నిజామాబాద్

నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి, ఏప్రిల్ 27: దర్పల్లి మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో గడిచిన రెండు రోజుల నుండి ధాన్యం సేకరణను నిలిపివేశారు. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి ఆకస్మికంగా ఈ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ పనితీరును తప్పుబడుతూ, సొసైటీ కార్యదర్శి దయానంద్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయించారు. ధాన్యం క్వింటాలుకు 2కిలోల చొప్పున తరుగుగా లెక్కిస్తుండడాన్ని చూసి జె.సి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ పాలకవర్గం, అధికారులు మాత్రం ఈ చర్యను సమర్ధించుకుంటున్నారు. తాము ధాన్యం సేకరించి రైస్‌మిల్లర్లకు చేరవేస్తుండగా, మిల్లర్లు కూడా రెండు కిలోల చొప్పున తరుగు లెక్కిస్తున్నారని, అందువల్లే తాము కూడా రైతుల వద్ద తరుగును లెక్క గడుతున్నామని జె.సితో పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జె.సి సొసైటీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయించారు. దీంతో గత రెండు రోజుల నుండి ఈ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారు. ఈ విషయం తెలియని రైతులు రోజువారీలాగే ఈ కేంద్రానికి ధాన్యం తరలిస్తూ, లావాదేవీలు స్తంభించిపోవడాన్ని చూసి ఉసూరుమంటున్నారు. పాలకవర్గ ప్రతినిధులు కానీ, సొసైటీ అధికారులు కానీ తమ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ధాన్యం బరువు తగ్గిపోతోందని, తాము పంటకు కాపలాగా కొనుగోలు కేంద్రం వద్దే పడిగాపులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘం పాలకవర్గంలో ఉన్న అధికార పార్టీ నాయకులు రైతులను పట్టించుకోకుండా వరంగల్ సభకు బయలుదేరి వెళ్లడం పట్ల స్థానిక రైతులు పాలకవర్గం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూనే, తమ ఇబ్బందులను గమనించి కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం ఎంతవరకు సమంజమని ఆక్షేపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి
ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి

నిజామాబాద్, ఏప్రిల్ 27: నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎంపి ల్యాడ్ నిధులతో చేపట్టిన పనులపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, అసంపూర్తిగా ఉన్న పనులను శరవేగంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం తన చాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపి ల్యాడ్, సిడిఎఫ్ నిధులతో చేపట్టిన పనుల్లో చాలావరకు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి ఒప్పందం ఖరారైన మీదట కూడా గుత్తేదార్లు పనులను ప్రారంభించని పక్షంలో వారికి నోటీసులు జారీ చేయాలని, అప్పటికి కూడా స్పందించని పక్షంలో వారి ఒప్పందాలను రద్దు చేసుకుని కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. నామినేషన్ పద్ధతిపై చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. ఒకవేళ నామినేషన్ పద్ధతిపై పనులను ఎవరైనా ప్రారంభించకపోతే సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలను సంప్రదించి పరిస్థితి గురించి వివరించి వారి సహకారంతో పనులు వేగవంతమయ్యేలా చూడాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో ఎక్కడైనా స్థల సమస్య ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలన్నారు. అంతకుముందు సంబంధిత మండలాల తహశీల్దార్‌లను సంప్రదించి స్థల సమస్యపై చర్చించాలన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచామని, ఎక్కడైనా ఇసుక కొరత నెలకొని ఉంటే నేరుగా తనకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. పనులు చేపట్టే విషయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా వాటిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఎటొచ్చీ పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదేనని ఇంచార్జ్ కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను పూర్తిగా ఉచితంగా అందజేయడం జరుగుతుందని, ఇందుకోసం ఇసుక నిల్వలను సిద్ధంగా ఉంచుతున్నామని తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన మీదటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పనులను ప్రారంభించేలా చూడాలన్నారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగుతూ, నిర్ణీత గడువులోగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. వీటి నిర్మాణాలకు స్థల సమస్య ఉంటే తహశీల్దార్‌లను సంప్రదించాలని, స్పందించని పక్షంలో తన దృష్టికి తేవాలని అన్నారు. టెండర్లు ఖరారై గుత్తేదారుతో ఒప్పందం జరిగిన వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ ఇన్‌చార్జి ఎస్‌ఇ ప్రేమ్‌కుమార్, ఆర్ అండ్ బి ఇ.ఇ హన్మంత్‌రావు పాల్గొన్నారు.

హరితహారం మొక్కలకు ట్యాంకర్లతో నీరు
మోర్తాడ్, ఏప్రిల్ 27: హరితహారం కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో నాటిన మొక్కలను సంరక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రెండు మండలాల్లోనూ గత సంవత్సరం గ్రామానికి 40వేల వంతున మొక్కలు నాటిన విషయం విదితమే. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతుండగా, మిగతా ప్రాంతాల్లోని మొక్కలకు నీరందడం లేదు. ప్రధానంగా జాతీయ రహదారికి ఇరువైపులా పంట భూముల్లో నాటిన మొక్కలకు రైతులే నీటిని అందిస్తున్నారు. రోడ్డును ఆనుకుని ఉన్న పంట భూముల్లో మొక్కలు నాటడంతో ఆ సమయంలో రైతులు వ్యతిరేకించినా, నిబంధనల ప్రకారంగా ఆ భూమి ప్రభుత్వానిదేనని, అందువల్లే మొక్కలు నాటుతున్నామని తెలుపడంతో రైతులు మిన్నకుండిపోయారు. ఆ పంట భూముల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్న నేపథ్యంలో పంటలతో పాటు హరితహారం కింద నాటిన మొక్కలకు కూడా నీరంది మొక్కలు ఏపుగా పెరిగాయి. అయితే గ్రామీణ రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలకు మాత్రం నీరందించే వారు లేకపోవడంతో అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి రోజువారీగా నీటిని అందిస్తున్నారు. ఇందుకోసం ఉపాధి హామీ కూలీలను నియమించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్యాంకర్ల ద్వారా మొక్కలన్నింటికి నీటిని అందిస్తూ, వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తొలకరి వర్షాలు కురిసే వరకు ప్రతీరోజు ఈ కార్యక్రమం చేపడతామని అధికారులు చెబుతున్నారు.