నిజామాబాద్

తెరపిచ్చిన వాన.. ఊపిరిపీల్చుకున్న ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 21: జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌లో వర్షపు జలాల్లో కొట్టుకుపోయి గల్లంతైన బాలుడి మృతదేహాన్ని శనివారం వెలికితీశారు. శుక్రవారం రాత్రి ఏకబిగిన రెండు గంటలకు పైగా కురిసిన కుండపోత వర్షంతో నిజామాబాద్ నగరం అతలాకుతలమైంది. భారీగా వర్షపు జలాలు చేరుకుని డ్రైనేజీలు పొంగిపొర్లడంతో జమీర్(7) అనే బాలుడు అందులో కొట్టుకుపోయి మరణించాడు. పోలీస్, రెవెన్యూ అధికారులతో పాటు బాధిత కుటుంబీకులు, స్థానికులు రాత్రంతా గాలింపులు కొనసాగించగా, ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటనతో బాధిత కుటుంబీకుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా కేంద్రానికి చెందిన రియాజ్, నీలోఫర్ దంపతులు తమ కుమారుడు జమీర్‌ను వెంటబెట్టుకుని గౌతంనగర్‌లో ఉండే తమ బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా అనుకోని రీతిలో ఈ దుర్ఘటన సంభవించడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలాఉండగా, కుండపోత వానతో అతలాకుతలం అయిన ఇందూరు నగరం, వర్షం నిలిచిపోవడంతో కాస్తంత తేరుకున్నట్లయ్యింది. మిషన్ భగీరథ, భూగర్భ డ్రైనేజీ పనుల కోసం ఎక్కడికక్కడ రోడ్లను తవ్వేసిన పరిస్థితుల్లో, భారీ వర్షం కురియడంతో పలుచోట్ల ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడిపోయి ప్రమాదాలకు గురికావాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా యంత్రాంగం శనివారం ఉదయం నుండే ఆఘమేఘాల మీద రోడ్లపై తవ్విన గుంతలను పూడ్చివేయించే పనిలో నిమగ్నమైంది. అయితే భారీ వర్షం కారణంగా శనివారం సైతం పలు ప్రాంతాల్లో రోడ్లపై పెద్దఎత్తున వరద జలాలు ప్రవహిస్తూ చిన్నపాటి చెరువులను తలపించాయి. నిజామాబాద్ నగరం అనే కాకుండా జిల్లా వ్యాప్తంగా మెజార్టీ మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. సగటున 25.6మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్‌లో 86.0మి.మీ వర్షం కురిసింది. నిజామాబాద్ నార్త్ మండలంలో 66.5మి.మీలు, ఎడపల్లిలో 59, నిజామాబాద్ రూరల్‌లో 58.5, భీమ్‌గల్‌లో 53, డిచ్‌పల్లిలో 40.9, దర్పల్లిలో 39.1, బోధన్‌లో 38.7, సిరికొండలో 34.2, జక్రాన్‌పల్లిలో 27.2, ఇందల్వాయిలో 22.5, మోపాల్‌లో 21.2, కోటగిరిలో 20.7మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ప్రధానంగా నిజామాబాద్‌లో కుండపోత వర్షం కురియడం నగర ప్రజలను ఒకింత ఆందోళనకు గురి చేసింది. ప్రధాన రహదారుల పై నుండి మోకాలి లోతు నీరు ప్రవహించడంతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతటు ప్రాంతాలు, మురికివాడల్లో నివసిస్తున్న బడుగు జీవులైతే రాత్రంతా జాగరణ చేయాల్సి వచ్చింది. వర్షపు జలాలు డ్రైనేజీల్లో కలిసి నివాస గృహాలను ముంచెత్తాయి. దీంతో అనేక కుటుంబాలు సామాన్లు కొట్టుకుపోకుండా కాపాడుకుంటూ, చిన్నారులను చంకనెత్తుకుని వర్షపు నీళ్లలోనే నిలబడి జాగరణ చేశారు. వర్షం ఎడతెరిపినిచ్చిన తరువాత కూడా చాలాసేపటి వరకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం పరిస్థితి కాస్తంత కుదుటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షం తాకిడి వల్ల అనేక కాలనీల్లో రాత్రి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజల సహనాన్ని పరీక్షించింది.