నిజామాబాద్

ఇబ్బడిముబ్బడి ఖాళీలతో వైద్య సేవలు మెరుగుపడేదెలా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 22: ఏడంతస్తుల అద్దాల మేడ. అందుబాటులో ప్లేట్‌లెట్స్ కౌంటింగ్ మెషీన్, సీ.టీ స్కాన్ వంటి అధునాతన పరికరాలు. ఇలా పైకి అన్నీ సవ్యంగానే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, రోగులకు వైద్య సేవలందించే డాక్టర్లు, సిబ్బంది కొరత మాత్రం దూరం కాలేకపోతోంది. ఈ పరిస్థితి కారణంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తరుచూ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే కవలలకు జన్మనిచ్చి ఓ బాలింత మృతి చెందగా, ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించిన విషయం విదితమే. ఈ సంఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉందన్నది పక్కనబెడితే, పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రిలో ఎంతమంది వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నది పరిశీలిస్తే సగానికి పైగా ఖాళీలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్నప్పటికీ, దాదాపుగా అన్ని విభాగాల్లోనూ ఏళ్ల తరబడి డాక్టర్లు, సిబ్బంది పోస్టులు భర్తీకి నోచుకోలేకపోతున్నాయి. స్థానికంగా వైద్య కళాశాలను 2012లో ఏర్పాటు చేసిన సమయంలో దానికి అనుబంధంగా ఉన్న జిల్లా జనరల్ ఆసుపత్రిలో అవసరమైన పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ, అప్పటి ప్రభుత్వం జీవోను జారీ చేసినా, ఇంతవరకు పోస్టులను భర్తీ చేయలేకపోయారు. దీంతో రోగులకు అవసరమైన వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు. అనునిత్యం జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరుగుతుండడంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బందితోనే సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. గర్భిణీ స్ర్తిల నుండి మొదలుకుని అత్యవసర కేసుల వరకు, సాధారణ పేషెంట్ల నుండి ఇన్‌పేషెంట్ల వరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి రోగులు వైద్య సేవల కోసం జిల్లా ఆసుపత్రికి వస్తుంటారు. కానీ ఏ విభాగంలో చూసినా ఇబ్బడిముబ్బడిగా వైద్యుల ఖాళీలు ఉండడంతో అందుబాటులో ఉన్న వారితోనే ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. పారామెడికల్ సిబ్బంది కూడా సరిపడా లేకపోవడంతో కీలక విభాగంలోని పరికరాలు సైతం వినియోగించని దుస్థితి ఆసుపత్రిలో నెలకొని ఉంది. ఆసుపత్రిలో ఎక్కువగా గైనకాలజిస్టు, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, రేడియోలాజీ, ఆర్థోపెడిక్, పల్మనాలజీలతో పాటు ఇతర విభాగాలు ఏర్పాటైనప్పటికీ, వీటిలో 91 పోస్టులకు గాను 70పోస్టులు ఖాళీగానే ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్నందున 26మంది ప్రొఫెసర్లను భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 7గురు మాత్రమే అందుబాటులో ఉన్నారు. 19పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 46మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను 24మంది మాత్రమే ఉన్నారు. 91మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను కేవలం 21మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్, అనస్థీషియా, గైనకాలజీ విభాగాల్లో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. 450పారా మెడికల్ పోస్టులకు గాను 160వరకే పోస్టులను భర్తీ చేశారు. ఇలా అన్ని విభాగాల్లోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండడం వల్ల అందుబాటులో ఉన్న అరకొరమంది సిబ్బంది పైనే పెనుభారం పడుతోంది. ఖాళీలను భర్తీ చేయాలని జిల్లా ఆసుపత్రి వర్గాలు పదేపదే కోరుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. గత ఐదేళ్ల క్రితమే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ సైతం ఖాళీల భర్తీ కోసం ఆమోదం తెలిపినప్పటికీ, వైద్యులు, సిబ్బంది నియామకాల్లో ఏళ్ల తరబడి ఎడతెగని జాప్యం జరుగుతుండడం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లా జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అప్పుడే మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యం నెరవేరుతుందని సూచిస్తున్నారు.