నిజామాబాద్

నిజాం సుగర్స్ లేఆఫ్ ఎత్తివేత కోసం కాంగ్రెస్ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, సెప్టెంబర్ 20: బోధన్ నిజాండెక్కన్ సుగర్స్ కర్మాగారంలో లేఆఫ్‌ను ఎత్తివేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఫ్యాక్టరీ వరకు బైక్ ర్యాలీ తీసిన నాయకులు కర్మాగారం వద్దకు వెళ్లి ముట్టడించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు అదనపు బలగాలతో అక్కడికి చేరుకుని నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నాయకులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు గుణప్రసాద్ మాట్లాడుతూ నిజాండెక్కన్ సుగర్స్ కర్మాగారంలో అక్రమంగా లేఆఫ్ వేసి రెండేళ్లు గడుస్తున్నా ఈ సర్కారు తనకేమి పట్టనట్లు వ్యవహరించి కార్మికులను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తుండటం వలన కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లిస్తామంటూ అధికార తెరాస నాయకులు కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాలుగా కార్మికులు ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోతుంటే తెరాస నాయకులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెరాస అధికారంలోనికి వస్తే వంద రోజులలో కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకువస్తామని గత ఎన్నికలలో వాగ్ధానం చేసి ఏకంగా ఫ్యాక్టరీని మూసి వేశారని ఆయన ఆరోపించారు. కార్మికులకు వేతనాలు కావని కర్మాగారం తెరిపించి వారికి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత గత రెండు రోజుల క్రితం అర్ధరాత్రి కార్మికులను పిలిపించుకుని వేతనాలు ఇస్తామని, విఆర్‌ఎస్ తీసుకోవాలని కార్మికులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇందులో ప్రైవేటు యాజమాన్యం యొక్క హస్తం కూడా ఉండి ఉంటుందని ఆయన విమర్శించారు. తక్షణమే ఈ కర్మాగారంలో లే ఆఫ్‌ను ఎత్తివేసి కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మొదటి నుండీ పోరాటం చేస్తుందని ఫ్యాక్టరీ తెరిచే వరకు కార్మికుల పక్షాన నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యదర్శి అబ్బగోని గంగాధర్‌గౌడ్, నాయకులు ఫయ్యాజుద్దీన్, విష్ణువర్ధన్‌రెడ్డి, హరికాంత్‌చారి, పూజారి లింగం, ఖలీమ్, జహీర్, దామోదర్, తోకల గంగారెడ్డి, రవిశంకర్, శంకర్‌గౌడ్, మధు, రవీందర్ యాదవ్, మందర్న రవి తదితరులు పాల్గొన్నారు.

అవగాహనతోనే పథకాల లక్ష్యం సఫలం
* కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు
ఇందూర్, సెప్టెంబర్ 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన ఉన్నప్పుడే, వారు ఆ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలుగుతారని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. గురువారం నెహ్రూ యువ కేంద్ర, క్షేత్ర ప్రచార విభాగం, నగర పాలక సంస్థ, డీఆర్‌డీఏ, కేర్ డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో ఓటరు నమోదు, స్వచ్ఛ భారత్, జేఎస్‌వై, ఆసుపత్రిలో ప్రసవాలు, బాలిక విద్యా తదితర అంశాలపై ఎన్‌సీసీ విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులతో డీఎస్‌ఏ నుండి నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ రామ్మోహన్‌రావు జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ పథకాల లక్ష్యాలు, అందుకు సంబంధించిన అర్హులు, లబ్ధిదారులకు తెలిసేలా అవగాహన కల్పించినప్పుడే, వారు పథకాలను సద్వినియోగం చేసుకుంటారని, అప్పు డే పథకాల లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రజల్లో మరింత ప్రచారం నిర్వహించడంతో వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల భవిత, హిందీ పక్షోత్సవ, సుకన్య సవృద్ధి యోజన, బేటీ పడావో-బేటీ బచావో, టీకా రక్ష, ఇంద్ర ధనుష్, ఆసుపత్రిలో ప్రసవం - తల్లీబిడ్డల క్షేమం, ప్లాస్టిక్ వినియోగం- అనర్థాలు అంశాలపై ప్లకార్డులతో ర్యాలీలో విద్యార్థులు ప్రదర్శించారు. ర్యాలీలో నగర మేయర్ ఆకుల సుజాత, కమిషనర్ జాన్ శాంసాన్, అదనపు డైరెక్టర్ జనరల్ టీవీకే.రెడ్డి, ఏడీ హరిబాబు, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ వినయ్‌కుమార్, ఎన్‌వైకే కోఆర్డినేటర్ రాంచందర్‌రావు, మెప్మా పీడీ రాములు, ఐఆర్‌సీఎస్ ఆంజనేయులుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.