నిజామాబాద్

‘టెన్త్’లో మాస్‌కాపీయింగ్ యథాతథం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 20: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా యంత్రాంగం, సంబంధిత విద్యాశాఖ అధికారులు గొప్పగా ప్రకటనలు చేసినప్పటికీ, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభమైన ఎస్సెస్సీ పరీక్షల్లో మొదటి రోజు నుండే చూచిరాతల పర్వం కొనసాగుతుండడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. ర్యాంకుల పంట పండించుకోవాలని ఆరాటపడుతున్న పలు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తమదైన శైలిలో మాస్ కాపీయింగ్‌ను కొనసాగిస్తున్నారు. అడ్డదారులను అనే్వషించి ముందస్తుగానే చూచిరాతలకు రంగం సిద్ధం చేసుకున్న పలు ప్రైవేట్ యాజమాన్యాలు వినూత్న పద్ధతులను అవలంభిస్తూ కాపీయింగ్ తంతును నిర్విఘ్నంగా జరిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖకు చెందిన కొందరు అధికారులు కూడా ఇందుకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తూ, ముందస్తుగానే నజరానాలను అందుకున్నట్టు విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఎస్సెస్సీ ఫలితాల్లో ఇదివరకు వరుసగా మూడు పర్యాయాలు నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించగా, అనంతరం ఉత్తీర్ణత శాతం పడిపోయి జిల్లా ప్రతిష్ఠ ఒకింత మసకబారింది. దీంతో ఈసారి అధికారులు కూడా ఒకింత పట్టువిడుపు ధోరణిని ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు మరింత వెసులుబాటుగా మారింది. నామ్‌కేవాస్తేగా పలు సెంటర్లను తనిఖీ చేస్తూ మమ అనిపించుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఏ ఒక్క మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదు. నిజానికి పరీక్షలను కట్టుదిట్టమైన నిఘా మధ్యన కొనసాగిస్తామని కలెక్టర్ మొదలుకుని అధికారులందరూ తమ ప్రకటనల ద్వారా పదేపదే హెచ్చరించడంతో పరీక్షలు ప్రారంభమైన తొలి రోజున విద్యార్థులు ఒకింత భయంభయంగానే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. అయితే మెజార్టీ సెంటర్లలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆబ్జెక్టివ్ సమాధానాలను పలువురు ఇన్విజిలేటర్ల ద్వారా చెప్పించడంతో పాటు నకలు చీటీలు చూసి సమాధానాలు రాసే వారి గురించి అంతగా పట్టించుకోలేదు. దీనిని గమనించిన విద్యార్థులు ఆ మరుసటి రోజు నుండి పెద్ద మొత్తంలో నకలు చీటీలు వెంట తెచ్చుకుని మరీ పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కాపీయింగ్ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. నకలు చీటీలను మైక్రో జిరాక్స్‌లుగా చిన్నచిన్న కాపీలుగా తయారు చేసుకుని తీసుకెళ్తున్నట్టు సమాచారం. విద్యార్థులు అంచనా వేసిన ప్రశ్నలు రాని సందర్భాల్లో ప్రైవేట్ యాజమాన్యాలతో ముందస్తుగానే ఒప్పందం కుదుర్చుకున్న ఆయా సెంటర్ల పర్యవేక్షకులు నకలు చీటీలను విద్యార్థుల వద్దకు చేరవేయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ తతంగాన్ని పూర్తి చేసుకునేందుకు తమ పాఠశాల విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రాల్లో అనుకూలంగా ఉండే వారిని డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లుగా ఏరికోరి మరీ నియమించుకున్నట్టు తెలిసింది. అధికారుల నియామకాల వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాపీయింగ్‌ను నిరోధించేందుకు రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినప్పటికీ, ఈ బృందాలు ఆకస్మిక తనిఖీ కోసం ఆయా కేంద్రాలకు చేరుకునే లోపే ప్రైవేట్ విద్యాసంస్థల వారికి సెల్‌ఫోన్‌ల ద్వారా సమాచారం అందుతోంది. మరికొన్ని ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఏకంగా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లతో పరీక్షా కేంద్రం బయట సమాధాన పత్రాలు రాయిస్తూ, ముందుగానే తాము ఎంచుకున్న విద్యార్థి హాల్‌టికెట్ నెంబర్‌ను దానిపై పొందుపర్చి చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాల్లో చేరేవేసేందుకు సైతం తెగువను ప్రదర్శిస్తున్నారు. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణకు గాను అధికారుల నియామక ప్రక్రియలో జిల్లా యంత్రాంగం జోక్యం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులను అమ్యామ్యాలతో సంతృప్తిపరుస్తూ ర్యాంకుల కోసం అక్రమ భాగోతాలను నడిపిస్తున్నారన్న ప్రచారం కొనసాగుతోంది. ఈ చర్యల వల్ల కష్టపడి చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారి తల్లిదండ్రులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.