నిజామాబాద్

బోధన్ సెగ్మెంట్‌లో బలపడుతున్న బీసీ నినాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 17: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బోధన్ శాసన సభ నియోజకవర్గంలో కుల సమీకరణలతో కూడిన రాజకీయాలు అంతకంతకూ వేడెక్కుతున్నాయి. ప్రధానంగా వెనుకబడిన తరగతులకు చెందిన పలువురు యువ నాయకులు బీ.సీ నినాదంతో హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఓ వైపు ప్రజా సమస్యలపై నిరసనలు చాటుతూనే, ఈ దఫా ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు బీ.సీలకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను జుక్కల్ ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌గా కొనసాగుతోంది. మిగతా ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి అన్ని సెగ్మెంట్లలో ఏదో ఒక సందర్భంగా బీ.సీలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఆ వర్గం వారు శాసనసభ్యులుగా ఎన్నికై చట్టసభకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. ఒక్క బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఈ సెగ్మెంట్ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు కూడా బీ.సీలు ఎవరూ ఇక్కడి నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించలేకపోయారు. ఈ సెగ్మెంట్ ఏర్పాటైన మీదట తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో బీఎన్.శాస్ర్తీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1957, 1962సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాస్‌రావు, ఎం.రాంగోపాల్‌రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తరువాత కూడా వరుసగా ఎ.దశావతారం, 1967లో ఆర్‌బీ.రావు, 1972లో నారాయణరెడ్డి, 1978లో గులాంసంధాని, 1983లో డీ.సాంబశివరావు, 1985, 1994 ఎన్నికల్లో మాజీ మంత్రి బషీరుద్దీన్‌బాబుఖాన్, 1989లో కొత్త రమాకాంత్, 1999, 2004, 2009లో వరుసగా పీ.సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ నమోదు చేశారు. గత 2014 ఎన్నికల్లో తెరాస తరఫున బరిలోకి దిగిన మహ్మద్ షకీల్‌ఆమిర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారు కాగా, ఇప్పటివరకు ఈ సెగ్మెంట్ నుండి ఎన్నికైన మిగతా వారందరూ అగ్రవర్ణాలకు చెందినవారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీ.సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు యువ నాయకులు ఈసారి ఎన్నికల్లో బీ.సీ నినాదాన్ని ప్రబలంగా వినిపించేందుకు అన్ని విధాలుగా సమాయత్తం అయ్యారు. ఈ సెగ్మెంట్‌లో బీ.సీ ఓటర్లు 53శాతం ఉండడంతో వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. సెగ్మెంట్‌లోని బీ.సీ సామాజిక వర్గాలను చైతన్యపరుస్తూ, నిజాం షుగర్స్ వంటి అంశాలపై గళమెత్తుతున్నారు. నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించి, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అన్నింటికి మించి జిల్లాలో మరెక్కడా లేనివిధంగా బోధన్ సెగ్మెంట్‌లో బీ.సీలను ప్రధాన పార్టీలన్నీ చిన్నచూపు చూస్తుండడాన్ని ఆక్షేపిస్తూ ఈసారి ఎన్నికల్లో బీ.సీలకే టిక్కెట్లు కేటాయించాలని మండల, డివిజన్ స్థాయి వరకు ధర్నాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే తరహాలో మరికొందరు బీ.సీ వర్గానికి చెందిన నేతలు సైతం వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపడుతూ, బీ.సీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు విరివిగా సదస్సులు నిర్వహిస్తున్నారు.
బట్టాపూర్‌లో తీజ్ వేడుకలు
మోర్తాడ్, జూలై 17: వర్షాకాలం ప్రారంభంలో గిరిజనులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే తీజ్ వేడుకలు ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పెళ్లికాని గిరిజన యువతులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి, అందంగా అలంకరించిన గినె్నల్లో మొలకెత్తిన గోధుమల నారును నెత్తిన ఎత్తుకొని గ్రామంలో ఊరేగించారు. డప్పువాయిధ్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ గిరిజనులంతా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ పండుగ చేయడం వల్ల పంటలు సవృద్ధిగా పండాలని, పెళ్లికాని యువతిలకు మంచి భర్తలు లభించాలని కోరుతూ ఈ పండుగ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ కార్యక్రమంలో బట్టాపూర్‌తో పాటు చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన గిరిజనులంతా పాల్గొన్నారు.
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
మోర్తాడ్, జూలై 17: పాఠశాలలో బ్యాగులు లేని పేద విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు సొంత ఖర్చులతో వాటిని ఖరీదు చేసి అందించారు. మోర్తాడ్ మండలం ధర్మోరా ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమారి, తన సొంత ఖర్చులతో 10వ తరగతి విద్యార్థులందరికి స్కూల్ బ్యాగ్‌లను కొనుగోలు చేసి అందజేశారు. మంచిగా చదువుకుని 10వ తరగతిలో అత్యంత ప్రతిభ చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పతాని గంగాధర్, రవికాంత్, రాజేశ్వర్, గణేష్ గౌరవ్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.