నిజామాబాద్

ఇరాక్‌లో చిక్కుకున్న వందలాది తెలుగు కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 21: కుటుంబ పోషణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఇరాక్‌కు వెళ్లిన తెలుగు రాష్ట్రాల కార్మికులు నెలల తరబడి అక్కడే చిక్కుబడిపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలల సుదీర్ఘ ప్రయత్నం తరువాత, గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి చొరవతో నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు అతికష్టం మీద రెండు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకోగలిగాడు. గడిచిన రెండు సంవత్సరాల నుండి ఇరాక్‌లో దినదినగండంగా జీవనం వెళ్లదీసిన వైనం గురించి వివరిస్తూ శ్రీనివాస్ కన్నీటిపర్యంతం అయ్యాడు. స్థానికంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో కుటుంబ పోషణ కోసం గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని ఏజెంట్‌ను సంప్రదిస్తే, ఇరాక్‌లో ఎక్కువ జీతం లభిస్తుందని ఆశ కల్పించి తనవద్ద లక్షన్నర రూపాయలు తీసుకుని విజిట్ వీసాపై అక్కడికి పంపించాడని, అయితే తనకు ‘అఖామా’ వర్క్ పర్మిట్ అందించని కారణంగా దుర్భర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నాడు. అక్కడ చేసేందుకు పని లేక, ఉండేందుకు వసతి లేక రోడ్ల పక్కన పైపుల్లో తలదాచుకోవాల్సి వచ్చేదని, ఇక్కడి తెలుగు వారి రూమ్‌లలో కొన్నాళ్ల పాటు ఆశ్రయం పొందానని, ప్రతిరోజు ఒక పూట భోజనానికి కూడా పరితపించాల్సి వచ్చేదని వాపోయాడు. విజిట్ వీసా కాలపరిమితి ముగియడంతో స్వస్థలానికి తిరిగి వచ్చేందుకు సైతం అవకాశం లేకపోవడంతో ఇరాక్‌లోనే చిక్కుబడిపోవాల్సి వచ్చిందని, దీంతో తనను ఇండియా పంపాలంటే కనీసం 6లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సిందిగా అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి బసంత్‌రెడ్డికి వాట్సప్ ద్వారా తన గోడును వెళ్లబోసుకోగా, విదేశాంగ శాఖతో పాటు ఇరాక్‌లోని రాయబార కార్యాలయం ప్రతినిధులను, నిజామాబాద్ ఎంపీ కవితను సంప్రదించి 8మాసాల పాటు నిరంతరంగా ప్రయత్నాలు కొనసాగించిన ఫలితంగా ఎట్టకేలకు తాను స్వస్థలానికి చేరుకోగలిగానని శ్రీనివాస్ తెలిపాడు. ఇరాక్‌లో ఇంకా సుమారు వేయి మంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు చిక్కుబడిపోయి పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక రోడ్లపైనే, సిమెంట్ పైపుల్లో భారంగా కాలం వెళ్లదీస్తున్నారని ఇరాక్‌లో తెలుగోడి కష్టాలను ఏకరువు పెట్టాడు. ఇరాక్‌లోని ఎర్‌బిల్ పట్టణంలో ప్రస్తుతం వారంతా తలదాచుకుంటూ, స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు ఎంతో ఆతృతతో ఎదురుతెన్నులు చూస్తున్నారని చెప్పాడు. ఎర్‌బిల్‌తో పాటు పరిసర పట్టణాల్లోని కంపెనీల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని గల్ఫ్ ఏజెంట్లు నమ్మబలకడంతో నిజామాబాద్ సహా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన సుమారు సుమారు 400మంది లక్షా 20వేలు మొదలుకుని లక్షా 70వేల రూపాయల వరకు వీసాలకు డబ్బులు చెల్లించి ఏడాది క్రితం ఇరాక్‌కు పయనమయ్యారు. ఇదివరకు అమెరికా సైన్యాలు ఇరాక్‌లో క్యాంపులు కొనసాగించిన సమయంలో ఇక్కడి యువకులు ఆ దేశానికి పని కోసం వెళ్లి కొద్దోగొప్పో పైకంతో తిరిగి వచ్చారు. దీంతో ఇప్పుడు కూడా తమకు అదే తరహాలో ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశతో నిరుద్యోగులు అప్పుసొప్పులు చేసి మరీ ఇరాక్‌కు వెళ్లగా, అక్కడ ఏ ఒక్క కంపెనీలోనూ పనులు లభించకపోవడంతో తాము మోసపోయినట్టు గుర్తించారు. అక్కడి భారత రాయబార కార్యాలయానికి వెళ్లి తమ గోడును వెళ్లబోసుకోగా, విజిట్ వీసాలపై వచ్చిన బాధితుల సంఖ్య వందలాదిగా ఉండడంతో అందరికీ న్యాయం చేయలేక నిస్సహాయతను వెలిబుచ్చుతున్నారని తెలుస్తోంది. అఖామా(వర్క్ పర్మిట్) లేకపోవడంతో పోలీసుల కంటబడకుండా చాటుమాటుగా అరకొర పనులు చేసుకుంటూ రోడ్ల పక్కన, సిమెంట్ పైపులనే నివాసాలుగా మార్చుకుని దుర్భర జీవనాలు వెళ్లదీస్తున్నామని వేల్పూర్‌కు చెందిన ప్రభాకర్, ఆర్మూర్ మండలం చేపూర్‌కు చెందిన రమేష్‌లు వాట్సప్ వీడియో కాల్ ద్వారా తమ దైన్య స్థితి గురించి వివరించారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు దారీ తెన్ను కానరావడం లేదని, ఎడారి దేశంలో నిరాశ్రయులుగా మారి పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని గోడును వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన వారే సుమారు 200మంది వరకు ఇరాక్‌లో చిక్కుబడిపోయి ఉన్నారని వివరించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తమవారిని స్వస్థలాలకు రప్పించే ఏర్పాట్లు చేయాలంటూ మొరపెట్టుకుంటున్నారు.