిగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రజాప్రతినిధులు, ప్రస్తుతం ప్రజల్లోకి రాకుండా ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే, స్థానిక ఎమ్మెల్యే చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు తిరిగి అవకాశం లభిస్తుందో లేదోననే అనుమానాలతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులను బుజ్జగించే యత్నాల్లో నిమగ్నమై కనిపిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఏవిధంగా చూసినా తెరాస ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలనను అందించడంలో ఘోరంగా విఫలమైందని ఆక్షేపించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు బి.దయాకర్‌రావు, డి.పోశెట్టి, వెంకటేశ్వరరావు, పి.ఇంద్రుడు, రాజేశ్వర్ లచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

22వ ఫ్యాకేజీ పునరుద్ధరణతో కల సకారం
సిం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు
శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ

భిక్కనూరు, ఫిబ్రవరి 12: 22వ ఫ్యాకేజీ పునరుద్ధరణతో తన కల సకారం కానుందని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం ఆయన రాజంపేట మండలంలోని ఆరెపల్లి గ్రామంలో తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన దివంగత మాజీ సర్పంచ్ తిక్కాజి తుక్కారం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆదేశానుసారం ప్రాణహిత - చేవెళ్ల పథకం ద్వారా కామారెడ్డి జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించాలన్న సకల్పంతో ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగిందన్నారు. శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో తాము అధికారం కొల్పోవడం, ప్రాణహిత చేవెళ్ల పథకం పూర్తి కాకుండానే సగంలోనే ఆగిపోయిందన్నారు. దీంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర వల్ల సిఎం కెసిఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించి వెంటనే పాత డిజైన్ ప్రకారం ప్రాణహిత - చేవెళ్ల ద్వారా సాగునీరు అందించాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ ప్రాణహిత - చేవెళ్ల ద్వారా త్వరలోనే వేల ఎకరాల్లో ఈ ప్రాంత రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశం లభిస్తందన్నారు. మాజీ సర్పంచ్ చేసిన కృషిని గుర్తించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చంద్రకాంత్‌రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మాజీ కార్యదర్శి చిన్నమల్లారెడ్డి, నాయకులు సిద్దిరాములు, సుదర్శన్, రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అంబేద్కర్ యువజన సంఘం డైరీని ఆవిష్కరణ
ఇందూర్, ఫిబ్రవరి 12: డాక్టర్ బిఆర్.అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2017 సంవత్సరం డైరీని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఆదివారం నందిపేట మండలం కుద్వాన్‌పూర్ ఎల్లమ్మగుట్టపై గల రేణుకామాత ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన ఎంపి, అంబేద్కర్ యువజన సంఘం సభ్యుల కోరిక మేరకు డైరీని ఆవిష్కరించడం జరిగిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు, డిఆర్‌డిఎ మానిటరింగ్ కమిటీ సభ్యుడు జె.నారాయణ తెలిపారు. గడిచిన 19సంవత్సరాలుగా అంబేద్కర్ యువజన సంఘం డైరీని ప్రచురిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమం కోసం ఉపయోగపడే అనేక జీవోలు, చట్టాల్లోని ముఖ్య అంశాలను ఇందులో పొందుపర్చడం జరిగిందన్నారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఎ.అశోక్, జి.సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం
డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 12: రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రానుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన దర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని, దీనిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ సర్కార్ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. రైతులకు రుణమాఫీతో పాటు పంటలు నష్టపోయిన వారికి ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించడంలో ఘోరంగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ శ్రేణులు ముందంజలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకవచ్చేందుకు కృషి చేయాలని తాహెర్ కోరారు. అనంతరం దర్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మనోహర్‌రెడ్డి, నర్సింగ్‌రావు, కర్క బాల్‌రెడ్డి, రమేష్‌గౌడ్, లింబాగౌడ్, రాజన్న, శ్రీ్ధర్‌గౌడ్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

పథకాల అమలుకు కృషి చేయాలి
మంత్రి పోచారం
కంఠేశ్వర్, ఫిబ్రవరి 12: అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ మల్చుకునే దిశలో ఉద్యోగులు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో తమవంతు పాత్ర పోషించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని కలెక్టరేట్ మైదానంలో 26వ టిఎన్జీఓస్ క్రీడల ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత టిఎన్జీఓలదేనని అన్నారు. తెలంగాణలోని నాలుగుకోట్ల మందికి సేవలు అందిస్తున్న ఉద్యోగుల్లో టిఎన్జీఓల పాత్ర ఎంతో కీలకమైందని ఆయన కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తికావడం జరిగిందని, ఆశించిన ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారికి ప్రస్తుతం సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని, అందులో భాగంగానే టిఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన స్వామిగౌడ్‌కు, సిఎం కెసిఆర్ మండలి చైర్మన్ పదవిని కట్టబెట్టడం జరిగిందన్నారు. దేశంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ నెంబర్ వన్‌గా పేరు తెచ్చుకుంటున్నారని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉంటూ సిఎం కెసిఆర్ కలలు కంటున్న బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే టిఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు కిషన్ ఉద్యోగులకు ఇండ్లు కావాలని కోరుతున్నారని, ఈ విషయాన్ని టిఎన్జీఓస్ గౌరవ అధ్యక్షుడు దేవిప్రసాద్, అధ్యక్షుడు రవీందర్‌రెడ్డిలతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీఓస్ గౌరవ అధ్యక్షుడు దేవిప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

నిరంతర ధ్యానంతో భగవంతుని అనుగ్రహం
సెట్విన్, ఇందిరిగాంధీ స్టేడియాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్

కామారెడ్డి, ఫిబ్రవరి 12: నిరంతర ధ్యానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం కలుగుతుందని, మానసిక ప్రశాంతతో వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీకృష్ణ ధాన్య మందిరం 6వ వార్షికోత్సవ సభకు ఆయన హాజరై మాట్లాడారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబంధిత జెండాను ఆవిష్కరించారు. వందలాది మంది భక్తులు శ్రీకృష్ణుడి సేవలో నిరంతరం ఉండడం గొప్ప విషయమన్నారు. బ్రహ్మచారులుగా ఉంటూ వారి జీవితాన్ని భగవంతునికి అంకితం చేయడం భక్త్భివానికి నిదర్శనమన్నారు. శ్రీకృష్ణ మందిర అభివృద్ధికి తనవంతు సహాయం ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో 3లక్షల రూపాయలతో ప్రహరీకి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌తో పాటు ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, మున్సిపల్ చైర్మన్ సుష్మ, టిఆర్‌ఎస్ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు బల్వంత్‌రావు, మనోహర్‌రావు, లక్ష్మీపతీయాదవ్, మోహన్‌రెడ్డి, ఆంజనేయులు, నిట్టు వెంకట్‌రావు, శ్యాంరావు, కిషన్‌రావు, బాబు, మచ్చేలేబాబా, తదితరులున్నారు.
సెట్విన్, ఇందిరిగాంధీ స్టేడియాన్ని పరిశీలించిన విప్
సెట్విన్ నూతన కార్యాలయాన్ని సోమవారం ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మరావుగౌడ్ ప్రారంభించనున్న దృష్ట్యా సెట్విన్ కార్యాలయాన్ని పరిశీలించారు. కంప్యూటర్ గదులు, కుట్టు మిషన్ శిక్షణ, బ్యూటిషియన్, తదితర కోర్సుల వివరాలను నిర్వాహకులు అమీనభేగంను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇందిరాగాంధీ స్టేడియంలో క్రీడ మ్యాచ్‌లను, వేడుకలను తిలకించేందుకు నిర్మించిన గ్యాలరీని మంత్రి ప్రారంభించనున్న దృష్ట్యా ప్రభుత్వ విప్ పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబోద్దీన్, నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బల్వంత్‌రావు, ఆంజనేయులు, గెరిగంటి లక్ష్మీనారాయణ, మాసుల లక్ష్మీనారాయణ, వైద్యులు అజయ్‌కుమార్, శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.